SBI: రిటైల్‌ డిపాజిట్లపై నెగటివ్‌ రిటర్న్స్‌!

22 Sep, 2021 08:27 IST|Sakshi

ముంబై: ధరల పెరుగుదల స్పీడ్‌ (ద్రవ్యోల్బణాన్ని) పరిగణనలోకి తీసుకుంటే రిటైల్‌ డిపాజిటర్లకు తమ డిపాజిట్లపై ప్రస్తుతం నెగటివ్‌ రిటర్న్స్‌ అందుతున్నాయని బ్యాంకింగ్‌ దిగ్గజం– స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) ఆర్థికవేత్తల నివేదిక ఒకటి పేర్కొంది. ఈ నేపథ్యంలో వడ్డీ ఆర్జనలపై పన్ను అంశాన్ని పునఃసమీక్షించాల్సిన అవసరం ఉందని తన తాజా నివేదికలో సూచించింది. ఈ మేరకు సౌమ్య కాంతి ఘోష్‌ నేతృత్వంలోని ఆర్థికవేత్తలు సమర్పించిన ఒక నివేదికలో కొన్ని ముఖ్యాంశాలను పరిశీలిస్తే... 

డిపాజిటర్ల అందరి గురించీ ఆలోచించక పోయినా, కనీసం సీనియర్‌ సిటిజన్ల డిపాజిట్లపై పన్ను భారాన్ని తగ్గించే అంశాన్ని అయినా సమీక్షించాలి. వారి రోజూవారీ అవసరాలు, వ్యయాలు ఈ వడ్డీపైనే ఆధారపడే సంగతి తెలిసిందే. మొత్తం  డిపాజిట్లు దాదాపు రూ. 156 లక్షల కోట్లు. ఇందులో రిటైల్‌ డిపాజిట్ల వాటా దాదాపు రూ.102 లక్షల కోట్లు.  

ప్రస్తుతం,డిపాజిటర్లందరికీ సంవత్సరానికి రూ.40,000 కంటే ఎక్కువ వడ్డీ ఆదాయాన్ని జమ చేసే సమయంలో బ్యాంకులు మూలం వద్ద పన్నును మినహాయించుకుంటాయి, అయితే సీనియర్‌ సిటిజన్లకు సంవత్సరానికి ఆదాయం రూ .50,000 దాటితే పన్ను భారం పడుతుంది.  

వృద్ధే ప్రధాన లక్ష్యంగా దేశం ప్రస్తుతం సరళతర వడ్డీరేట్ల విధానాన్ని అవలంభిస్తోంది. దీనితో డిపాజిట్‌ రేట్ల కనీస స్థాయికి పడిపోయి, కేవలం దీనిపైనే ఆధారపడి జీవిస్తున్నవారికి ఆర్థికంగా తీవ్ర ఇబ్బందికరమైన వాతావరణాన్ని సృష్టిస్తోంది.  రెపో  వరుసగా ఏడు త్రైమాసికాల నుంచి 4 శాతంగా కొనసాగుతోంది. 

వడ్డీరేట్లు ఇప్పట్లో పెరిగే అవకాశాలు కనిపించడంలేదు. బ్యాంకింగ్‌ వ్యవస్థలో కూడా ద్రవ్యలభ్యత (లిక్విడిటీ) భారీగా కొనసాగుతుండడం ఇక్కడ పరిశీలనలోకి తీసుకోవాల్సిన అంశం.  

ప్రస్తుతం ఫైనాన్షియల్‌ మార్కెట్‌లో బుల్‌రన్‌ నడుస్తోంది. ఇది డిపాజిటర్ల ఆలోచనా ధోరణిని మార్చే అవకాశం ఉంది. తమ పెట్టుబడికి తగిన రిటర్న్స్‌ సంపాదించడానికి వారు మార్కెట్‌వైపు చూసే అవకాశాలు ఉన్నాయి.  

వ్యవస్థలో అధిక ద్రవ్య లభ్యత, వడ్డీరేట్ల విషయంలో పోటీతత్వం, నిధుల సమీకరణ వ్యయాల సమతౌల్యత వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుంటే, బ్యాంకులు ప్రస్తుతం మార్జిన్ల ఒత్తిడులను ఎదుర్కొంటున్నాయి.

మరిన్ని వార్తలు