దేశంలో రిటైల్‌ పరిశ్రమ జోరు..19 శాతం వృద్ధితో

24 Dec, 2022 16:38 IST|Sakshi

న్యూఢిల్లీ: దేశీ రిటైల్‌ పరిశ్రమ తన జొరు కొనసాగిస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్‌ నుంచి నవంబర్‌ వరకు 8 నెలల కాలంలో 19 శాతం వృద్ధిని నమోదు చేసింది. కరోనాకు ముందు 2019 సంవత్సరం ఇదే కాలంతో పోల్చి చూసినప్పుడు ఈ వృద్ధి కనిపించింది. క్యూఎస్‌ఆర్, పాదరక్షల విభాగాలు ఈ కాలంలో బలమైన పనితీరు నమోదు చేయడం ద్వారా వృద్ధికి మద్దుతుగా నిలిచినట్టు రిటైలర్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా (రాయ్‌) ప్రకటించింది.

ఈ రెండు విభాగాల్లో అమ్మకాల వృద్ధి 30 శాతానికి పైగా ఉన్నట్టు తెలిపింది. ప్రాంతాల వారీగా చూస్తే తూర్పు భారత్‌లో రటైల్‌ పరిశ్రమ 21 శాతం వృద్ధిని నమోదు చేసింది. ఆ తర్వాత ఉత్తర భారతంలో 19 శాతం వృద్ధి కనిపించగా, పశ్చిమ, దక్షిణ ప్రాంతాల్లో 18 శాతం మేర పెరుగుదల నమోదైంది. సౌందర్య, ఆరోగ్య, వ్యక్తిగత సంరక్షణ పరిశ్రమల్లో వృద్ధి 2019 ఇదే కాలంతో పోల్చినప్పుడు కేవలం 7 శాతం నమోదైనట్టు రాయ్‌ తెలిపింది. వినియోగదారులు తిరిగి స్టోర్లకు వచ్చి షాపింగ్‌ చేస్తున్నారని, ఆన్‌లైన్‌లో కొనుగోళ్లను సైతం వారు ఆస్వాదిస్తున్నారని రాయ్‌ సీఈవో కుమార్‌ రాజగోపాలన్‌ తెలిపారు.

గడిచిన రెండేళ్లలో భారత రిటైల్‌ పరిశ్రమలో అనూహ్యమైన మార్పులు చోటు చేసుకున్నట్టు రాయ్‌ చైర్మన్‌ బిజో కురియన్‌ తెలిపారు. ఆఫ్‌లైన్‌ రిటైలర్లు టెక్నాలజీని అందిపుచ్చుకోవడం పెద్ద ఎత్తున పెరిగినట్టు చెప్పారు. ‘‘ప్రపంచవ్యాప్తంగా చూస్తే ఇతర మార్కెట్ల కంటే భారత్‌లో రిటైల్‌ పరిశ్రమ మెరుగైన వృద్ధిని నమోదు చేస్తుంది. ఓమ్నిచానల్‌ రిటైల్‌ (ఆఫ్‌లైన్, ఆన్‌లైన్‌) అన్నది రిటైలర్లకు సాధారణ నియమంగా మారింది’’అని కురియన్‌ వివరించారు. ఓపెన్‌ నెట్‌వర్క్‌ ఫర్‌ డిజిటల్‌ కామర్స్‌ (ఓఎన్‌డీసీ) వల్ల లక్షలాది చిన్న వర్తకులు సైతం డిజిటల్‌ కామర్స్‌లో భాగస్వాములు అవుతారన్న ఆశాభావం వ్యక్తం చేశారు. 

మరిన్ని వార్తలు