ఆర్‌బీఐ వడ్డీరేట్ల ఊరట..!

5 Jun, 2021 01:37 IST|Sakshi

కరోనా కష్టం తగ్గే వరకూ అండదండలు!

ద్రవ్యపరపతి విధాన సమీక్షలో కీలక నిర్ణయాలు 

2021–22లో వృద్ధి అంచనా 9.5 శాతమే

గత అంచనాలకు ఒక శాతం కోత

ఆర్థికాభివృద్ధికి సరళతర విధానమే శరణ్యం

4 శాతం యథాతథ రెపో కొనసాగింపు

దీనితో తక్కువ స్థాయిలోనే రుణ రేట్లు

కోవిడ్‌–19 కష్టాల్లో ఉన్న రంగాలకు చేయూత

బ్యాంకులు, సిడ్బీకి అదనపు నిధులు

క్రిప్టో కరెన్సీపై కొనసాగనున్న కఠిన వైఖరి

ముంబై: దేశంలో కరోనా ప్రభావం కనిష్ట స్థాయికి చేరే వరకూ తగిన సరళతర ద్రవ్య, పరపతి విధానాలనే అనుసరిస్తామని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) ద్రవ్య పరపతి విధాన కమిటీ (ఎంపీసీ) భరోసా ఇచ్చింది.  కరోనా సెకండ్‌ వేవ్‌ భారత్‌ ఆర్థిక వ్యవస్థను అనిశ్చితిలోకి నెట్టిందని పేర్కొంది.  ఈ పరిస్థితుల్లో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2021ఏప్రిల్‌–2022 మార్చి) వృద్ధి రేటు 9.5 శాతంగానే ఉంటుందని అంచనావేసింది. ఈ విషయంలో గత అంచనా 10.5 శాతానికి ఒకశాతం మేర కోత పెట్టింది. ఈ పరిస్థితుల్లో ఎకానమీ వృద్ధికి సరళతర ద్రవ్య పరపతి విధానాన్ని కొనసాగించక తప్పదని స్పష్టం చేసింది.

బ్యాంకులకు తానిచ్చే రుణాలపై వసూలు చేసే వడ్డీరేటు– రెపోను వరుసగా ఆరవ ద్వైమాసిక సమావేశంలోనూ యథాతథంగా 4 శాతంగా కొనసాగించాలని గవర్నర్‌ శక్తికాంత్‌దాస్‌  నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల  ఎంపీసీ ఏకగ్రీవంగా నిర్ణయించింది. దీనితోపాటు అవసరమైతే మరింత తగ్గించే అవకాశం ఉందనీ సంకేతాలు ఇచ్చింది. మార్చి 2020 తర్వాత 115 బేసిస్‌ పాయింట్లు రెపోను తగ్గించిన ఆర్‌బీఐ, కరోనా కష్ట కాలం దేశానికి ప్రారంభమైన తర్వాత యథాతథ రేటును కొనసాగిస్తూ వస్తోంది.   ఇక బ్యాంకులు తమ అదనపు నిధుల డిపాజిట్‌పై ఇచ్చే వడ్డీ–రివర్స్‌ రెపో రేటును కూడా యథాతథంగా 3.35గా కొనసాగించాలని నిర్ణయం తీసుకుంది.   2వ తేదీ నుంచి 4వ తేదీ వరకూ జరిగిన ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండవ ద్వైమాసిక ద్రవ్య పరపతి విధాన సమీక్ష అనంతరం గవర్నర్‌ శక్తికాంత్‌దాస్‌ మీడియాతో మాట్లాడారు. సంబంధిత వివరాలు, నిర్ణయాలను క్లుప్లంగా పరిశీలిస్తే..  

కట్టడిలో ద్రవ్యోల్బణం
ద్రవ్యోల్బణం కట్టడిలో ఉండడం  సరళతర ద్రవ్య విధానం కొనసాగింపునకు దోహదపడుతుందని ఆర్‌బీఐ విశ్లేషించింది. కేంద్రం నిర్దేశాలకు (2 నుంచి 6 శాతం మధ్య) అనుగుణంగా 2021–22లో రిటైల్‌  ద్రవ్యోల్బణం సగటున 5.1 శాతంగా కొనసాగుతుందని అంచనావేసింది. అయితే ఇది గత అంచనాలకన్నా 10 బేసిస్‌ పాయింట్లు (100 బేసిస్‌ పాయింట్లు ఒకశాతం) ఎక్కువ కావడం గమనార్హం.  

బ్యాంకింగ్‌కు నిధుల భరోసా
2021–22 ఆర్థిక సంవత్సరంలో తీవ్రంగా నష్టపోయిన రంగాలకు రుణ సహాయాన్ని అందించడానికి భారత చిన్న పరిశ్రమల అభివృద్ధి బ్యాంక్‌ (ఎస్‌ఐడీబీఐ– సిడ్బీ)సహా ఫైనాన్షియల్‌ సంస్థలకు తాజా మద్దతు ప్రకటించింది. ఇందులో భాగంగా 2022 మార్చి 31 వరకూ రూ.15,000 కోట్ల ప్రత్యేక లిక్విడిటీ విండో (ద్రవ్య లభ్యత సౌలభ్యం)ను ప్రకటించింది. ఈ విండో కింద బ్యాంకులు మూడేళ్ల కాలానికి రెపో రేటుకు రుణాలను తీసుకోవచ్చు. తద్వారా హోటల్స్, రెస్టారెంట్లు, పర్యాటకం వంటి కోవిడ్‌ బాధిత రంగాల పునరుద్ధరణకు బ్యాంకులు రుణ సహాయం అందించవచ్చు. దీనికితోడు లఘు, మధ్య చిన్న తరహా పరిశ్రమలకు (ఎంఎస్‌ఎంఈ) చేయూతను ఇవ్వడానికి  సిడ్బీకి రూ.16,000 కోట్ల అదనపు నిధిని కేటాయించింది. కరోనా కష్టాల్లో ఉన్న రంగాలకు రుణ సహాయ పరిమితిని రూ.25 కోట్ల నుంచి రూ.50 కోట్లకు పెంచింది.

రుణ రేట్ల కట్టడికి... బాండ్ల కొనుగోలు
సరళ విధానంలో రుణ రేట్లను కట్టడిలో ఉంచడానికి రెండవ త్రైమాసికంలో గవర్నమెంట్‌ సెక్యూరిటీస్‌ అక్విజేషన్‌ కార్యక్రమం (జీ–ఎస్‌ఏపీ–2.0) కింద అదనంగా రూ.1.2 లక్షల కోట్ల  బాండ్లను కొనుగోలు చేయనున్నట్లు ఆర్‌బీఐ ప్రకటించింది. ఏప్రిల్‌–మే మధ్య జీ–ఎస్‌ఏపీ–1.0 కింద రూ. లక్ష కోట్ల విలువైన ప్రభుత్వ బాండ్లను కొనుగోలు చేస్తామని ఆర్‌బీఐ ఏప్రిల్‌లో ప్రకటించిన సంగతి తెలిసిందే.

ఆగస్టు 1 నుంచీ నిరంతరం... ఎన్‌ఏసీహెచ్‌
నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎన్‌పీసీఐ) నిర్వహిస్తున్న నేషనల్‌ ఆటోమేటెడ్‌ క్లియరింగ్‌ హౌస్‌ (ఎన్‌ఏసీహెచ్‌) వ్యవస్థ 2021 ఆగస్టు 1వ తేదీ నుంచి నిరంతరం అన్ని రోజులూ అందుబాటులో ఉంటుంది. ప్రస్తుతం బ్యాంకింగ్‌ పనిదినాల్లో మాత్రం ఈ సౌలభ్యం అందుబాటులో ఉంటోంది.  చెల్లింపులకు సంబంధించి మధ్యవర్తిత్వ సంస్థగా ఎన్‌ఏసీహెచ్‌ నుంచి అత్యాధునిక సేవలు అందుబాటులో ఉంటాయి. డివిడెండ్, వడ్డీ, వేతనం, పెన్షన్‌ వంటి బదలాయింపులకు అలాగే విద్యుత్, గ్యాస్‌ టెలిఫోన్, వాటర్‌ నెలవారీ రుణ వాయిదాలు, మ్యూచువల్‌ ఫండ్స్, బీమా ప్రీమియం చెల్లింపులకు ఎన్‌ఏసీహెచ్‌ వ్యవస్థ కీలక సేవలు అందిస్తోంది.  

క్రిప్టో కరెన్సీపై ఆందోళనలు ఉన్నాయ్‌...
బిట్‌కాయిన్‌ వంటి క్రిప్టో కరెన్సీలపై ఆర్‌బీఐ వైఖరిలో  మార్పు లేదు. తీవ్ర ఒడిదుడుకులకు లోనయ్యే ఇలాంటి ఇన్‌స్ట్రమెంట్లపై ‘‘తీవ్ర ఆందోళనలు’’ ఉన్నాయి. ఇప్పటికే దీనిపై విడుదల చేసిన ఆర్‌బీఐ సర్క్యులర్‌ ఆయా అంశాలకు సంబంధించి పూర్తి స్పష్టతను ఇచ్చింది. 2018లో తొలుత ఇందుకు సంబంధించి జారీ చేసిన ఒక సర్క్యులర్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఈ నేపథ్యంలో సవరిత నోటిఫికేషన్‌ను తాజాగా ఆర్థిక సంస్థలకు జారీ చేయడం జరిగింది. అందువల్ల క్రిప్టోకరెన్సీ అంశాల విషయంలో 2018 నాటి సర్క్యులేషన్‌ను ఉదహరించవద్దని తాజా నోటిఫికేషన్‌లో బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలు, పేమెంట్‌ వ్యవస్థలకు ఆర్‌బీఐ సూచిస్తోంది. 

మరిన్ని వార్తలు