ఆర్‌బీఐ పాలసీ సమావేశాలు ప్రారంభం

6 Apr, 2021 05:26 IST|Sakshi

రేపు విధాన నిర్ణయాల ప్రకటన

వడ్డీరేట్ల యథాతథానికే మొగ్గు!  

న్యూఢిల్లీ:  రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ద్రవ్య పరపతి విధాన కమిటీ (ఎంపీసీ) 2021–22 తొలి ద్వైమాసిక మూడురోజుల సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి.  కోవిడ్‌–19 కేసులు పెరుగుతుండటం, 2–6 శాతం మధ్య ద్రవ్యోల్బణ లక్ష్యానికి కట్టుబడి ఉండాలంటూ కేంద్రం నిర్దేశాల నేపథ్యంలో జరుగుతున్న ఈ సమావేశం కీలక నిర్ణయాలు బుధవారం వెల్లడవుతాయి. తాజా పాలసీ సమీక్షలోనూ కీలక వడ్డీ రేటు రెపో యథాతథ స్థితి కొనసాగించే అవకాశం ఉన్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. ఇదే జరిగితే రెపో యథాతథ స్థితి వరుసగా ఐదవసారి అవుతుంది. రేటు (బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్‌బీఐ వసూలు చేసే వడ్డీ రేటు) ప్రస్తుతం 4 శాతంగా ఉంది. ఎకానమీ రికవరీలో అసమానతలు ఉన్నాయని, కనిష్ట స్థాయి నుంచి కోలుకునే ప్రక్రియ నెమ్మదిగా జరుగుతోందని ఎడెల్వీజ్‌ రీసెర్చ్‌ తెలిపింది.

తాజాగా కోవిడ్‌ కేసులు విజృంభిస్తుండటం మరో కొత్త సవాలుగా మారిందని పేర్కొంది. ఈ పరిస్థితుల్లో ఇటు వృద్ధికి, అటు ద్రవ్యోల్బణ కట్టడికి ఎప్పటికప్పుడు విధానపరమైన చర్యల తోడ్పాటు అవసరమని తెలిపింది. ఈ నేపథ్యంలో రిజర్వ్‌ బ్యాంక్‌ వడ్డీ రేట్లను యథాతథంగా కొనసాగించే అవకాశం ఉందని వివరించింది. ఒకవైపు కోవిడ్‌–19 కేసులు, మరోవైపు ద్రవ్యోల్బణం పెరుగుతుండటంతో రిజర్వ్‌ బ్యాంక్‌ పరిస్థితి సంక్లిష్టంగా మారిందని హౌసింగ్‌డాట్‌కామ్‌ గ్రూప్‌ సీఈవో ధృవ్‌ అగర్వాలా చెప్పారు. దీనితో తాజా ద్వైమాసిక సమీక్షలో రెపో రేటును మార్చకపోవచ్చని        పేర్కొన్నారు.   గత ఏడాది ఫిబ్రవరి తర్వాత రెపో రేటును 115 బేసిస్‌ పాయింట్లు (100 బేసిస్‌ పాయింట్లు ఒకశాతం) తగ్గించిన సెంట్రల్‌ బ్యాంక్, గడచిన (2020 ఆగస్టు, అక్టోబర్, డిసెంబర్, ఫిబ్రవరి 2021 నెలల్లో) నాలుగు ద్వైమాసిక     సమావేశాల్లో యథాతథ రేటును కొనసాగిస్తోంది. రిటైల్‌ ద్రవ్యోల్బణం భయాలను ఇందుకు కారణంగా చూపుతోంది.

18 పైసలు తగ్గిన రూపాయి
ముంబై: ఫారెక్స్‌ మార్కెట్లో సోమవారం రూపాయి విలువ 18 పైసలు కరిగిపోయి 73.30 వద్ద ముగిసింది. అంతర్జాతీయ మార్కెట్లో డాలర్‌ బలపడటం, దేశీయ ఈక్విటీ మార్కెట్‌ పతనం రూపాయి క్షీణతకు కారణమయ్యాయి. ఇంట్రాడేలో 73.28 – 73.45 రేంజ్‌లో కదలాడింది.  ఆర్థిక వ్యవస్థ రికవరీకి తోడ్పడే సంస్కరణలేవీ లేకపోవడం, దేశీయ స్థూల ఆర్థిక గణాంకాలు నిరుత్సాహపరచడంతో రూపాయి రానున్న రోజుల్లో బలహీనంగా ట్రేడయ్యే అవకాశం ఉంది’ అని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ రీసెర్చ్‌ విశ్లేషకుడు దిలీప్‌ పర్మర్‌ తెలిపారు.

మరిన్ని వార్తలు