నవ ప్రపంచ ఆవిర్భావానికి ఇది సరైన సమయం

16 Sep, 2021 21:28 IST|Sakshi

న్యూఢిల్లీ: అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ రికవరీ పటిష్టమవుతోందని నీతి ఆయోగ్‌ వైస్‌ చైర్మన్‌ రాజీవ్‌ కుమార్‌ బుధవారం పేర్కొన్నారు. దేశాల మధ్య పూర్తి సమన్వయంతో కూడిన కొత్త ప్రపంచ ఆవిర్భావానికి ఇది సరైన సమయమని కూడా ఆయన పిలుపునిచ్చారు. ప్రపంచ మార్కెట్‌ ఎటువంటి అవరోధాలూ లేకుండా ప్రతిదేశానికి అందుబాటులో ఉండే వాతావరణం ఉంటేనే నవ ప్రపంచం ఏర్పాటు సాధ్యమవుతుందని ఆయన విశ్లేషించారు. ఫిక్కీ నిర్వహించిన ఒక వెర్చువల్‌ సమావేశాన్ని ఉద్దేశించి నీతి ఆయోగ్‌ వైస్‌ చైర్మన్‌ చేసిన ప్రసంగంలో కొన్ని ముఖ్యాంశాలను పరిశీలిస్తే.. (చదవండి: యువత మెచ్చే ఖరీదైన కలల బైక్స్!)

  • ప్రపంచ దేశాల ప్రజలకు సరళీకృత, బహుళవిధ సేవలు అందుబాటుకు భావసారూప్యత కలిగిన దేశాలతో కొత్త సంకీర్ణం ఒకటి ఏర్పడాల్సిన అవసరం ఉంది.  
  • అదే సమయంలో ప్రస్తుత బహుళజాతి సంస్థలను మరింత పటిష్టం చేసే చర్యలను చేపట్టాలి.
  • ప్రపంచ యుద్ధాల అనంతర పరిస్థితుల్లో ప్రపంచ దేశాల మధ్య సమన్వయం కొంత పెరిగింది. అయితే కొన్ని సందర్భాల్లో ఈ సమన్వయ, పారదర్శకత లోపించిన పరిస్థితి ఉంది. ఆయా లొసుగులను సరిదిద్దడానికి ప్రపంచ దేశాల నాయకులు అందరూ కలసికట్టుగా సమన్వయ, సహకార చర్యలు తీసుకోవాలి. కొత్త ప్రపంచ వ్యవస్థ ఆవిర్భవంలో ఇది ఎంతో కీలకం.
  • ప్రపంచ యుద్ధాల అనంతరం అంతర్జాతీయ వ్యవస్థ మార్పులో ప్రభుత్వాలు ఎంతో చేశాయి. అయితే కార్పొరేట్‌ రంగం నుంచి ఈ విషయంలో అంత సహకారం అందలేదు.  
  • దేశాల మధ్య సమన్వయం, సహకారం సాధనలో ఐక్యరాజ్యసమితి, ప్రపంచ వాణిజ్య సంస్థ వంటి బహుళజాతి సంస్థలు సాధించిందిసైతం అంతంతమాత్రమే. గ్లోబల్‌ ఇన్‌స్టిట్యూషన్‌లను కూడా ఇప్పుడు పటిష్టం చేయాల్సి ఉంది. ఆయా బహుళజాతి సంస్థల ద్వారానే దేశాల మధ్య సమన్వయం, సహకారం మరింత పెరగడానికి సాధ్యమవుతుంది. ఎందుకంటే ఆయా సంస్థలే మనముందు ఉన్న ఏకైక మార్గం.
  • ప్రస్తుతం ప్రపంచం పరివర్తనకు సంబంధించిన క్లిష్ట స్థితిలో ఉంది. ఈ నేపథ్యంలో మనకు అతి చురుకైన, సున్నితమైన ప్రపంచ సంస్థలు అవసరం. క్రియాశీలత విషయంలో ఆయా సంస్థలు జడత్వం బాటను అనుసరించకూడదు. ఎంత క్లిష్టతరమైన సమస్యపైనైనా ప్రతిస్పందించి, తగిన చర్యలు తీసుకోగలిగిన స్థాయిలో బహుళజాతి సంస్థలు ఉండాలి.
  • భారత్‌కు సంబంధించి మొదటి త్రైమాసికంలో సానుకూల ఆర్థిక ఫలితాలు (20.1 శాతం వృద్ధి)  వచ్చాయి. ఆర్థిక సంవత్సరం రానున్న నెలల్లో ఎకానమీ మరింత మెరుగుపడుతుందన్న సంకేతాలు ఉన్నాయి. ఆర్థిక సంవత్సరానికి సంబంధించి వృద్ధి అంచనాలను (ప్రస్తుతం 10– 8 శాతం శ్రేణిలో అంచనా)  పలు రేటింగ్, విశ్లేషణ  సంస్థలు ఎగువముఖంగా సవరించే అవకాశం ఉంది.
Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు