Cyber Attacks: సెబీ తాజా ఆదేశాలు 

1 Jul, 2022 09:58 IST|Sakshi

 సైబర్‌  ఎటాక్స్‌పై 6 గంటల్లోగా నివేదించాలి

పార్శ్వనాథ్‌ డెవలపర్స్‌కు సెబీ షాక్‌  

న్యూఢిల్లీ: అన్ని రకాల సైబర్‌ దాడులపై స్టాక్‌ బ్రోకర్లు, డిపాజిటరీ పార్టిసిపెంట్లు ఆరు గంటల్లోగా నివేదించమంటూ క్యాపిటల్‌ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ తాజాగా ఆదేశించింది. సైబర్‌ దాడులు, బెదిరింపులు, అతిక్రమణల సంబంధిత సంఘటనలను గుర్తించిన ఆరు గంటల్లోగా సమాచారం అందించ వలసి ఉంటుందని తెలియజేసింది. ఇలాంటి ఘటనలపై నిర్దేశిత సమయంలోగా స్టాక్‌  ఎక్స్‌చేంజీలు, డిపాజిటరీలు, సెబీకి తెలియజేయవలసిందిగా ఆదేశించింది. అంతేకాకుండా ఇలాంటి అంశాలపై ఇండియన్‌ కంప్యూటర్‌ ఎమర్జెన్సీ రెస్పాన్స్‌ టీమ్‌(సీఈఆర్‌టీ–ఇన్‌)కు సంబంధిత మార్గదర్శకాలకు అనుగుణంగా సమయానుగుణంగా వెల్లడించవలసి ఉంటుందని తాజాగా జారీ చేసిన సర్క్యులర్‌లో సెబీ పేర్కొంది. వీటికి అదనంగా నేషనల్‌ క్రిటికల్‌ ఇన్ఫర్మేషన్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ప్రొటెక్షన్‌ సెంటర్‌(ఎన్‌సీఐఐపీసీ) రక్షణాత్మక వ్యవస్థగా గుర్తించిన స్టాక్‌ బ్రోకర్లు, డిపాజిటరీ పారి్టసిపెంట్లు సైతం సైబర్‌ దాడులు జరిగినప్పుడు వెంటనే స్పందించవలసి ఉంటుంది. ఎన్‌సీఐఐపీసీకి నివేదించవలసిందిగా సెబీ వివరించింది. 

పార్శ్వనాథ్‌కు చెక్‌ 
లిస్టింగ్‌ నిబంధనలు ఉల్లంఘించడంతో సెక్యూరిటీ మార్కెట్ల నుంచి రియల్టీ రంగ కంపెనీ పార్శ్వనాథ్‌ డెవలపర్స్‌ను సెబీ ఆరు నెలలపాటు నిషేధించింది. అంతేకాకుండా రూ. 15 లక్షల జరిమానా సైతం విధించింది. 45 రోజుల్లోగా పెనాల్టీని చెల్లించాల్సింది ఆదేశించింది. కాంట్రాక్టర్లు, సబ్‌కాంట్రాక్టర్ల లెడ్జర్‌ ఖాతాలలో ఔట్‌స్టాండింగ్‌ మొత్తాలపై ప్రొవిజన్లు చేపట్టడంలో వైఫల్యానికి సెబీ చర్యలు చేపట్టింది. కన్‌స్ట్రక్షన్‌ కాంట్రాక్టుల విషయంలో అకౌంటింగ్‌ ప్రమాణాలను పాటించకపోవడంపై కొరడా ఝళిపించింది. 

కోటక్‌ ఏఎంసీకి సెబీ జరిమానా 
ఎస్సెల్‌ గ్రూపు కంపెనీల పెట్టుబడుల కేసు 
ఎస్సెల్‌ గ్రూపు కంపెనీల్లో పెట్టుబడులు పెట్టే విషయంలో మ్యూచువల్‌ ఫండ్స్‌ నిబంధనలను ఉల్లంఘించినందుకు కోటక్‌ ఏఎంసీ, సంస్థ ఉద్యోగులకు సెబీ రూ.1.6 కోట్ల పెనాల్టీలను విధించింది. కోటక్‌ ఏఎంసీ ఎండీ నీలేష్‌ షా, కోటక్‌ ఏఎంసీ ఫండ్‌ మేనేజర్లు లక్ష్మీ అయ్యర్, దీపక్‌ అగర్వాల్, అభిషేక్‌ బిసేన్, కాంప్లియన్స్‌ ఆఫీసర్‌ జాలీభట్, నాడు పెట్టుబడుల నిర్ణయాలను ఆమోదించిన ఇన్వెస్ట్‌ కమిటీ సభ్యుడు గౌరంగ్‌షాలను 45 రోజుల్లోగా పెనాల్టీ చెల్లించాలని ఆదేశాల్లో పేర్కొంది. కోటక్‌ ఏఎంసీ ఆరు డెట్‌ పథకాల తరఫున ఎస్సెల్‌ గ్రూపు రుణ పత్రాల్లో పెట్టుబడులు పెట్టింది. వాటి గడువు 2019 ఏప్రిల్, మే నెలల్లో ముగిసింది. ఎస్సెల్‌ గ్రూపు పీకల్లోతు రుణ సంక్షోభంలో జారిపోవడంతో, ఆ గ్రూపు ప్రమోటర్లు, సంస్థలతో కోటక్‌ ఏఎంసీ ఒక ఒప్పందం చేసుకుంది. ఆయా సంస్థల రుణ పత్రాలకు 2019 సెప్టెంబర్‌ 30 వరకు గడువు ఇచ్చింది.  అప్పటివరకు ఆరు కోటక్‌ డెట్‌ పథకాల ఇన్వెస్టర్లకు చెల్లింపులు చేయకపోవడాన్ని నిబంధనల ఉల్లంఘనగా సెబీ పరిగణించింది.   

మరిన్ని వార్తలు