తేలని వివాదం.. బిగ్‌బజార్‌ని స్వాధీనం చేసుకోనున్న రిలయన్స్‌

26 Feb, 2022 16:36 IST|Sakshi

దేశంలోనే అతి పెద్ద వివాస్పద డీల్స్‌లో ఒకటిగా నిలిచింది ఫ్యూచర్‌ గ్రూప్‌ అమ్మకం. ఫ్యూచర్‌ గ్రూపులో అమెజాన్‌ పెట్టుబడులు ఉండగా.. దాన్ని రిలయన్స్‌ కొనుగోలు చేసేందుకు ప్రయత్నించింది. ఈ నిర్ణయం వివాస్పదం కావడంతో ఢిల్లీ హైకోర్టు, సుప్రీం కోర్టు, సింగపూర్‌ ఇంటర్నేషనల్‌ ఆర్బిట్రేషన్‌ సెంటర్‌లలో ఈ కేసుపై విచారణ కొనసాగుతున్నాయి.

రిలయన్స్‌ సంస్థ 2.3 బిలియన్‌ డాలర్లకు ఫ్యూచర్‌ కొనుగోలుకు ఒప్పందం చేసుకుంది. అమెజాన్‌ అభ్యంతరం వ్యక్తం చేయడంతో ఈ డీల్‌ మధ్యలో ఆగిపోయింది. ఈ వివాదం తలెత్తె సమయానికి దేశవ్యాప్తంగా ఫ్యూచర్‌ గ్రూప్‌కి 1700 అవుట్‌లెట్స్‌ ఉన్నాయి. సుదీర్ఘ విచారణ జరిగినా కేసు ఓ కొలిక్కి రాలేదు.

ఇంతలో ఫ్యూచర్‌ గ్రూప్‌ ఆధీనంలో ఉన్న అవుట్‌లెట్స్‌ లీజు అగ్రిమెంట్లు ముగుస్తున్నాయి. తమకు లీజు బకాయిలు చెల్లించాలంటూ భవనాల యజమానుల నుంచి ఒత్తిడి వస్తోంది. అంతేకాదు  రెండేళ్లుగా ఫ్యూచర్‌ ఆధీనంలో ఉన్న బిగ్‌బజార్‌ తదితర అవుట్‌లెట్ల వ్యాపారం మందగించింది. ఉద్యోగుల భవిష్యత్తు ప్రమాదంలో పడింది. 

కోర్టులో వివాదం నడుస్తున్నప్పటికీ ఫ్యూచర్‌ ఆధీనంలోని 1700 అవుట్‌లెట్లలో ఓ 200 అవుట్‌లెట్లను రిలయన్స్‌ స్వాధీనం చేసుకునే ఆలోచనలో ఉంది. వాటిని పాత పేరుతో లేదా రిలయన్స్‌ బ్రాండ్‌ కిందకు తీసుకువచ్చి వ్యాపారం పునరుద్ధరించే లక్ష్యంతో ఉంది. ఇప్పటికే ఎంపిక చేసిన రిటైల్‌ అవుట్‌లెట్లలో పని చేస్తున్న ఉద్యోగులకు సమాచారం అందించారు. 

అయితే ప్రస్తుత వ్యహారంపై రిలయన్స్‌, ఫ్యూచర్‌, అమెజాన్‌లు అధికారికంగా స్పందించలేదు. తాజా​ అప్‌డేట్స్‌ను ముందుగా రాయిటర్స్‌ ప్రచురించగా ఆ తర్వాత జాతీయ మీడియాలో ఇది హాట్‌టాపిక్‌గా మారింది. మరోవైపు ఫ్యూచర్‌ వివాదానికి సంబంధించి 2022 మార్చిలో న్యాయస్థానాల్లో మరోసారి విచారణ జరగనుంది.
 

మరిన్ని వార్తలు