ఆర్‌బీఐ ఎంపీసీ సమావేశం వాయిదా

29 Sep, 2020 04:37 IST|Sakshi

త్వరలో కొత్త తేదీలను ప్రకటిస్తామని వెల్లడి

గత నెలతో ముగిసిన ముగ్గురు ఎక్స్‌టర్నల్‌ సభ్యుల పదవీకాలం

ముంబై: రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) ద్రవ్య పరపతి విధాన కమిటీ (ఎంపీసీ) సమావేశం వాయిదా పడింది. తదుపరి సమావేశ తేదీలను తరువాత ప్రకటించడం జరుగుతుందని ఆర్‌బీఐ నోటిఫికేషన్‌ ఒకటి తెలిపింది.  మంగళవారం నుంచి మూడు రోజులపాటు (సెప్టెంబర్‌ 29, 30, అక్టోబర్‌ 1) ఈ కీలక భేటీ జరగాల్సి ఉంది. కమిటీలో స్వతంత్ర సభ్యుల నియామకంలో జరిగిన ఆలస్యం, దీనితో సమావేశం నిర్వహణకు సంబంధించి పాల్గొనాల్సిన కనీస సభ్యుల సంఖ్య (కోరమ్‌) తగ్గే అవకాశాలు ఏర్పడ్డం వంటి అంశాలు ఎంపీసీ సమావేశం వాయిదాకు కారణమని తెలుస్తోంది.

బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్‌బీఐ వసూలు చేసే వడ్డీరేటు రెపో (ప్రస్తుతం 4 శాతం)సహా ఆర్థిక రంగానికి సంబంధించి పలు కీలక నిర్ణయాలను ఆర్‌బీఐ గవర్నర్‌ నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల సమావేశం తీసుకునే కీలక సాంప్రదాయం 2016 అక్టోబర్‌ నుంచీ ప్రారంభమైంది. ఇందులో సగం మంది సభ్యులు బయటివారు(ఎక్స్‌టర్నల్‌).  అలాగే కమిటీలో వీరు స్వతంత్ర సభ్యులుగా ఉంటారు. ఈ ముగ్గురు సభ్యుల బాధ్యతల కాలం నాలుగేళ్లు. గత నెలతో వీరి పదవీకాలం ముగిసిపోయింది. అయితే కొత్తవారి నియామకం జరగలేదు. పాతవారి పునఃనియామకం అవకాశం ఉండదు. 

సమావేశంలో కనీసం నలుగురు సభ్యులు పాల్గొనాల్సి ఉంది. గవర్నర్‌ లేదా కమిటీలో సభ్యులుగా ఉన్న ఆయన డిప్యూటీ (పరపతి విధానం ఇన్‌చార్జ్‌) సమావేశంలో తప్పనిసరిగా పాల్గొనాల్సి ఉంటుంది. కమిటీలో ఆర్‌బీఐ తరఫున సెంట్రల్‌ బోర్డ్‌ నియమించిన మరో సీనియర్‌ అధికా రి కూడా సభ్యులుగా ఉంటారు. బయటి నుంచి కొత్తగా ముగ్గురు సభ్యులను నియమించేందుకు ఈ ఏడాది మొదట్లో ఒక కమిటీ ఏర్పాటైంది. క్యాబినెట్‌ కార్యదర్శి, ఆర్‌బీఐ గవర్నర్, ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి ఈ కమిటీలో సభ్యులుగా ఉన్నారు. ఆగస్టు 4వ తేదీ నుంచి 6వ తేదీ వరకూ  ఎంపీసీ చివరి 24వ సమావేశం జరిగింది.  

మరిన్ని వార్తలు