పబ్లిక్‌ ఇష్యూలకు రిటైలర్ల క్యూ

18 Mar, 2021 01:12 IST|Sakshi

ఆరు నెలలుగా కనిపిస్తున్న నయాట్రెండ్‌

మార్కెట్లో నెలకొన్న బుల్‌ జోష్‌ ఎఫెక్ట్‌

కోవిడ్‌–19 లాక్‌డౌన్‌ తర్వాత మరింత జోరు

సగటున నెలకు 10 లక్షల కొత్త డీమ్యాట్‌ ఖాతాలు

కరోనా వైరస్‌ విస్తృతి నేపథ్యంలో గతేడాది మార్చిలో ప్రభుత్వం లాక్‌డౌన్‌ విధించింది. ఆపై కోవిడ్‌–19 కట్టడిలో భాగంగా ప్రజలను అధిక సంఖ్యలో గుమిగూడవద్దంటూ హెచ్చరించింది. అయితే ఇదే సమయంలో దేశీ స్టాక్‌ మార్కెట్లలో పెట్టుబడులకు మరింత మంది రిటైల్‌ ఇన్వెస్టర్లు క్యూ కట్టడం విశేషం! ఇందుకు వీలుగా పలువురు ఇన్వెస్టర్లు కొత్తగా డీమ్యాట్‌ ఖాతాలను తెరిచేందుకు ఆసక్తి చూపుతూ వచ్చారు. తద్వారా పబ్లిక్‌ ఇష్యూలకు దరఖాస్తు చేస్తున్న రిటైల్‌ ఇన్వెస్టర్ల్ల సంఖ్య భారీగా పెరుగుతూ వచ్చింది! ఇతర వివరాలు చూద్దాం..

ముంబై: గత కేలండర్‌ ఏడాది(2020) సెప్టెంబర్‌ నుంచి చూస్తే పబ్లిక్‌ ఇష్యూలకు రిటైల్‌ ఇన్వెస్టర్లు సగటున 1.3 మిలియన్‌ అప్లికేషన్లు దాఖలు చేశారు. అయితే కోవిడ్‌–19కు ముందు ఈ సంఖ్య 0.5 మిలియన్లుగా మాత్రమే నమోదైంది. ప్రైమరీ మార్కెట్లను పరిశీలించే ప్రైమ్‌ డేటాబేస్‌ అందించిన వివరాలివి. ఇందుకు ప్రధానంగా కరోనా వైరస్‌ ప్రభావాన్ని దీటుగా ఎదుర్కొనే బాటలో పలు దేశాల కేంద్ర బ్యాంకులు, ప్రభుత్వాలు భారీ సహాయక ప్యాకేజీలకు తెరతీయడం ప్రభావం చూపింది. ఎలాగంటే స్టిములస్‌ల కారణంగా ఒక్కసారిగా లిక్విడిటీ పెరిగిపోయింది. చౌకగా లభిస్తున్న ఈ నిధులు స్టాక్స్, బంగారం తదితరాల్లోకి ప్రవహించడం అధికమైంది. దీంతో ప్రపంచవ్యాప్తంగా స్టాక్‌ మార్కెట్లు చరిత్రాత్మక గరిష్టాలకు చేరగా.. పసిడి సైతం సరికొత్త రికార్డులను అందుకుంది. ఈ నేపథ్యంలో పబ్లిక్‌ ఇష్యూల ద్వారా నిధులను సమీకరించేందుకు పలు కంపెనీలు క్యూకట్టాయి. మార్కెట్లో నెలకొన్న బుల్‌ట్రెండ్, లిక్విడిటీ ప్రభావంతో ఐపీవోలకు వచ్చిన కంపెనీల షేర్లు భారీ లాభాలతో లిస్ట్‌కావడం దీనికి జత కలిసింది. వెరసి రిటైల్‌ ఇన్వెస్టర్లను ప్రైమరీ మార్కెట్లు భారీగా ఆకర్షిస్తున్నట్లు విశ్లేషకులు పేర్కొన్నారు.   

ఖాతాల జోరు
గతేడాది ఏప్రిల్‌ నుంచి ఫిబ్రవరి మధ్య కాలంలో రిటైల్‌ ఇన్వెస్టర్లు కొత్తగా 10 మిలియన్‌ డీమ్యాట్‌ ఖాతాలను తెరిచినట్లు ప్రైమ్‌ డేటాబేస్‌ పేర్కొంది. లాక్‌డౌన్‌ సమయంలో నెలకు సగటున 1 మిలియన్‌ డీమ్యాట్‌ ఖాతాలు జమ అయినట్లు ఐఐఎఫ్‌ఎల్‌ సెక్యూరిటీస్‌ ఈ సందర్భంగా వెల్లడించింది. డీమ్యాట్‌ ఖాతాలను సులభంగా తెరవడంతోపాటు.. అలవోకగా ఐపీవోలకు దరఖాస్తు చేసే వీలుండటంతో రిటైలర్ల నుంచి ఆసక్తి పెరిగినట్లు జిరోధా బ్రోకింగ్‌ నిపుణులు పేర్కొన్నారు. పలు ఐపీవోలు భారీ సక్సెస్‌ను సాధించడం, కొత్త కంపెనీలు లిస్టింగ్‌ రోజే సగటున 40 శాతం లాభాలు ఆర్జించడం వంటి అంశాలు ఇందుకు సహకరిస్తున్నట్లు తెలియజేశారు. దీంతో కొత్త తరం రిటైలర్లు పెట్టుబడులకు ముందుకు వస్తున్నట్లు పేర్కొన్నారు. 2021లో లిస్టింగ్‌లోనే లాభాల ట్రెండ్‌ మరింత ఊపందుకున్నట్లు తెలియజేశారు. ప్రైమరీ మార్కెట్లు కళకళలాడితే.. కొత్తగా రిటైల్‌ ఇన్వెస్టర్లు పుట్టుకొస్తారని వివరించారు. నిజానికి మార్కెట్లలో కొనసాగుతున్న ఇన్వెస్టర్లు సైతం కుటుంబ సభ్యుల పేరుతో కొత్తగా డీమ్యాట్‌ ఖాతాలను తెరిచేందుకు ఆసక్తి చూపుతారని జిరోధా నిపుణులు ప్రస్తావించారు. ఇటీవల పలు ఇష్యూలకు దరఖాస్తులు వెల్లువెత్తుతుండటంతో షేర్లను దక్కించుకునేందుకు పోటీ పడుతున్నట్లు తెలియజేశారు. ఇటీవలి ట్రెండ్‌ ప్రకారం చూస్తే పబ్లిక్‌ ఇష్యూలకు దరఖాస్తు చేసిన ప్రతీ 30 మందిలో ఒక్కరికి మాత్రమే షేర్ల కేటాయింపునకు వీలున్నట్లు వివరించారు.

పలు కంపెనీలు
దేశీయంగా ఇటు సెన్సెక్స్, నిఫ్టీ కొత్త శిఖరాలను తాకగా.. అటు యూఎస్‌ మార్కెట్లు సైతం రోజుకో కొత్త గరిష్టానికి చేరుతూ వచ్చాయి. సెకండరీ మార్కెట్లో నెలకొన్న బుల్‌ట్రెండ్‌ ప్రభావంతో పలు కంపెనీలు బంపర్‌ లిస్టింగ్‌లను సాధిస్తూ వచ్చినట్లు నిపుణులు పేర్కొన్నారు. అంతేకాకుండా లిస్టింగ్‌ తదుపరి సైతం పలు కంపెనీల షేర్లు ర్యాలీ బాటలో సాగడం కూడా రిటైలర్లను ఆకర్షిస్తున్నట్లు తెలియజేశారు. తాజా ఉదాహరణ చూస్తే.. ఎంటార్‌ టెక్నాలజీస్‌ ఇష్యూ ధర రూ. 575తో పోలిస్తే రూ. 1,055 వద్ద లిస్టయ్యింది. తొలి రోజు ఏకంగా 87 శాతం లాభంతో రూ. 1,078 వద్ద ముగిసింది. కాగా. ప్రైమరీ మార్కెట్‌లో నెలకొన్న బలమైన సెంటిమెంటు నేపథ్యంలో ఈ వారం క్రాఫ్ట్స్‌మ్యాన్‌ ఆటోమేషన్, లక్ష్మీ ఆర్గానిక్‌ ఇం డస్ట్రీస్, కల్యాణ్‌ జ్యువెల్లర్స్, సూర్యోదయ్‌ స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంక్‌ పబ్లిక్‌ ఇష్యూలకు వచ్చాయి. వీటితోపాటు వారాంతాన ప్రారంభమై మంగళవారం ముగిసిన అనుపమ్‌ రసాయన్‌ ఐపీవో సైతం 44 రెట్లు అధికంగా బిడ్స్‌ను ఆకట్టుకుంది. ఈ 5 కంపెనీలూ ఐపీవోల ద్వారా వారంలో రూ. 4,524కోట్లను సమీకరించనుండటం గమనార్హం.

గతేడాది మొదట్లో తలెత్తిన కోవిడ్‌–19 ప్రభావం 2021కల్లా చాలావరకూ ఉపశమించినట్లు మార్కెట్‌ వర్గాలు పేర్కొన్నాయి. ఈ నేపథ్యంలో పబ్లిక్‌ ఇష్యూలకు రిటైల్‌ ఇన్వె స్టర్ల నుంచి దరఖాస్తులు వెల్లువెత్తుతున్న ట్లు తెలియజేశాయి. ఇటీవలి ఐపీవోలలో రిటైల్‌ ఇన్వెస్టర్ల స్పందన ఎలా ఉన్నదంటే..
దరఖాస్తుల తీరిలా(మిలియన్లలో)
కంపెనీ పేరు    అప్లికేషన్లు
ఇండిగో పెయింట్స్‌    2.59
మజ్‌గావ్‌ డాక్‌    2.36
బెక్టర్స్‌ ఫుడ్‌    2.20
రైల్‌టెల్‌ కార్ప్‌    2.07
బర్గర్‌ కింగ్‌    1.97   .

మరిన్ని వార్తలు