ఈజిప్ట్‌లో రెన్యూ పవర్‌ హైడ్రోజన్‌ ప్లాంట్‌

17 Nov, 2022 05:06 IST|Sakshi

8 బిలియన్‌ డాలర్ల పెట్టుబడులు

న్యూఢిల్లీ: ఈజిప్ట్‌లో రెన్యూ పవర్‌ పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టనుంది. సూయిజ్‌ కెనాల్‌ ఎకనమిక్‌ జోన్‌లో 8 బిలియన్‌ డాలర్ల (రూ.64 వేల కోట్లు) పెట్టుబడులతో హైడ్రోజన్‌ ప్లాంట్‌ ఏర్పాటు చేయనుంది. ఇందుకు సంబంధించి ఈజిప్ట్‌ ప్రభుత్వంతో రెన్యూ ఎనర్జీ గ్లోబల్‌ పీఎల్‌సీ (రెన్యూ) అనుబంధ కంపెనీ ‘రెన్యూ పవర్‌ ప్రైవేటు లిమిటెడ్‌’ ఒప్పందం చేసుకుంది. దీని ద్వారా ఏటా 2,20,000 టన్నుల గ్రీన్‌ హైడ్రోజన్‌ను ఉత్పత్తి చేయనున్నట్టు కంపెనీ తెలిపింది.

ఈ ఏడాది జూలైలోనే ఈజిప్ట్‌తో అవగాహన ఒప్పందం చేసుకోగా, ఇప్పుడు కార్యాచరణ ఒప్పందంపై సంతకాలు చేసినట్టు పేర్కొంది. దశలవారీగా ఈ ప్రాజెక్టు ఉత్పత్తిని ఆరంభిస్తుందంటూ, మొదటి దశలో 20,000 టన్నుల గ్రీన్‌ హైడ్రోజన్, డెరివేటివ్‌లను ఉత్పత్తి చేయనున్నట్టు తెలిపింది. కార్యాచరణ ఒప్పందం కింద, ప్రాజెక్టు, క్షేత్రస్థాయి అధ్యయనం నిర్వహించి, వచ్చే 12–16 నెలల్లో తుది నిర్ణయం తీసుకోనున్నట్టు ప్రకటించింది. ఈ ప్రాజెక్టుకు స్థానిక డెవలపర్‌గా ఎల్స్‌వెడీ ఎలక్ట్రిక్‌ ఎస్‌ఏఈ పనిచేయనుంది.   
 

మరిన్ని వార్తలు