భారీగా తగ్గిన వంటనూనె ధరలు.. రిటైల్‌ మార్కెట్‌లో రేట్లు ఇలా..!

12 Jan, 2022 18:59 IST|Sakshi

న్యూఢిల్లీ: దేశంలో ప్రస్తుతం వంటనూనె ధరలు క్రమ క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. ఇప్పటికే ఆకాశాన్నంటుతున్న నిత్యవసర సరుకుల ధరలతో సతమతమవుతున్న జనాలకు వంటనూనె ధరలు కొద్దిగా ఊరట కలిగిస్తున్నాయి. ద్రవ్యోల్బణం పెరుగుదలతో ఇబ్బందులు పడుతున్న వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం తీపికబురు అందించింది. దేశంలోని రిటైల్‌ మార్కెట్‌లో వంట నూనె ధరలు భారీగా తగ్గుముఖం పట్టినట్లు కేంద్ర మంత్రిత్వశాఖ వెల్లడించింది. దేశవ్యాప్తంగా ప్రధాన రిటైల్ మార్కెట్లలో కిలో వంటనూనెపై రూ.5-20 వరకు ధరలు తగ్గినట్లు మంత్రిత్వశాఖ తెలిపింది. 

రిటైల్‌ మార్కెట్‌లో వేరుశెనగ నూనె ఆల్ ఇండియా సగటు రిటైల్ ధర కిలో రూ.180, ఆవనూనె కిలో రూ.184.59, సోయా ఆయిల్ కిలో రూ.148.85, సన్ ఫ్లవర్ ఆయిల్ కిలో 162.4, పామాయిల్ కిలో ధర రూ.128.5గా ఉన్నట్లు తెలిపింది. అయితే, అక్టోబర్ 1, 2021న ఉన్న ధరలతో పోలిస్తే వేరుశెనగ & ఆవనూనెల రిటైల్ ధరలు కిలోకు రూ.1.50-3 తగ్గాయి. సోయా & సన్ ఫ్లవర్ నూనెల ధరలు కిలోకు రూ.7-8 తగ్గినట్లు కేంద్రం తెలిపింది. మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం.. అదానీ విల్మార్, రుచి ఇండస్ట్రీస్ కంపెనీలతో సహా ఇతర ప్రధాన వంట నూనె కంపెనీలు లీటరుకు రూ.15-20 ధరలను తగ్గించాయి. వంటనూనెల ధరలను తగ్గించిన కంపెనీలలో జెమిని ఎడిబుల్స్ & ఫ్యాట్స్ ఇండియా, హైదరాబాద్, మోడీ నేచురల్స్, ఢిల్లీ, గోకుల్ రీ-ఫాయిల్స్ మరియు సాల్వెంట్, విజయ్ సాల్వక్స్, గోకుల్ ఆగ్రో రిసోర్సెస్ ఉన్నాయి.

అంతర్జాతీయంగా మార్కెట్లో కమోడిటీ రేట్లు ఎక్కువగా ఉన్నప్పటికీ, వంటనూనె ధరలు తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టడంతో వాటి ధరలు తగ్గుతూ వస్తున్నాయి. గత సంవత్సరం భారీగా ఉన్న నూనె ధరలు.. అక్టోబర్‌ 2021 నుంచి తగ్గుతూ వస్తున్నాయి. వంట నూనెల మీద దిగుమతి సుంకాలు తగ్గించడం, నకిలీ నిల్వలను నిరోధించేందుకు స్టాక్ పరిమితులపై ఆంక్షలు విధించడం వంటి చర్యలను ప్రభుత్వం చేపట్టడంతో వంట నూనెల ధరలు తగ్గడానికి ఒక కారణం. వంటనూనెల విషయంలో దేశం ఎక్కువగా దిగుమతులపై ఆధారపడుతుండటంతో.. దేశీయంగా నూనె గింజల ఉత్పత్తి పెంచడానికి సిద్దం అయ్యింది. అందుకు తగ్గట్టుగా మిషన్ ఆఫ్‌ ఆయిల్‌పామ్‌కు కేంద్ర కేబినెట్‌ ఆమోదం తెలపడంతో పాటు ఈ మిషన్‌ ఆయిల్‌పామ్‌ పథకానికి రూ.11,040 కోట్లు కేటాయించింది. 

(చదవండి: ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్‌లో అదిరిపోయే ఆఫర్స్..! వాటిపై 80 శాతం డిస్కౌంట్)

మరిన్ని వార్తలు