బ్యాంకుల్లో ఏం జరుగుతోంది.. మూడేళ్లలో మోసాలు రూ.20వేల కోట్లు పైనే!

13 Aug, 2022 15:35 IST|Sakshi

139 కేసులు గుర్తింపు 

ఏబీబీఎఫ్‌ఎఫ్‌ నివేదిక 

న్యూఢిల్లీ: బ్యాంకింగ్, ఫైనాన్షియల్‌ మోసాలను అధ్యయనం చేసే సలహా మండలి (ఏబీబీఎఫ్‌ఎఫ్‌) గడిచిన మూడేళ్లలో 139 బ్యాంకు మోసాల కేసులు వెలుగు చూసినట్టు తెలిపింది. వీటికి సంబంధించిన విలువ రూ.21,735 కోట్లుగా ఉంటుందని పేర్కొంది. మాజీ సెంట్రల్‌ విజిలెన్స్‌ కమిషనర్‌ (సీవీసీ) టీఎం భాసిన్‌ ఏబీబీఎఫ్‌ఎఫ్‌కు నేతృత్వం వహిస్తున్నారు. ప్రభుత్వరంగ బ్యాంకులు, ఆర్థిక సంస్థలు వెల్లడించిన మోసం కేసులను ఆర్‌బీఐ సహకారంతో ఏబీబీఎఫ్‌ఎఫ్‌ పరీక్షిస్తుంటుంది.

ప్రభుత్వరంగ బ్యాంకుల్లో మోసాలు వెలుగు చూసినప్పుడు ముందుగా ఏబీబీఎఫ్‌ఎఫ్‌ విచారణ చేస్తుంది. అందులో బ్యాంకు ఉద్యోగుల పాత్ర ఉందా? నేరపూరిత కోణాలు ఉన్నాయా? అని పరీక్షించిన తర్వాతే వాటిని కేంద్ర దర్యాప్తు సంస్థలకు అప్పగిస్తుంది. సాధారణంగా రూ.50 కోట్లు అంతకుమించిన విలువైన కేసులను ఏబీబీఎఫ్‌ఎఫ్‌ తనిఖీ చేస్తుంది. అయితే రూ.3 కోట్లకు పైన మోసాలను కూడా పరీక్షించే అధికారాన్ని ఈ ఏడాది మొదట్లో కేంద్రం అప్పగించింది.

చదవండి: Reliance Jio: 75వ ఇండిపెండెన్స్‌ డే: జియో కొత్త రీచార్జ్‌ ప్లాన్‌ 

మరిన్ని వార్తలు