సామాన్యుడికి ధరదడ

15 Mar, 2022 03:57 IST|Sakshi

ఫిబ్రవరిలో రిటైల్‌ ద్రవ్యోల్బణం 6.07 శాతం

ఆర్‌బీఐకి కేంద్రం నిర్దేశిస్తున్న స్థాయికన్నా పైకి...

టోకు ద్రవ్యోల్బణమూ ఆందోళనే 13.11 శాతానికి పెరుగుదల  

న్యూఢిల్లీ: అటు వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్‌ ద్రవ్యోల్బణం, ఇటు టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం ఫిబ్రవరిలో సామాన్యుడికి కన్నీళ్లు తెప్పించాయి. రిటైల్‌ ద్రవ్యోల్బణం 6.07 శాతంగా నమోదయ్యింది. అంటే 2021 ఇదే నెలతో పోల్చితే రిటైల్‌ ధరల బాస్కెట్‌ 6.07 శాతం పెరిగిందన్నమాట.

2 నుంచి 6 శాతం శ్రేణిలో  ఉండేలా తగిన చర్యలు తీసుకోవాలని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ)కి కేంద్రం నిర్దేశిస్తోంది. వరుసగా రెండవ నెలలోనూ (జనవరిలో 6.01 శాతం) ఈ స్థాయి దాటి రిటైల్‌ ద్రవ్యోల్బణం నమోదుకావడం ఆందోళన కలిగిస్తోంది. ఇక టోకు ద్రవ్యోల్బణం ఏకంగా రెండంకెలపైన 13.11 శాతంగా ఉంది. ప్రభుత్వం సోమవారం విడుదల చేసిన గణాంకాల్లో కొన్ని ముఖ్యాంశాలు పరిశీలిస్తే...

రిటైల్‌ ద్రవ్యోల్బణం... ఎనిమిది నెలల గరిష్టం
2021 జూన్‌లో రిటైల్‌ ద్రవ్యోల్బణం 6.26 శాతంగా ఉంది. రిటైల్‌ ద్రవ్యోల్బణం ఎనిమిది నెలల గరిష్టానికి చేరడానికి ఆహార ధరలు ప్రధాన కారణమని గణాంకాలు వెల్లడించాయి. ఆహార ధరల బాస్కెట్‌ సమీక్షా నెల్లో 5.89 శాతంగా నమోదయ్యింది. జనవరిలో ఈ రేటు 5.43 శాతం. ఈ బాస్కెట్‌లో తృణధాన్యాల ధరలు 3.95 శాతం పెరిగాయి. మాంసం, చేపల ధరలు 7.45 శాతం ఎగశాయి. కాగా, గుడ్ల ధరల స్పీడ్‌ 4.15 శాతంగా ఉంది.

కూరగాయల ధరలు 6.13 శాతం పెరిగాయి. సుగంధ ద్రవ్యాల ధరలు 6.09 శాతం ఎగశాయి. పండ్ల ధరలు మాత్రం జనవరితో పోల్చితే స్థిరంగా 2.26 శాతంగా ఉన్నాయి. ఇక ‘ఫ్యూయెల్‌ అండ్‌ లైట్‌’ విభాగంలో ధరా భారం తీవ్రంగా 8.73 శాతంగా ఉంది. అయితే జనవరి 9.32 శాతంతో పోల్చితే ఇది కొంచెం తగ్గడం ఊరట.  క్రూడ్‌ ధరల తీవ్రత నేపథ్యంలో రానున్న నెలల్లో ఈ విభాగంలో ద్రవ్యోల్బణం రెండంకెలకు చేరుతుందన్న విశ్లేషణలు వినబడుతున్నాయి.  

ఆర్‌బీఐపై దృష్టి...
ఆర్‌బీఐ ద్వైమాసిక ద్రవ్య పరపతి విధానానికి రిటైల్‌ ద్రవ్యోల్బణమే ప్రాతిపదిక కావడం గమనార్హం. ద్రవ్యోల్బణం 6 శాతం పైబడిందంటే.. అది పాలసీ రేటు నిర్ణయం ప్రభావం చూపుతోంది. వరుసగా రెండవ నెలా రిటైల్‌ ద్రవ్యోల్బణం కట్టుతప్పడంతో రానున్న ఏప్రిల్‌ ఆర్‌బీఐ పాలసీ సమావేశాల నిర్ణయాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంటోంది. 

రిటైల్‌ ద్రవ్యోల్బణం 2021–22 ఆర్థిక సంవత్సరంలో జనవరి–మార్చి త్రైమాసికంలో  సగటున 5.7 శాతంగా ఉంటుందని, ఆర్థిక సంవత్సరం మొత్తంలో 5.3 శాతంగా కొనసాగుతుందని,  2022–23 ఆర్థిక సంవత్సరంలో ఈ రేటు 4.5 శాతానికి దిగివస్తుందని ఆర్‌బీఐ ఫిబ్రవరి మొదట్లో జరిగిన ద్రవ్య పరపతి విధాన సమీక్ష సందర్భంగా అంచనావేసింది.

ఈ నేపథ్యంలో వృద్ధి రికవరీ, పటిష్టత లక్షంగా అవసరమైనంతకాలం  ‘సరళతర’ విధానాన్నే అనుసరించడం ఉత్తమమని ఆర్‌బీఐ గవర్నర్‌ నేతృత్వంలోని పరపతి విధాన కమిటీ మెజారిటీ (6:5) అభిప్రాయపడింది. అయితే రెపో రేటు ప్రస్తుతానికి యథాతథంగా కొనసాగించడానికి మాత్రం ఆరుగురు సభ్యులు ఏకగ్రీవ నిర్ణయం తీసుకున్నారు. వృద్ధే లక్ష్యంగా వరుసగా పది ద్వైమాసిక సమావేశాల నుంచి ఆర్‌బీఐ రెపో రేటు యథాతథంగా కొనసాగుతోంది.  

టోకు ద్రవ్యోల్బణానికి క్రూడ్‌ సెగ
వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వశాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం ఫిబ్రవరిలో 13.11 శాతంగా (2021 ఇదే నెలతో పోల్చి) ఉంది. క్రూడ్‌ ఆయిల్‌ ధరల తీవ్రత దీనికి ప్రధాన కారణంకాగా, నాన్‌–ఫుడ్‌ ఐటమ్స్‌ ధరలు కూడా తీవ్రంగా ఎగశాయి. టోకు ద్రవ్యోల్బణం రెండంకెల పైన కొనసాగుతుండడం ఆందోళనకరమైన అంశం. గడచిన పదకొండు నెలల నుంచీ అంటే 2021 ఏప్రిల్‌ నుంచి టోకు ద్రవ్యోల్బణం రెండంకెలపైనే కొనసాగుతోంది. 2021 ఫిబ్రవరిలో ఈ రేటు 4.83 శాతం. అప్పటిలో అతి తక్కువ బేస్, తాజా ధరలు తీవ్ర స్థాయిలో కనబడ్డానికి ఒక కారణమని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  

► ఫ్యూయెల్‌ అండ్‌ పవర్‌ బాస్కెట్‌ రెండూ కలిపి ధరాభారం 31.50 శాతంగా ఉంది. అయితే ఒక్క క్రూడ్‌ పెట్రోలియం ధరల స్పీడ్‌ ఫిబ్రవరిలో ఏకంగా 55.17 శాతంగా ఉంది. జనవరిలో ఈ పెరుగుదల 39.41 శాతం.  
► ఫుడ్‌ ఆర్టికల్స్‌ ద్రవ్యోల్బణం 8.19 శాతంగా ఉంది. కూరగాయల ధరల స్పీడ్‌ 26.93 శాతం. గుడ్లు, మాంసం, చేపల ధరలు 8.14 శాతం పెరిగాయి. ఉల్లి ధర 26.37 శాతం తగ్గింది. అయితే ఆలూ ధరలు మాత్రం 14.78 శాతం పెరిగాయి. జనవరిలో ధర పెరక్కపోగా 14.45 శాతం తగ్గింది.  
► సూచీలో మెజారిటీ వాటా కలిగిన తయారీ రంగంలో ద్రవ్యోల్బణం 9.84 శాతంగా ఉంది. జనవరిలో ఈ రేటు 9.42 శాతం.  

మరిన్ని వార్తలు