నకిలీ జియోమార్ట్ : రిలయన్స్ అలర్ట్

27 Aug, 2020 19:48 IST|Sakshi

జియోమార్ట్ ఫ్రాంఛైజ్ పేరుతో నకిలీ వెబ్‌సైట్స్

అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక

సాక్షి, ముంబై: రిలయన్స్ రిటైల్ లిమిటెడ్ ఆన్‌లైన్ కిరాణా షాపింగ్ పోర్టల్ జియోమార్ట్ కు నకిలీ సెగ తగిలింది. దీంతో సంస్థ అధికారికంగా స్పందించింది. జియోమార్ట్  పేరు మీద ఫ్రాంఛైజీలను కోరుతున్న అక్రమార్కుల గురించి తమ దృష్టికి వచ్చిందని రిలయన్స్ రిటైల్ సంస్థ తాజాగా ప్రకటించింది. ప్రస్తుతం తాము ఎవరికీ డీలర్‌షిప్ లేదా ఫ్రాంఛైజ్‌లు ఇవ్వడం లేదని స్పష్టం చేసింది. అలాంటి నకిలీ వెబ్‌సైట్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రజలను హెచ్చరించింది. (చదవండి: జియో మార్ట్‌ దూకుడు: ఉచిత డెలివరీ )

జియోమార్ట్ బ్రాండ్ కింద ఆన్‌లైన్ కిరాణా సేవలను రిలయన్స్ ఇటీవల ప్రారంభించిన సంగతి తెలిసిందే. అయితే జియోమార్ట్ పేరుతో నకిలీ వెబ్‌సైట్స్ రూపొందించి, రిలయన్స్ రీటైల్‌తో సంబంధం ఉన్న వ్యక్తులుగా నమ్మిస్తున్నారని, జియోమార్ట్ ఫ్రాంఛైంజీలు ఇస్తామని మోసాలకు పాల్పడుతున్నారని రిలయన్స్ రిటైల్ హెచ్చరించింది. అసలు జియోమార్ట్ పేరుతో డీలర్‌షిప్, ఫ్రాంఛైజ్ మోడల్ లాంటి సేవల్ని ప్రారంభించలేదని తెలియజేసింది.

డీలర్‌షిప్, ఫ్రాంఛైజీల కోసం ఏ ఏజెంట్‌ను నియమించలేదని స్పష్టం చేసింది. ఫ్రాంఛైజీల పేరుతో డబ్బులు వసూలు చేయబోమని తెలిపింది. అలాగే అలాంటి వ్యక్తులతో జరిపే లావాదేవీలకు తాము బాధ్యత వహించమని ప్రజలు, తయారీదారులు, వ్యాపారులు, డీలర్లను హెచ్చరిస్తున్నామని కంపెనీ విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొంది. అంతేకాదు తమ ప్రతిష్టకు భంగం కలిగిస్తూ, తన బ్రాండ్‌ను దుర్వినియోగం చేసే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కూడా హెచ్చరించింది.

రిలయన్స్ రీటైల్ పేర్కొన్న నకిలీ వెబ్‌సైట్స్ 
1. jmartfranchise.in
2. jiodealership.com
3. jiomartfranchises.com
4. jiomartshop.info
5. jiomartreliance.com
6. jiomartfranchiseonline.com
7. jiomartsfranchises.online
8. jiomart-franchise.com
9. jiomartindia.in.net
10. jiomartfranchise.co

జియోమార్ట్ ఫ్రాంఛైజ్ పేరుతో ఎవరైనా మిమ్మల్ని సంప్రదించినా, డబ్బులు అడిగినా అలాంటి వారిపై తమకు ఫిర్యాదు చేయాలని  రిలయన్స్ రిటైల్‌ కోరింది.
IP Legal,
Reliance Retail Limited
Building 30, C wing, CA 05, Reliance Corporate Park,
Thane Belapur Road, Ghansoli, Navi Mumbai 400701
Email: IP.legal@ril.com

మరిన్ని వార్తలు