టీసీఎస్‌ ఉద్యోగులకు వేతన పెంపు

8 Oct, 2020 15:24 IST|Sakshi

ముంబై : కోవిడ్‌-19తో ఆర్థిక మందగమనం కార్పొరేట్‌ కంపెనీలను వణికిస్తుంటే తమ ఉద్యోగులందరికీ వేతన పెంపు చేపట్టనున్నట్టు టెక్‌ దిగ్గజం టీసీఎస్‌ ప్రకటించింది. కంపెనీలోని అన్ని విభాగాల ఉద్యోగుల వేతనాలను పెంచనున్నట్టు టీసీఎస్ హెచ్‌ఆర్‌ వర్గాలు పేర్కొన్నాయని ఓ జాతీయ వెబ్‌సైట్‌ వెల్లడించింది. కంపెనీ గతంలో ఇచ్చిన తరహాలోనే అదే ఆనవాయితీని కొనసాగిస్తూ వేతన పెంపును చేపట్టినట్టు టీసీఎస్‌ హెచ్‌ఆర్‌ అధికారి స్పష్టం చేశారు. కరోనా వైరస్‌ వ్యాప్తితో ఆర్థిక వ్యవస్థ కుదేలైన క్రమంలో ఐటీ కంపెనీలు కొద్దినెలలుగా వ్యయ నియంత్రణ చర్యలు చేపడుతున్నాయి. చదవండి : టీసీఎస్‌ మరో బంపర్‌ బైబ్యాక్‌

కరోనా కట్టడికి విధించిన దేశవ్యాప్త లాక్‌డౌన్‌తో వాణిజ్య, ఆర్థిక రంగాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. పలు కంపెనీలు లేఆఫ్‌లు, వేతన కోతలు విధించడంతో పాటు ఏడాది పాటు ప్రమోషన్లు, వేతన పెంపులను నిలిపివేసిన నేపథ్యంలో టీసీఎస్‌ వేతన పెంపును చేపట్టడం ఐటీ రంగానికి తీపికబురుగా మారింది. మరోవైపు టీసీఎస్‌లో నియామకాల ప్రక్రియా ఊపందుకుంది. భారత్‌లో 7,000 మంది ట్రైనీలను, అమెరికాలో 1000 మందిని ట్రైనీలను నియమించుకోనుంది.

మరిన్ని వార్తలు