Renault Kwid 800CC: వెబ్‌సైట్‌లో మాయమైన క్విడ్, ఇక కావాలన్నా కొనలేరు!

7 Apr, 2023 14:35 IST|Sakshi

భారతీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన హ్యాచ్‌బ్యాక్ కార్లలో ఒకటైన 'రెనాల్ట్ క్విడ్' (Renault Kwid) ఇప్పుడు కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌లో మాయమైంది. ఇటీవల అమలులోకి వచ్చిన రియల్ డ్రైవింగ్ ఎమిషన్ ఉద్గార ప్రమాణాలను దృష్టిలో ఉంచుకుని కంపెనీ ఈ మోడల్‌ని నిలిపివేసింది.

నివేదికల ప్రకారం.. క్విడ్ మార్కెట్లో మంచి అమ్మకాలను పొందుతున్నప్పటికీ కొత్త ఉద్గార ప్రమాణాలకు అనుకూలంగా అప్డేట్ చేయడం ఖర్చుతో కూడుకున్న పని. ఈ హ్యాచ్‌బ్యాక్ ఏ విధమైన అప్డేట్ పొందినప్పటికీ ధరల పెరుగుదల పొందుతుంది. అప్పుడు అమ్మకాలు తగ్గే అవకాశం ఉంటుంది. ఈ కారణంగానే కంపెనీ ఈ 800cc వెర్షన్‌ను తొలగించింది.

రెనాల్ట్ క్విడ్ 0.8 లీటర్ వెర్షన్ RXL, RXL(O) వేరియంట్‌లలో అందుబాటులో ఉంది. 800cc వేరియంట్ నిలిపివేయడంతో, రెనాల్ట్ ఇప్పుడు ఐదు వేరియంట్లలో 1.0 లీటర్ వెర్షన్‌ను మాత్రమే అందిస్తుంది. క్విడ్ 800 సీసీ వేరియంట్ త్రీ సిలిండర్, న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ పొందుతుంది. ఇది 52 బిహెచ్‌పి పవర్, 72 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది కేవలం 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌తో మాత్రమే అందుబాటులో ఉంటుంది.

(ఇదీ చదవండి: HYD ORR: ఓఆర్ఆర్ 30 ఏళ్ల లీజుకి రూ. 8వేల కోట్లు: రేసులో ఆ నాలుగు కంపెనీలు)

రెనాల్ట్ కంపెనీ కంటే ముందు మారుతి సుజుకి తన ఎంట్రీ-లెవల్ హ్యాచ్‌బ్యాక్ ఆల్టో 800ని నిలిపివేసింది. అంతే కాకుండా స్కోడా నుంచి ఆక్టావియా, హోండా జాజ్, 4వ తరం హోండా సిటీ ఉత్పత్తి కూడా నిలిపేయడం జరిగింది. నిజానికి కొత్త నిబంధనలు అమలులోకి రావడం వల్ల ఈ ఉత్పత్తులు నిలిచిపోయాయి. రానున్న రోజుల్లో మరిన్ని ఉత్పత్తులు నిలిచిపోయే అవకాశం ఉన్నట్లు స్పష్టంగా తెలుస్తోంది.

మరిన్ని వార్తలు