గేమింగ్‌ హబ్‌గా భారత్‌.. భారీ ఆదాయం, ఉపాధి కల్పన 

22 Mar, 2023 07:40 IST|Sakshi

న్యూఢిల్లీ: ఆన్‌లైన్‌ గేమింగ్‌ పరిశమ్ర దేశంలో వేగంగా విస్తరిస్తోంది. ఒక ట్రిలియన్‌ డిజిటల్‌ ఆర్థిక వ్యవ స్థకు గణనీయమైన వాటాను సమకూర్చే సామర్థ్యం ఆన్‌లైన్‌ గేమింగ్‌ పరిశ్రమకు ఉందని ప్రైమస్‌ పార్ట్‌నర్స్‌ సంస్థ ‘భారత్‌లో ఆన్‌లైన్‌ గేమింగ్‌: పన్నుల సందిగ్ధత’ పేరుతో విడుదల చేసిన నివేదిక తెలియజేసింది. ఆన్‌లైన్‌ గేమింగ్‌ నియంత్రణ అనేది ఆర్థిక అవకాశాలకు ద్వారాలను తెరవడమే కాకుండా, పలు సామాజిక అంశాలకు పరిష్కారం చూపిస్తుందని ఇది అభిప్రాయపడింది.

2023–24 బడ్జెట్‌ లో ఆన్‌లైన్‌ గేమింగ్‌ రంగానికి సంబంధించి చేసిన ప్రకటనలు సానుకూలంగా ఉన్నాయని, ఆన్‌లైన్‌ గేమింగ్‌లో వచ్చే లాభాల నుంచి నష్టాలను సర్దుబాటు చేసుకునే డిమాండ్‌ను పరిష్కరించినట్టు పేర్కొంది. ఆన్‌లైన్‌ గేమింగ్‌ లాభాలపై టీడీఎస్‌ అమలుకు యంత్రాంగాన్ని బడ్జెట్‌లో పేర్కొనడాన్ని ఈ నివేదిక ప్రధానంగా ప్రస్తావించింది. ‘‘సెక్షన్‌ 194బీ కింద చేసిన సవరణలు ఆన్‌లైన్‌ గేమింగ్‌ పరిశ్రమకు 2023 ఏప్రిల్‌ 1 నుంచి అమల్లోకి వస్తాయి.

సెక్షన్‌ 194బీఏ కింద ఆన్‌లైన్‌ గేమింగ్‌ పరిశ్రమకు ప్రత్యేక నిబంధనను 2023 జూలై 1 నుంచి అమల్లోకి వచ్చేలా ప్రతిపాదించారు. కానీ, ఇది లోపంగా కనిపిస్తోంది. రెండూ కూడా ఒకే తేదీ నుంచి అమల్లోకి వస్తే సరైన విధంగా ఉంటుంది. రెండూ 2023 ఏప్రిల్‌ 1 నుంచి అమల్లోకి రావాలి. లేదంటే ప్రత్యామ్నాయంగా ప్రస్తుత పన్ను విధానాన్నే ఏప్రిల్‌ 1 నుంచి జూన్‌ 30 వరకు అమలయ్యేలా చూస్తే వ్యత్యాసాలు తొలగిపోతాయి’’అని సూచించింది.  

స్థూల ఆదాయం మెరుగైనది.. 
పరిశ్రమకు సంబంధించి సుస్థిరత అవసరమని, అదే పనిగా పరిణామాలు చోటు చేసుకోవడం వల్ల పరిశ్రమకు అధిక వ్యయాలకు దారితీస్తుందని ఈ నివేదిక పేర్కొంది. అవనసర వ్యయాలతో చిన్న, మధ్య స్థాయి గేమింగ్‌ కంపెనీలు నిలదొక్కుకోవడం కష్టమవుతుందని అభిప్రాయం వ్యక్తం చేసింది. పరిశ్రమకు సంబంధించి జీఎస్‌టీ అనేది స్థూల ఆన్‌లైన్‌ గేమింగ్‌ ఆదాయంపై అమలు చేయడం వల్ల పరిశ్ర మ వృద్ధికి సాయపడుతుందని సూచించింది. అలా కాకుండా మొత్తం ముఖ విలువపై అమలు చేయ డం ఈ రంగానికి ఆచరణ సాధ్యం కాదని పేర్కొంది.  
 

ఏటా 27 శాతం వృద్ధి 
ఆన్‌లైన్‌ గేమింగ్‌ పరిశ్రమ వేగంగా వృద్ధి చెందుతున్నట్టు ఈ నివేదిక ప్రస్తావించింది. ఏటా కాంపౌండెడ్‌గా 27 శాతం చొప్పున, వచ్చే ఐదేళ్లపాటు వృద్ధి చెందుతుందని, దేశ జీడీపీకి పెద్ద మొత్తంలో వాటా సమకూర్చే, పెద్ద ఎత్తున ఉపాధి కల్పించే సామర్థ్యాలు ఈ రంగానికి ఉన్నట్టు పేర్కొంది. 2030 నాటికి లక్ష ఉద్యోగాలను కల్పించగలదని పేర్కొంది. ఇందుకోసం బాధ్యాతాయుత, పారదర్శకమైన, భద్రత వాతావరణం ఉండాలని అభిప్రాయపడింది.

మరిన్ని వార్తలు