జీఎస్‌టీ వసూళ్లలో తగ్గేదేలే!.. టార్గెట్‌ రూ.1.5 లక్షల కోట్లు

16 Sep, 2022 15:09 IST|Sakshi

జీఎస్‌టీ వసూళ్లు అక్టోబర్‌ నుంచి రూ.1.5 లక్షల కోట్లకుపైనే ఉంటాయని అంచనా వేస్తున్నట్టు కేంద్ర రెవెన్యూ కార్యదర్శి తరుణ్‌ బజాజ్‌ పేర్కొన్నారు. గడిచిన ఆరు నెలలకు జీఎస్‌టీ ఆదాయం సగటున రూ.1.4 లక్షల కోట్ల స్థాయిలో ఉంది. వరుసగా రూ.1.5 లక్షల కోట్లు దాటి నమోదు కావడం లేదు. ఆగస్ట్‌ నెలకు రూ.1.43 లక్షల కోట్లు జీఎస్‌టీ రూపంలో వచ్చింది. వార్షికంగా క్రితం ఏడాది ఆగస్ట్‌తో పోల్చి చూసినప్పుడు 28 శాతం పెరిగింది. కానీ, జూలైలో వచ్చిన రూ.1.49 లక్షల కోట్ల కంటే తక్కువ కావడం గమనార్హం. ఈ ఏడాది ఒక్క ఏప్రిల్‌ నెలలోనే రూ.1.5 లక్షల కోట్ల మార్క్‌ను దాటింది.

ఆ నెలకు రూ.1.67 లక్షల కోట్ల ఆదాయం నమోదైంది. సీబీఐసీ కార్యక్రమంలో భాగంగా తరుణ్‌ బజాజ్‌ ఈ అంశంపై మాట్లాడుతూ.. రూ.1.5 లక్షల కోట్ల మార్క్‌ను అధిగమించేందుకు గత కొన్ని నెలలుగా తాము కష్టించి పని­చేస్తున్నట్టు చెప్పారు. కొన్ని సందర్భాల్లో రూ.2,000 కోట్లు, రూ.6,000 కోట్లు తక్కువ నమోదైనట్టు తెలిపారు. కానీ, అక్టోబర్‌ నెలకు జీఎస్‌టీ ఆదాయం రూ.1.5 లక్షల కోట్లను అధిగమిస్తుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. అంతేకాదు, ఆ తర్వాత నుంచి స్థిరంగా రూ.1.5 లక్షల కోట్ల పైన నమోదవుతుందని అంచనా వేశారు. ఇదే కార్యక్ర­మంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, సహాయ మంత్రి పంకజ్‌ చౌదరి సైతం పాల్గొన్నారు.

చదవండి: దేశంలో ఐఫోన్‌ల తయారీ..టాటా గ్రూప్‌తో మరో దిగ్గజ సంస్థ పోటా పోటీ!


 

మరిన్ని వార్తలు