కేజీ గ్యాస్‌లో మూడొంతుల వాటా రిలయన్స్‌ సంస్థలకే...!

11 May, 2021 04:17 IST|Sakshi

న్యూఢిల్లీ: కేజీ–డీ6 బ్లాకులో కొత్త నిక్షేపాల నుంచి ఉత్పత్తయ్యే గ్యాస్‌లో నాలుగింట మూడో వంతు పరిమాణాన్ని రిలయన్స్‌ ఇండస్ట్రీస్, దాని అనుబంధ సంస్థలు కొనుగోలు చేశాయి. ప్రభుత్వ నిర్దేశిత రేటుకు కొనుగోలు చేశాయి. దిగుమతి చేసుకునే గ్యాస్‌కు చెల్లించే రేటుతో పోలిస్తే ఈ ధర సగానికన్నా తక్కువే అవుతుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. కేజీ–డీ6 బ్లాకులో కనుగొన్న కొత్త నిక్షేపాల నుంచి అదనంగా రోజుకు 5.5 మిలియన్‌ ప్రామాణిక ఘనపు మీటర్ల (ఎంసీఎండీ) గ్యాస్‌ ఉత్పత్తి అవుతుంది. దీన్ని ఇటీవలే బ్లాకు ఆపరేటర్‌ అయిన రిలయన్స్, దాని భాగస్వామ్య సంస్థ బీపీ వేలం వేశాయి.

ఇందులో రిలయన్స్‌కి చెందిన ఆయిల్‌ టు కెమికల్‌ (ఓ2సీ) వ్యాపార విభాగం 3.2 ఎంసీఎండీ గ్యాస్‌ను కొనుగోలు చేసింది. ఇక రిలయన్స్‌–బీపీ జాయింట్‌ వెంచర్‌ సంస్థ ఇండియా గ్యాస్‌ సొల్యూషన్స్‌ (ఐజీఎస్‌) 1 ఎంసీఎండీ గ్యాస్‌ దక్కించుకుంది. నిర్దేశిత ఫార్ములా ప్రకారం ఈ వేలంలో యూనిట్‌ రేటు 8–9 డాలర్ల స్థాయిలో పలికినప్పటికీ .. ఏప్రిల్‌ 1 నుంచి సెప్టెంబర్‌ 30 నాటి దాకా ప్రభుత్వం 3.62 డాలర్ల పరిమితి విధించడంతో అదే ధరకు విక్రయించాల్సి ఉంటుంది. ‘ఇలా పరిమితి విధించడం వల్ల కొనుగోలుదారులు ఎక్కువ రేటు చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నప్పటికీ గ్యాస్‌ను తక్కువ రేటుకే అమ్మాల్సి వస్తుంది. ఫలితంగా కొనుగోలుదారుకు ప్రయోజనం చేకూరినా, ఉత్పత్తిదారుకు మాత్రం గిట్టుబాటు కాదు. అంతకన్నా రాయల్టీలు, ట్యాక్సుల రూపంలో ప్రభుత్వ ఖజానాకు కూడా మిలియన్ల కొద్దీ డాలర్ల మేర ఆదాయానికి గండి పడుతుంది‘ అని సంబంధిత వర్గాలు తెలిపాయి. 

మరిన్ని వార్తలు