సౌందర్య సంరక్షణ విభాగంలోకి రిలయన్స్‌ రిటైల్‌

6 Apr, 2023 01:02 IST|Sakshi

టిరా యాప్‌ ఆవిష్కరణ

న్యూఢిల్లీ: రిలయన్స్‌ రిటైల్‌ తాజాగా సౌందర్య, వ్యక్తిగత సంరక్షణ ఉత్పత్తుల విభాగంలోకి ప్రవేశించింది. టిరా పేరిట రిటైల్‌ ప్లాట్‌ఫాంను ఆవిష్కరించింది. యాప్, వెబ్‌సైట్‌తో పాటు ముంబైలో తొలి టిరా రిటైల్‌ స్టోర్‌ను కూడా ప్రారంభించింది. 100 పైచిలుకు నగరాల్లో వీటిని ఏర్పాటు చేసే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ బ్రాండ్‌తో రిలయన్స్‌ ఇకపై హెచ్‌యూఎల్, నైకా, టాటా, ఎల్‌వీఎంహెచ్‌ మొదలైన దిగ్గజాలతో పోటీపడనుందని పేర్కొన్నాయి.

అన్ని వర్గాల వినియోగదారులకు మెరుగైన అంతర్జాతీయ, దేశీయ సౌందర్య సంరక్షణ బ్రాండ్‌లను అందుబాటులోకి తెచ్చేందుకు టిరా ఉపయోగపడగలదని రిలయన్స్‌ రిటైల్‌ వెంచర్స్‌ ఈడీ ఈషా అంబానీ తెలిపారు. ఆన్‌లైన్‌ మార్కెట్‌ డేటా రీసెర్చ్‌ సంస్థ స్టాటిస్టా ప్రకారం దేశీయంగా బ్యూటీ, పర్సనల్‌ కేర్‌ మార్కెట్‌ 2023లో 27.23 బిలియన్‌ డాలర్లుగా ఉండనుంది. ఇందులో 12.7 శాతం వాటా ఆన్‌లైన్‌ అమ్మకాల ద్వారా రానుంది.

మరిన్ని వార్తలు