పుంజుకున్న రిటైల్‌ వ్యాపారం

15 Mar, 2022 06:25 IST|Sakshi

ఫిబ్రవరిలో 10 శాతం అధికంగా విక్రయాలు

రిటైలర్స్‌ అసోసియేషన్‌ వెల్లడి

న్యూఢిల్లీ: దేశీయంగా రిటైల్‌ వ్యాపారం గాడిన పడింది. ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో విక్రయాలు గతేడాది ఇదే నెలతో పోల్చి చూసినప్పుడు 10 శాతం పెరిగాయని రిటైలర్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా (రాయ్‌) ప్రకటించింది. సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయనడానికి ఈ గణాంకాలు నిదర్శంగా పేర్కొంది. 2020 ఫిబ్రవరి విక్రయాలతో పోల్చి చూసినా.. ఈ ఏడాది ఫిబ్రవరిలో అమ్మకాలు 6 శాతం అధికంగా నమోదైనట్టు వెల్లడించింది. రాయ్‌ నిర్వహించిన ఒక సర్వేలో ఈ వివరాలు వెల్లడయ్యాయి.

పశ్చిమాదిన విక్రయాల్లో 16 శాతం వృద్ధి కనిపిస్తే.. తూర్పు భారతంలో 4 శాతం, ఉత్తరాదిన 17 శాతం, దక్షిణ భారత్‌లో 4 శాతం మేర అధిక అమ్మకాలు నమోదైనట్టు ఈ సర్వే నివేదిక వెల్లడించింది. ‘‘ఈ గణాంకాలు రిటైల్‌ వ్యాపారంలో సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయని తెలియజేస్తున్నాయి. కనిపిస్తున్న వృద్ధి ద్రవ్యోల్బణంతో సర్దుబాటు చేసింది కాదు. కొన్ని విభాగాల్లో విక్రయాలు ఇంకా పరిమాణాత్మక వృద్ధి దశను చూడాల్సి ఉంది’’ అని రాయ్‌ సీఈవో కుమార్‌ రాజగోపాలన్‌ పేర్కొన్నారు.  

అధిక వృద్ధి ఈ విభాగాల్లోనే..  
గడిచిన రెండు సంవత్సారాలలో ఫిబ్రవరి నెలతో పోల్చి చూసినప్పుడు చాలా విభాగాల్లో విక్రయాలు పెరిగినట్టు ఈ నివేదిక తెలిపింది. కన్జ్యూమర్‌ డ్యూరబుల్స్, ఎలక్ట్రానిక్స్‌ 28 శాతం, ఫుడ్, గ్రోసరీ 19 శాతం, క్విక్‌ సర్వీస్‌ రెస్టారెంట్‌ (క్యూఎస్‌ఆర్‌) విభాగాల్లో 16 శాతం చొప్పున ఈ ఏడాది ఫిబ్రవరిలో వృద్ధి నమోదైంది. వస్త్రాలు, పాదరక్షల విభాగాల్లోనూ రెండంకెల స్థాయిలో విక్రయాలు జరిగినట్టు తెలిపింది. ‘‘చాలా రాష్ట్రాలు ఇప్పుడు స్టోర్‌ సమయాలు, రిటైల్‌ కార్యకలాపాలపై ఆంక్షలను ఎత్తివేశాయి. దీంతో సాధారణ పరిస్థితులను ఆశించొచ్చు. కానీ ద్రవ్యోల్బణం, ఉక్రెయిన్‌పై యుద్ధం వ్యాపారాలపై ప్రభావం చూపిస్తాయి’’ అని రాయ్‌ పేర్కొంది.

మరిన్ని వార్తలు