సిద్ధమవుతున్న రామగుండం ప్లాంటు

24 Jul, 2020 05:25 IST|Sakshi

న్యూఢిల్లీ: రామగుండం ఫెర్టిలైజర్‌ ప్లాంటు తిరిగి ప్రారంభానికి సిద్ధమవుతోంది. ఇక్కడ 99.58 శాతం పనులు పూర్తి అయ్యాయని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. గోరఖ్‌పూర్‌ (యూపీ), సింద్రి (జార్ఖండ్‌), తాల్చేర్‌ (ఒడిషా) వద్ద ఉన్న ఫెర్టిలైజర్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియాకు చెందిన ఇతర ఖాయిలా పడ్డ యూనిట్లలో పనులు జరుగుతున్నాయని వివరించింది. గోరఖ్‌పూర్, సింద్రి యూనిట్లలో 2021లో, తాల్చేర్‌ ప్లాంటులో 2023లో యూరియా ఉత్పత్తి కార్యకలాపాలు తిరిగి మొదలు కానున్నాయి.

బిహార్‌లోని బరౌనిలో హిందుస్తాన్‌ ఫెర్టిలైజర్‌ కార్పొరేషన్‌కు చెందిన యూనిట్‌ను సైతం పునరుద్ధరిస్తున్నారు.  77.60 శాతం పనులు పూర్తి అయిన ఈ ప్లాంటు వచ్చే ఏడాది ప్రారంభం కానుంది. ఒక్కో ప్లాంటు వార్షిక సామర్థ్యం 1.27 మిలియన్‌ టన్నులు ఉండనుంది. దిగుమతులపై ఆధారపడకుండా దేశీయంగా యూరియా తయారీ చేపట్టాలన్నది కేంద్ర ప్రభుత్వ లక్ష్యం. ఈ నేపథ్యంలో మూతపడ్డ ఈ అయిదు ప్లాంట్లను కేంద్ర ప్రభుత్వం పునరుద్ధరిస్తోంది.

మరిన్ని వార్తలు