స్పెక్యులేషన్‌వైపు చిన్న ఇన్వెస్టర్ల చూపు

25 Jul, 2020 14:56 IST|Sakshi

క్యూ1(ఏప్రిల్‌-జూన్‌) గణాంకాలివి

రిటైల్‌ టర్నోవర్‌ 57 శాతం అప్‌

ఇదే స్థాయిలో ఊపందుకోని డెలివరీలు

మిడ్‌, స్మాల్‌ క్యాప్స్‌లో ఆటుపోట్లు ఇందుకే

నిజానికి స్టాక్‌ మార్కెట్లలో లాభాల కోసం అత్యధిక శాతం మంది దీర్ఘకాలిక ధృక్పథంతో ఇన్వెస్ట్‌ చేస్తూ ఉంటారు. స్వల్పకాలిక లాభాల కోసం ట్రేడర్లు ఎఫ్‌ండ్‌వో స్టాక్స్‌లో భారీగా పొజిషన్లు తీసుకుంటుంటారు. అయితే కొద్ది రోజులుగా రిటైల్‌ ఇన్వెస్టర్లు సైతం స్పెక్యులేటివ్‌ ట్రేడింగ్‌కు ప్రాధాన్యత ఇస్తున్నట్లు శామ్‌కో గ్రూప్‌ రీసెర్చ్‌ హెడ్‌ ఉమేష్‌ మెహతా పేర్కొంటున్నారు. దీంతో మిడ్‌, స్మాల్‌ క్యాప్‌ కౌంటర్లలో ఇటీవల ఆటుపోట్లు పెరిగినట్లు ఒక ఇంటర్వ్యూలో తెలియజేశారు. మార్కెట్ల తీరు, బ్యాంకింగ్‌ ఫలితాలు తదితర అంశాలపై మెహతా వ్యక్తం చేసిన అభిప్రాయాలను చూద్దాం.. 

డెలివరీలు తక్కువే
దీర్ఘకాలిక ఇన్వెస్టర్లకంటే అధికంగా ఇటీవల చిన్న పెట్టుబడిదారులు స్పెక్యులేటివ్‌ ట్రేడింగ్‌ను నిర్వహిస్తున్నారు. దీంతో ఈ ఆర్థిక సంవత్సరం(2020-21) తొలి త్రైమాసికంలో రిటైల్‌ ఇన్వెస్టర్ల టర్నోవర్‌ 57 శాతం ఎగసింది. ఇదే సమయంలో రిటైల్‌ విభాగంలో స్టాక్స్‌లో డెలివరీలు క్షీణించడం గమనార్హం. వెరసి రిటైలర్లు కొద్ది రోజులుగా దీర్ఘకాలిక వ్యూహంతో కాకుండా స్పెక్యులేటివ్‌ ఆలోచనతోనే ట్రేడింగ్‌ చేపడుతున్నట్లు తెలుస్తోంది. నగదు విభాగంలో సగటు పరిమాణం 57 శాతం పుంజుకోగా రోజువారీ షేర్ల డెలివరీలు వెనకడుగులో ఉన్నాయి. వెరసి క్యూ1(ఏప్రిల్‌-జూన్‌)లో మిడ్‌, స్మాల్‌ క్యాప్‌ కౌంటర్లలో నమోదైన అధిక ఆటుపోట్లకు ఇదొక ప్రధాన కారణంగా కనిపిస్తోంది.

ఎఫ్‌పీఐల అండ
గత రెండు వారాలలో మార్కెట్లు తిరిగి జోరందుకున్నాయి. గత 9 ట్రేడింగ్‌ సెషన్లలో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) రూ. 5,000 కోట్లకుపైగా ఇన్వెస్ట్‌ చేశారు. సెకండరీ మార్కెట్లలో ఎఫ్‌పీఐల పెట్టుబడులు సెంటిమెంటుకు జోష్‌నిస్తున్నాయి. మరోవైపు కోవిడ్‌-19 కట్టడికి అభివృద్ధి చేస్తున్న వ్యాక్సిన్‌ మూడో దశ క్లినికల్‌ పరీక్షలపై వెలువడుతున్న సానుకూల వార్తలు ఇన్వెస్టర్లకు సహకరిస్తున్నాయి. గత వారం యూరోపియన్‌ యూనియన్‌ 850 బిలియన్‌ డాలర్ల ప్యాకేజీకి గ్రీన్‌సిగ్నల్‌ ఇవ్వడం, యూఎస్‌ ప్రభుత్వం సైతం మరో ప్యాకేజీ ప్రకటించవచ్చన్న అంచనాలు వీటికి జత కలుస్తున్నాయి. 

బ్యాకింగ్‌ ఇలా
బ్యాం‍కింగ్‌ రంగంలోని సంస్ధలు ప్రస్తావించదగ్గ స్థాయిలో ఫలితాలు ప్రకటిస్తున్నాయి. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ తదితరాలు పటిష్ట పనితీరు చూపాయి. అయితే రుణ చెల్లింపులపై మారటోరియం అమలుతోపాటు.. మొండి బకాయిల(ఎన్‌పీఏలు) నమోదులో ఆలస్యానికి ఆర్‌బీఐ అనుమతించడం వంటి అంశాల కారణంగా బ్యాంకింగ్‌ ఫలితాలు ప్రోత్సాహకరంగా వెలువడుతున్నాయి. లాక్‌డవున్‌ల కారణంగా ప్రజలు ఇంటి నుంచే పనిచేస్తుండటంతో డిజిటల్‌ లావాదేవీలు పెరిగాయి. కోవిడ్‌-19 నేపథ్యంలో బీమా పాలసీలకు డిమాండ్‌ కనిపిస్తోంది.  

ఐటీ గుడ్‌
ప్రస్తుత కోవిడ్‌-19 అనిశ్చితుల్లోనూ ఐటీ రంగ కంపెనీలు పటిష్ట ఫలితాలు సాధిస్తున్నాయి. వ్యయాల తగ్గింపు, వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ ద్వారా ఉత్పాదకత మెరుగుపడటం, సప్లై చైన్‌ డిజిటల్‌ వినియోగం వంటి అంశాలు కంపెనీలకు లబ్దిని చేకూర్చనున్నాయి. కొత్తగా కాంట్రాక్టులు కుదుర్చోవడం, ఆశావహ అంచనాలు ఈ రంగానికి ఊపునిస్తున్నాయి. క్లౌడ్‌ ఆధారిత మౌలికసదుపాయాలను పెంచుకోవడం ద్వారా మరిన్ని అవకాశాలను అందిపుచ్చుకునేందుకు వీలుంది. పెరుగుతున్న డిజిటల్‌ వినియోగం సైతం ఐటీ రంగానికి అదనపు డిమాండ్‌ను కల్పిచే అవకాశముంది.

మరిన్ని వార్తలు