ఈషా అంబానీకి సరికొత్త వెపన్‌ దొరికిందా?

15 Apr, 2023 16:28 IST|Sakshi

గత ఏడాది రిలయన్స్‌ రీటైల్‌ డైరక్టర్‌గా బాధ్యతల్ని చేపట్టిన ముఖేష్‌ అంబానీ కుమార్తె ఈషా అంబానీకి ఆర్ఎస్ సోధి (రూపిందర్ సింగ్ సోధి) రూపంలో సరికొత్త వెపన్‌ దొరికిందా? రిలయన్స్‌ రీటైల్‌ సామ్రాజ్యాన్ని మరింత విస్తరించేందుకు ఈషా అంబానీ వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్నారా? అంటే అవుననే అంటున్నాయి పరిశ్రమ వర్గాలు.  

కలిసి పనిచేయాలి. కలిసి సంబరాలు చేసుకోవాలి. రియలన్స్‌ కంపెనీ ఓ సందర్భంలో ఇచ్చిన స్లోగన్‌ ఇది. ఈ మాట రిలయన్స్‌ అధినేత కుటుంబానికి అతికినట్లు సరిపోతుంది. ధీరూబాయ్‌ సృష్టించిన వ్యాపారానికి వారసుడిగా వచ్చి సామ్రాజ్యంలా విస్తరించారు ముఖేష్‌. ఇప్పుడు అంబానీ ఫ్యామిలీలో థర్డ్‌ జనరేషన్‌ రిలయన్స్‌ను మరింత ముందుకు తీసుకువెళ్లడానికి వ్యూహాలు రచిస్తుంది

ఈషా అంబానీ.. తండ్రికి తగ్గ తనయగా
రిలయన్స్‌ రీటైల్‌ విభాగానికి రారాణిగా కొనసాగుతున్న ఈషా అంబానీ.. తండ్రికి తగ్గ తనయగా ఏ రంగంలోకి అడుగు పెట్టినా తన దైన మార్క్‌ను చూపిస్తూ మరిన్ని విజయాలు సాధించాలని ఉవ్విళ్లూరుతున్నారు. ఇందులో భాగంగా గుజరాత్ కో-ఆపరేటివ్ మిల్క్ మేనేజిమెంట్ (జీసీఎంఎంఎఫ్‌‌నే అమూల్ (AMUL)గా పిలుస్తుంటారు) మేనేజింగ్ డైరెక్టర్‌గా పనిచేసిన ఆర్ఎస్ సోధికి ఈషా అంబానీ రిలయన్స్‌ రీటైల్‌, ఎఫ్‌ఎంసీజీ విభాగానికి అడ్వైజర్‌ బాధ్యతలు అప్పగించనున్నట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. ఇదే జరిగితే టెలికాం రంగాన్ని జియో శాసించినట్లే.. రీటైల్‌ విభాగంలో రిలయన్స్‌ టార్చ్‌ బేరర్‌గా ఎదుగుతుందనే అభిప్రాయాలు వ్యక్త మవుతున్నాయి.  

ఆర్ఎస్ సోధి ఎవరు?  
ఆర్ఎస్ సోధి ఢిల్లీలో జన్మించారు. మున్సిపల్ స్కూల్‌లో విద్యనభ్యసించిన ఆయన ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రూరల్ మేనేజ్‌మెంట్ ఆనంద్ (IIRMA) నుండి ఎంబీఏ పూర్తిచేశారు. అనంతరం అమూల్‌లో సీనియర్ సేల్స్ ఆఫీసర్‌గా చేరారు. 2010 జూన్‌లో కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్‌గా పదోన్నతి పొందారు.

సోధీ హయాంలో అమూల్‌ ప్రపంచంలోని అతిపెద్ద పాలను ఉత్పత్తి చేసే కంపెనీలలో ఒకటిగా ఎదిగింది. 1982లో అమూల్ ఆదాయం రూ.121 కోట్లు ఉన్నప్పుడు కంపెనీలో చేరగా.. 2022-23 నాటికి ఆ సంస్థ ఆదాయం రూ.72,000 కోట్లు దాటింది. ఇలా ఇంతింతై వటుడింతై అన్నట్లు ఎదిగిన అమూల్‌ సామ్రజ‍్యంలో సోధీ బాధ్యతలు కీలకమనే చెప్పుకోవాలి. ముఖ్యంగా  'వరల్డ్స్ ఒరిజినల్ ఎనర్జీ డ్రింక్', అమూల్ ధూద్ పీతా హై ఇండియా వంటి ప్రకటనలతో కంపెనీని లాభాల బాట పట్టించడంలో సిద్ధహస్తులయ్యారు.

    

కొర‌క‌రాని కొయ్య‌గా ‘కాంపా కోలా’
సాఫ్ట్‌ డ్రింక్‌ మార్కెట్‌ను శాసిస్తున్న కోకోకోలా, పెప్సికోకు చెక్‌ పెట్టేలా యాభై ఏళ్ల క్రితం అనతి కాలంలోనే మార్కెట్‌ అగ్రగామి బ్రాండ్‌గా ఎదిగిన ‘కాంపా కోలా’ హక్కులను రిలయన్స్‌ దక్కించుకుంది. ప్రత్యర్ధులకు కొర‌క‌రాని కొయ్య‌గా త‌యారైంది. అదే బాటలో ఇండియన్‌ డైరీ మార్కెట్‌ను శాంసించేలా రిలయన్స్‌ రీటైల్‌ విభాగానికి డైరక్టర్‌గా వ్యవహరిస్తున్న ఈషా అంబానీ ఆర్‌ఎస్‌ సోధీని నియమించుకోనున్నారు. కాగా, ప్రస్తుతం ఇండియన్‌ డైరీ మార్కెట్‌ వ్యాల్యూ రూ.13లక్షల కోట్లుగా ఉంది. 2027 నాటికి రూ.30 లక్షల కోట్లకు వృద్ది సాధించనుంది.

రిలయన్స్‌ రిటైల్‌ 
రిలయన్స్‌ రిటైల్‌ (Reliance Retail) బిజినెస్‌ కింద రిలయన్స్‌ ఫ్రెష్‌, రిలయన్స్‌ స్మార్ట్‌, రిలయన్స్‌ స్మార్ట్‌ పాయింట్, జియో మార్ట్‌, రిలయన్స్‌ డిజిటల్‌, జియో స్టోర్‌, రిలయన్స్‌ ట్రెండ్స్‌, ప్రాజెక్ట్‌ ఈవ్‌, ట్రెండ్స్‌ ఫుట్‌వేర్‌, రిలయన్స్‌ జువెల్స్‌, హామ్లేస్‌, రిలయన్స్‌ బ్రాండ్స్‌, రిలయన్స్‌ కన్జ్యూమర్‌ బ్రాండ్స్‌, 7-ఇలెవన్‌ వంటి బ్రాండ్లు ఉన్నాయి. 

చదవండి👉 ముగ్గురు పిల్లలకు..చాలా తెలివిగా ముఖేష్‌ అంబానీ వీలునామా,ఇషాకు రీటైల్‌ బాధ్యతలు!

మరిన్ని వార్తలు