ప్యారడైజ్‌ బిర్యానీ.. ఇక దేశమంతటా..

11 Feb, 2022 09:08 IST|Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: దాదాపు ఏడు దశాబ్దాల పైగా చరిత్ర గల బిర్యానీ చెయిన్‌ ప్యారడైజ్‌ ఫుడ్‌ కోర్ట్స్‌ దేశవ్యాప్తంగా కార్యకలాపాల విస్తరణపై మరింతగా దృష్టి పెడుతోంది. ఈ ఏడాది ఆఖరు నాటికి 100 రెస్టారెంట్ల మార్కును అధిగమించాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది. 2026–27 నాటికి దీన్ని 500కు పెంచుకోనున్నట్లు సంస్థ సీఈవో గౌతమ్‌ గుప్తా తెలిపారు.

సౌతిండియాలో
హైదరాబాద్‌లో 50వ రెస్టారెంట్‌ ప్రారంభించిన సందర్భంగా సంస్థ సీఈవో గౌతమ్‌ గుప్తా మాట్లాడుతూ.. ప్రస్తుతం ఆరు రాష్ట్రాల్లోని 13 నగరాల్లో కార్యకలాపాలు ఉండగా తూర్పు, పశ్చిమ, ఉత్తరాది రాష్ట్రాల్లో కూడా విస్తరించనున్నట్లు వివరించారు. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల్లో 200 - 250 రెస్టారెంట్లు ప్రారంభించేలా ప్లాన్‌ చేస్తున్నారు. ఈస్ట్‌లో కోల్‌కతాపై ఫోకస్‌ చేయనుంది ప్యారడైజ్‌. 

తెలుగు రాష్ట్రాల్లో 100
విస్తరణలో భాగంగా త​‍్వరలో దేశవ్యాప్తంగా 450 రెస్టారెంట్లను ప్రారంభించాలని ప్యారడైజ్‌ లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో వందకు పైగా రెస్టారెంట్లు రెండు తెలుగు రాష్ట్రాల్లోనే నెలకొల్పనుంది. దాదాపుగా పాత జిల్లా కేంద్రాలు, ప్రముఖ పట్టణాల్లో రెస్టారెంట్లు వచ్చే ఆస్కారం ఉంది. ఇటీవల వరంగల్‌ లాంటి టైర్‌ టూ సిటీలో కూడా రెస్టారెంట్‌ ప్రారంభించింది ప్యారడైజ్‌. త్వరలో ఇతర పట్టణాల్లోనూ ప్యారడైజ్‌ బిర్యానీ అందుబాటులోకి రానుంది. 

విదేశాల్లో
సికింద్రాబాద్‌లో ప్యారడైజ్‌ సినిమా థియేటర్‌కి అనుబంధంగా చిన్న క్యాంటీన్‌గా ప్యారడైజ​ బిర్యానీ ప్రారంభమైంది. ఆ తర్వాత అంచెలంచెలుగా బిర్యానీ బ్రాండ్‌గా ఎదిగింది. త్వరలోనే యూకే, యూఎస్‌, మిడిల్‌ ఈస్ట్‌, సౌత్‌ఈస్ట్‌ దేశాల్లోనూ ఫ్రాంచైజీ పద్దతిన రెస్టారెంట్లు ప్రారంభించనుంది. ప్యారడైజ్‌ ఫుడ్‌కోర్ట్స్‌ 2027 నాటికి రూ. 2,000 కోట్ల ఆదాయం లక్ష్యంగా పెట్టుకుంది. 

చదవండి:హైదరాబాద్ స్టార్టప్ కంపెనీపై ఆనంద్ మహీంద్రా ఆసక్తికర ట్వీట్..!

మరిన్ని వార్తలు