పాపం.. అప్పుల ఊబిలో రెవలాన్‌!

16 Jun, 2022 20:21 IST|Sakshi

కింగ్ నాగార్జున సినీ కెరీర్‌లోనే కల్ట్‌ క్లాసిక్‌గా నిలిచిన చిత్రం 'మన్మథుడు'. ఈ సినిమాలో డైలాగ్‌లు, సీన్లు ప్రేక్షకులకు ఇప్పటికీ గిలిగింతలు పెడతాయి. ఇదే సినిమాలో ఓ లిప్‌స్టిక్‌ యాడ్‌ గుర్తుందా? 

"ఆడ పిల్ల పెదాలు ముడుచుకొని ఉన్నాయంటే బాధగా ఉన్నట్లు అర్ధం.

అదే పెదాలు విచ్చుకొని ఉన్నాయంటే ఆనందంగా ఉన్నాయని అర్ధం.

 ఆ పెదాలు మునుపంటి కింద నలుగుతున్నాయంటే కోపంగా ఉన్నట్లు అర్ధం. 

కానీ ఒకమ్మాయి పెదాలు అందంగా ఉన్నాయంటే మాత్రం వాటిమీద రెవలాన్‌ లిప్‌స్టిక్‌ ఉందని అర్ధం' అంటూ వచ్చే రెవలాన్ లిప్టిక్‌ యాడ్‌ సీన్‌ ఆ సినిమాకే ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అయితే ఆ రెవలాన్‌ కంపెనీ.. ఇప్పుడు రుణ భారాన్ని మోయలేక కోర్ట్‌ను ఆశ్రయించింది. 

రెవలాన్‌ హెడ్‌క్వార్టర్స్‌ న్యూయార్క్‌లో ఉంది. సుమారు 150 దేశాల్లో వీటి ఉత్పత్తులు అమ్ముడుపోయేవి. అయితే.. తొమ్మిది దశాబ్దాల చరిత్ర ఉన్న రెవలాన్‌ బ్యూటీ ప్రొడక్ట్స్‌ కంపెనీ అప్పుల ఊబిలో కూరుకుపోయింది. సప్లై చైన్‌ సమస్యలు, పెరిగిపోతున్న అప్పుల కారణంగా  న్యూయార్క్‌లోని సదరన్ డిస్ట్రిక్ట్ కోర్టులో ఛాప్టర్‌-11 దివాలా రక్షణ కోసం దాఖలు చేసింది. ఇందులో భాగంగా దాని ప్రస్తుత రుణదాతల నుండి 575 మిలియన్‌ డాలర్ల ఫైనాన్సింగ్‌ ఆశిస్తున్నట్లు తెలుస్తోంది.

పోటీ పెరిగింది
రెవలాన్‌, అల్మే నుండి ఎలిజబెత్ ఆర్డెన్ వరకు బ్రాండ్‌లు బ్యూటీ మార్కెట్‌లో రారాజులుగా కొనసాగుతున్నాయి. కానీ గత కొన్నేళ్లుగా మారుతున్న అందం, అభిరుచులు, పుట్టుకొస్తున్న బ్యూటీ ప్రొడక్ట్‌ కంపెనీలతో పోటీ పడలేక పోతున్నాయి. రెవలాన్‌ లాంటి సంస్థలు కుదేలవుతున్నాయి.

మరిన్ని వార్తలు