స్విగ్గీ.. జొమాటోకు షాక్‌.!

27 May, 2021 04:34 IST|Sakshi

సొంతంగానే ఆన్‌లైన్‌ ఆర్డర్లను స్వీకరిస్తున్న బడా రెస్టా్టరెంట్లు...

కస్టమర్ల అభిరుచులకు తగ్గ పదార్థాలు

డెలివరీ  కోసం సొంత సిబ్బంది

పెద్ద రెస్టారెంట్ల వ్యాపార వ్యూహాలు

న్యూఢిల్లీ: జొమాటో.. స్విగ్గీ.. పట్టణ ప్రజలకు పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరం లేనివి. కరోనా వచ్చిన తర్వాత ఈ ఆన్‌లైన్‌ ఫుడ్‌ డెలివరీ ప్లాట్‌ఫామ్‌ల సేవలు మరింతగా విస్తరించాయి. వైరస్‌ కారణంగా ఎక్కువ మంది ఆహారం కోసం బయటకు వెళ్లకుండా ఇంటి నుంచే ఆర్డర్‌ చేసి తెప్పించుకునేందుకు ప్రాధాన్యం ఇస్తున్నారు. అందుకే వీటి ప్రాచుర్యం మరింత పెరిగిపోయింది. ఈ పరిస్థితులను గమనించిన కొన్ని పెద్ద రెస్టారెంట్లు మనమే సొంతంగా ఎందుకు డెలివరీ చేయకూడదు? జొమాటో, స్విగ్గీలపై ఎంతకాలం ఆధారపడడం? అన్న ఆలోచనలకు వస్తున్నాయి.

నేషనల్‌ రెస్టారెంట్‌ అసోసియేషన్‌ (ఎన్‌ఆర్‌ఏఐ)లో సభ్యత్వం కలిగిన కొన్ని రెస్టారెంట్లు డాట్‌పే, థ్రైవ్‌ వంటి టెక్‌ కంపెనీలతో భాగస్వామ్యం కుదుర్చుకుని సొంతంగా ఆన్‌లైన్‌ ఆర్డర్‌ ప్లాట్‌ఫామ్‌లను ఏర్పాటు చేసుకుంటున్నాయి. గూగుల్‌ సెర్చింజన్, ఫేస్‌బుక్‌ తదితర సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్‌లపైనా ఆయా రెస్టారెంట్లు తమ ఆన్‌లైన్‌ ఆర్డర్ల లింక్‌లకు ప్రచారం కల్పించే మార్కెటింగ్‌ వ్యూహాలను కూడా అమలు చేస్తున్నాయి. జొమాటో, స్విగ్గీలకు రెస్టారెంట్లు ప్రతీ ఆర్డర్‌పై ఇంత చొప్పున కమీషన్‌ చెల్లించుకోవాల్సి ఉంటుంది. ఒక్కో సందర్భంలో ఈ కమీషన్‌ 30 శాతం వరకు ఉంటుందని రెస్టారెంట్లు చెబుతున్నాయి. తామే సొంతంగా జొమాటో, స్విగ్గీ మాదిరిగా కస్టమర్లను చేరుకునే మార్గాలు తెలుసుకుంటే ఈ మేర కమీషన్‌ను ఆదా చేసుకోవచ్చని భావిస్తున్నాయి.  

ఎక్కువ మందిని చేరుకోవచ్చు..
‘‘సాధారణంగా 7–10 కిలోమీటర్ల పరిధిలోనే అగ్రిగేటర్లు (స్విగ్గీ, జొమాటో తదితర) సేవలు అందించగలవు. సొంతంగా నెట్‌వర్క్‌ను కలిగి ఉంటే లేదా లాజిస్టిక్స్‌ కంపెనీలతో భాగస్వామ్యం కుదుర్చుకుంటే ఇంతకుమించిన దూరంలో ఉన్న కస్టమర్లను కూడా చేరుకునేందుకు వీలుంటుంది’’ అని దేవిదయాళ్‌ వివరించారు. హంగర్‌ హాస్పిటాలిటీ సైతం 80% ఆర్డర్లను సొంత ఆన్‌లైన్‌ ఆర్డర్‌ ప్లాట్‌ఫామ్‌ నుంచే సమకూర్చుకుంటోంది. ఈ సంస్థకు బాంబే క్యాంటీన్, ఓ పెడ్రో, బాంబే స్వీట్‌షాప్‌ తదితర బ్రాండ్లున్నాయి.

థ్రైవ్‌ సాయంతో సొంతంగా ఆర్డర్లను స్వీకరించే టెక్నాలజీ ప్లాట్‌ఫామ్‌ను ఈ సంస్థ ఏర్పాటు చేసుకుంది. సొంత డెలివరీ నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేసుకుని కస్టమర్లను చేరుకుంటోంది. ఈ సంస్థ ఇటీవలే రెండు ప్రత్యేకమైన బ్రాండ్లను ఆవిష్కరించింది. ఇవి స్విగ్గీ, జొమాటో ప్లాట్‌ఫామ్‌లపై అందుబాటులో ఉండవు. సొంత ప్లాట్‌ఫామ్‌పైనే వీటిని ఆఫర్‌ చేస్తోంది. ‘‘మార్కెటింగ్‌కు ఇన్‌స్ట్రాగామ్‌ సేవలను వినియోగిస్తున్నాం. దీర్ఘకాలం కోసం బ్రాండ్లను ఏర్పాటు చేసుకున్నాం కనుక మార్కెటింగ్‌ ఖర్చులు సహేతుకంగానే అనిపిస్తున్నాయి’’ అని సంస్థ వ్యవస్థాపకుడు యాష్‌ బనాజే చెప్పారు. ఢిల్లీకి చెందిన బిగ్‌ చిల్‌ కేఫ్‌ సైతం సొంతంగానే ఆన్‌ లైన్‌ ఆర్డర్ల స్వీకరణ, డెలివరీ సేవలను అందిస్తోంది.

కస్టమర్లు కోరుకున్న రుచులు
రెస్టారెంట్లు సొంతంగానే ఆర్డర్లు తీసుకోవడం వల్ల కస్టమర్లకు ఇష్టమైన రుచులను అందించేందుకు వీలుంటుందని ఫుడ్‌మ్యాటర్స్‌ ఇండియా పార్ట్‌నర్‌ గౌరీదేవిదయాళ్‌ పేర్కొన్నారు. కస్టమర్లు కోరుకున్న ప్రత్యేకమైన రెసిపీలను తయారు చేసి డెలివరీ చేసేందుకు వీలుంటుందన్నారు. అదే జొమాటో, స్విగ్గీ ప్లాట్‌ఫామ్‌లపై ఇందుకు పరిమిత అవకాశమే ఉంటుందన్నది ఆయన విశ్లేషణ.

మరిన్ని వార్తలు