మార్కెట్‌ ర్యాలీకి రిలయన్స్‌ దన్ను!

21 Jul, 2022 06:46 IST|Sakshi

ముంబై: చమురు శుద్ధి కంపెనీలపై కేంద్రం విధించిన విండ్‌ఫాల్‌ పన్ను విధింపు రద్దుతో నాలుగోరోజూ బుల్స్‌ పరుగులు తీశాయి. విదేశీ ఇన్వెస్టర్లు తిరిగి కొనుగోళ్లు ప్రారంభించడం, ప్రపంచ మార్కెట్లలోని సానుకూల సంకేతాలు సెంటిమెంట్‌ను మరింత బలోపేతం చేశాయి. ఐటీ, ఇంధన, మెటల్‌ షేర్లు రాణించడంతో బుధవారం సెన్సెక్స్‌ 630 పాయింట్లు పెరిగి 55,398 వద్ద స్థిరపడింది.

నిఫ్టీ 180 పాయింట్లు బలపడి 16,521 వద్ద నిలిచింది. ఆటో, మీడియా, రియల్టీ షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. విదేశీ ఇన్వెస్టర్లు రూ.1781 కోట్ల విలువ షేర్లను కొన్నారు. దేశీ ఇన్వెస్టర్లు రూ.230 కోట్ల విలువ షేర్లను అమ్మేశారు. సెన్సెక్స్‌ సూచీ ఒకశాతానికి ర్యాలీ చేసిన నేపథ్యంలో ఇన్వెస్టర్ల సందగా భావించే బీఎస్‌ఈ నమోదిత కంపెనీల మొత్తం విలువ రూ.1.57 లక్షల కోట్లు పెరిగి రూ.258.12 లక్షల కోట్లకు చేరింది. బీఎస్‌ఈ ఎక్సే్చంజీలో నమోదైన ప్రతి పది కంపెనీ షేర్లలో ఏడు షేర్లు లాభపడ్డాయి. 150 స్టాకులు అప్పర్‌ సర్క్యూట్‌ వద్ద లాకయ్యాయి. సెన్సెక్స్‌ 30 షేర్లలో 22 షేర్లు, నిఫ్టీ–50 షేర్లలో 36 షేర్లు లాభపడ్డాయి. 

ఇంట్రాడే ట్రేడింగ్‌ ఇలా 
సెన్సెక్స్‌ 718 పాయింట్ల లాభంతో 55,486 వద్ద, నిఫ్టీ 222 పాయింట్లు పెరిగి 16,563 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. ఒక దశలో సెన్సెక్స్‌ 862 పాయింట్లు బలపడి 55,630 వద్ద, నిఫ్టీ 247 పాయింట్లు దూసుకెళ్లి 16,588 వద్ద ఇంట్రాడే గరిష్టాలను తాకాయి. మిడ్‌సెషన్‌ తర్వాత గరిష్టస్థాయిల వద్ద అమ్మకాలు జరగడంతో సూచీలు కొంతమేర లాభాలను కోల్పోయాయి. 

కేంద్రం ఇటీవల ముడిచమురు సంస్థలపై విధించిన విండ్‌ఫాల్‌ పన్ను తగ్గించింది. ఇంధన ఎగుమతులపైనా ఎక్ఛేంజ్‌ సుంకాన్ని కుదించింది. ప్రభుత్వ తాజా సవరణలతో అధిక వెయిటేజీ రిలయన్స్‌ (2.50% అప్‌) ప్రభావంతో ఇంధన షేర్లన్నీ రాణించి సూచీల ర్యాలీకి దన్నుగా నిలిచాయి. సెన్సెక్స్‌ ఆర్జించిన మొత్తం లాభాల్లో రిలయన్స్‌ షేరు వాటాయే 165 పాయింట్లు కావడం విశేషం. 

దేశీయ మార్కెట్లో విదేశీ ఇన్వెస్టర్లు వరుసగా  మూడోరోజూ కొనుగోళ్లు చేపట్టడం సెంటిమెంట్‌ మరింత బలపరిచింది. గత నెలలో రూ.5,0203 కోట్ల షేర్లను అమ్మేసిన ఎఫ్‌ఐఐలు ఈ జూలైలో ఇప్పటివరకు(20 తేదీ) రూ.8,847 కోట్ల విక్రయాలకే పరిమితమయ్యారు.  

కీలక కంపెనీల కార్పొరేట్‌ జూన్‌ త్రైమాసిక ఆర్థిక ఫలితాలు మెప్పించడంతో మంగళవారం యూఎస్‌ మార్కెట్లు మూడువారాల్లో అతిపెద్ద ర్యాలీ చేశాయి. చైనా కేంద్ర బ్యాంకు రుణాల ప్రామాణిక రేటును యథాతథంగా ఉంచడంతో ఆసియా మార్కెట్లు బుధవారం 2% లాభపడ్డాయి.

మరిన్ని సంగతులు 

విండ్‌ఫాల్‌ ట్యాక్స్‌ విధింపు కోత, మధ్యంతర డివిడెండ్‌ ప్రకటన అంశాలు వేదాంత షేరుకు డిమాండును పెంచాయి. బీఎస్‌ఈలో ఈ షేరు ఆరుశాతం పెరిగి రూ.253 వద్ద ముగిసింది. 

జూన్‌ త్రైమాసిక ఫలితాల ప్రకటన తర్వాత ఐసీఐసీఐ లాంబార్డ్‌ జనరల్‌ ఇన్సూరెన్స్‌ షేరు లాభాల స్వీకరణ చోటు చేసుకుంది. నాలుగు నష్టంతో రూ.1,217 వద్ద నిలిచింది.  

మార్కెట్‌ క్యాప్‌ విషయంలో ఎల్‌ఐసీ(రూ.4.35 లక్షల కోట్లు)ని ఎస్‌బీఐ (రూ.4.53 లక్షల కోట్లు) అధిగమించిన నేపథ్యంలో ఎస్‌బీఐ షేరు రెండుశాతం లాభపడి రూ.509 వద్ద స్థిరపడింది.

మరిన్ని వార్తలు