మార్చిలో తగ్గిన వాహన విక్రయాల స్పీడు

9 Apr, 2021 05:17 IST|Sakshi

అన్ని విభాగాల్లో కలిపి 29 శాతం క్షీణత నమోదు

ప్యాసింజర్‌ వాహనాలు, ట్రాక్టర్లకు కొనసాగిన డిమాండ్‌

పడిపోయిన వాణిజ్య, ద్విచక్ర వాహన అమ్మకాలు 

ఎఫ్‌ఏడీఏ గణాంకాల వెల్లడి

ముంబై: వాహన విక్రయాలు మార్చిలో ఆకట్టుకోలేకపోయాయి. ప్యాసింజర్, ట్రాక్టర్ల అమ్మకాల్లో తప్ప మిగిలిన విభాగాల్లో క్షీణత నమోదైంది. ఈ విషయాన్ని ఫెడరేషన్‌ ఆఫ్‌ ఆటోమొబైల్‌ డీలర్స్‌ ఆసోసియేషన్‌(ఎఫ్‌ఏడీఏ) తెలిపింది. కరోనా నేపథ్యంలో ప్రయాణికులు వ్యక్తిగత రవాణాకు ప్రాధ్యానతనివ్వడంతో ప్యాసింజర్‌ వాహన విక్రయాలు మార్చి నెలలో దూసుకెళ్లాయి.  ఈ మార్చిలో 28 శాతం వృద్ధిని సాధించి మొత్తం 2,79,745 యూనిట్లుగా నమోదైనట్లు ఎఫ్‌ఏడీఏ ప్రకటించింది.

గతేడాది ఇదే నెలలో 2,17,879 యూనిట్ల అమ్మకాలు జరిగాయి. ద్విచక్ర వాహన విక్రయాలు 2021 మార్చిలో 35 శాతం క్షీణించి 11,95,445 నమోదయ్యాయి. వాణిజ్య వాహన అమ్మకాలు 42.2 శాతం క్షీణించాయి. గత సంవత్సరం 1,16,559 అమ్ముడవ్వగా 2021 మార్చిలో 67,372 వాహనాలు మాత్రమే అమ్ముడయ్యాయి. మూడు చక్రాల వాహన విక్రయాలు సైతం భారీగా(52 శాతం) పడిపోయాయి. 77,173 నుంచి 38,034 కు తగ్గాయి. ఇక ట్రాక్టర్ల అమ్మకాలు 29 శాతం పెరిగి 69,082 యూనిట్లు నమోదయ్యాయి. అన్ని కేటగిరీలు కలిపి మొత్తంగా వాహన విక్రయాలు 29 శాతం క్షీణించాయి.  

‘‘కరోనా 3.2 కోట్ల మధ్య తరగతి కుటుంబాలను పేదరికంలోకి నెట్టింది. ఆదాయాలు భారీగా పడిపోవడంతో ప్రజలు వాహన కొనుగోళ్లకు పెద్దగా ఆసక్తి చూపలేదు. డీజిల్, పెట్రోల్‌ ధరలు నిరంతర పెరుగుదల వారిని మరింత నిరుత్సాహపరిచింది’’ అని ఎఫ్‌ఏడీఏ అధ్యక్షుడు వింకేశ్‌ గులాటీ తెలిపారు. అయితే లో బేస్‌ కారణంగా ప్యాసింజర్, ట్రాక్టర్‌ వాహన విక్రయాల్లో వృద్ధి నమోదైనట్లు పేర్కొన్నారు. 

మరిన్ని వార్తలు