పెట్టుబడుల్లో రిటైలర్ల జోరు

10 Aug, 2021 00:15 IST|Sakshi

ఎన్‌ఎస్‌ఈ కంపెనీలలో రికార్డ్‌ వాటా 

విలువ రూ. 16.18 లక్షల కోట్లు 

ఎంఎఫ్‌లు, ఎఫ్‌పీఐల వెనకడుగు

న్యూఢిల్లీ: సరికొత్త బుల్‌ట్రెండ్‌లో సాగుతున్న దేశీ స్టాక్‌ మార్కెట్లలో రిటైల్‌ ఇన్వెస్టర్లు దూకుడు చూపుతున్నారు. ఓవైపు సెకండరీ మార్కెట్లో నెలకొన్న రికార్డులకుతోడు.. మరోపక్క ప్రైమరీ మార్కెట్‌ స్పీడ్‌ పలువురు చిన్న ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటున్నాయి. దీంతో రిటైల్‌ ఇన్వెస్టర్లు భారీ సంఖ్యలో పెట్టుబడులకు ఆసక్తి చూపుతున్నారు. వెరసి ఈ ఏడాది తొలి త్రైమాసికం(ఏప్రిల్‌–జూన్‌)లో సరికొత్త రికార్డుకు తెరలేచింది. ఎన్‌ఎస్‌ఈ లిస్టెడ్‌ కంపెనీలలో తాజాగా రిటైల్‌ ఇన్వెస్టర్ల వాటా 7.18 శాతాన్ని తాకింది. ఇది మార్కెట్‌ చరిత్రలోనే అత్యధికంకాగా.. మార్చి చివరికల్లా ఎన్‌ఎస్‌ఈ కంపెనీలలో 6.96 శాతం వాటాను సొంతం చేసుకున్నారు. ప్రైమ్‌ఇన్ఫోబేస్‌.కామ్‌ అందించిన వివరాల ప్రకారం విలువరీత్యా రిటైల్‌ ఇన్వెస్టర్ల వాటాల విలువ 16 శాతం వృద్ధితో రూ. 16.18 లక్షల కోట్లకు చేరింది. క్యూ4(జనవరి–మార్చి)లో ఈ విలువ రూ. 13.94 లక్షల కోట్లుగా నమోదైంది. ఇదే కాలంలో ప్రామాణిక ఇండెక్సులు సెన్సెక్స్‌(బీఎస్‌ఈ) 6 శాతం, నిఫ్టీ(ఎన్‌ఎస్‌ఈ) 7 శాతం చొప్పున మాత్రమే పురోగమించడం గమనార్హం! 

డీఐఐలు డీలా.. క్యూ1లో దశీ మ్యూచువల్‌ ఫండ్స్‌ వాటా ఎన్‌ఎస్‌ఈ లిస్టెడ్‌ కంపెనీలలో నామమాత్రంగా తగ్గి 7.25 శాతానికి పరిమితమైంది. మార్చి క్వార్టర్‌(క్యూ4)లో 7.26 శాతంగా నమోదైంది. ఎన్‌ఎస్‌ఈలో లిస్టయిన 1,699 కంపెనీలకుగాను 1,666 కంపెనీలలో వెలువడిన వాటాల వివరాల ప్రకారం రూపొందిన గణాంకాలివి. వెరసి రిటైల్‌ ఇన్వెస్టర్లు మ్యూచువల్‌ ఫండ్స్‌ మార్గంకంటే షేర్లలో ప్రత్యక్ష పెట్టుబడులకే ఇటీవల మొగ్గు చూపుతున్నట్లు మార్కెట్‌ నిపుణులు పేర్కొంటున్నారు. కాగా.. ప్రభుత్వ రంగ బీమా దిగ్గజం ఎల్‌ఐసీకి 295 కంపెనీలలో గల వాటా జూన్‌కల్లా 3.74 శాతానికి నీరసించింది. 2021 మార్చి చివరికల్లా 3.83 శాతంగా నమోదైంది. ఎల్‌ఐసీకి 1 శాతానికంటే అధికంగా వాటా గల కంపెనీల వివరాలివి! ఎంఎఫ్‌లు, బీమా కంపెనీలు, బ్యాంకులు తదితరాలతో కూడిన డీఐఐల వాటా జూన్‌కల్లా 13.19 శాతానికి నీరసించింది. మార్చిలో ఈ వాటా 13.42 శాతంగా నమోదైంది. ఇక ఇదే సమయంలో ఎఫ్‌పీఐల వాటా 22.46 శాతం నుంచి 21.66 శాతానికి తగ్గడం ప్రస్తావించదగ్గ విషయం!  

మరిన్ని వార్తలు