సీసీఐ ఓకే: ఆర్‌ఐఎల్‌, ఫ్యూచర్‌ షేర్లు గెలాప్

23 Nov, 2020 13:38 IST|Sakshi

3 శాతంపైగా జంప్‌చేసిన రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ షేరు

10 శాతం అప్పర్‌ సర్క్యూట్‌ను తాకిన ఫ్యూచర్‌ రిటైల్‌

ఇదే బాటలో ఫ్యూచర్‌ లైఫ్‌స్టైల్‌ ఫ్యాషన్‌, ఫ్యూచర్‌ ఎంటర్‌ప్రైజెస్

‌ఫ్యూచర్‌ సప్లై చైన్‌ సొల్యూషన్స్‌, ఫ్యూచర్‌ కన్జూమర్‌ 5 శాతం ప్లస్‌

ముంబై, సాక్షి: రిటైల్‌ బిజినెస్‌ల విక్రయానికి రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌తో కుదుర్చుకున్న ఒప్పందానికి కాంపిటీషన్‌ కమిషన్‌(సీసీఐ) గ్రీన్‌సిగ్నల్‌ ఇవ్వడంతో ఫ్యూచర్‌ గ్రూప్‌ కౌంటర్లకు ఒక్కసారిగా డిమాండ్‌ పుట్టింది. ఈ బాటలో రిలయన్స్‌ రిటైల్‌ ద్వారా ఫ్యూచర్‌ గ్రూప్‌ ఆస్తుల కొనుగోలుకి డీల్‌ కుదుర్చుకున్న రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ కౌంటర్‌ సైతం ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటోంది. వెరసి ఈ కౌంటర్లన్నీ భారీ లాభాలతో సందడి చేస్తున్నాయి. వివరాలు చూద్దాం..

అప్పర్‌ సర్క్యూట్స్‌
ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో ఫ్యూచర్‌ గ్రూప్‌లోని పలు లిస్టెడ్ కంపెనీల షేర్లు అప్పర్‌ అనుమతించినమేర అప్పర్‌ సర్య్యూట్లను తాకాయి. కొనుగోలుదారులు అధికంకాగా.. అమ్మేవాళ్లు కరువుకావడంతో ఫ్యూచర్‌ రిటైల్‌ షేరు 10 శాతం జంప్‌చేసింది. రూ. 79 ఎగువన ఫ్రీజయ్యింది. ఫ్యూచర్‌ లైఫ్‌స్టైల్‌ ఫ్యాషన్స్‌ సైతం 10 శాతం లాభపడి రూ. 90.5 వద్ద నిలిచింది. ఈ బాటలో ఫ్యూచర్‌ సప్లై చైన్‌ సొల్యూషన్స్‌ 5 శాతం పురోగమించి రూ. 103 సమీపంలో ఫ్రీజయ్యింది. ఇదే విధంగా ఫ్యూచర్‌ కన్జూమర్‌ 5 శాతం పెరిగి రూ. 8.25 వద్ద, ఫ్యూచర్‌ ఎంటర్‌ప్రైజ్‌ 5 శాతం పుంజుకుని రూ. 10.40 వద్ద ఫ్రీజయ్యాయి. ఇక డైవర్సిఫైడ్‌ దిగ్గజం ఆర్‌ఐఎల్‌ షేరు 3.2 శాతం బలపడి రూ. 1,959 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 1,970 వరకూ ఎగసింది. కాగా.. ఆర్‌ఐఎల్‌తో ఫ్యూచర్‌ గ్రూప్‌ కుదుర్చుకున్న ఒప్పందానికి ఈకామర్స్‌ దిగ్గజం అమెజాన్‌ అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్న విషయం విదితమే. డీల్‌ను నిలిపివేయమంటూ భాగంగా సింగపూర్‌ ఆర్బిట్రేషన్‌ కోర్టులో ఫిర్యాదు చేసింది. తద్వారా తాత్కాలిక ఉత్తర్వులను సైతం పొందింది. ఫ్యూచర్‌ గ్రూప్‌నకు చెందిన రిటైల్‌, హోల్‌సేల్‌, లాజిస్టిక్స్‌ తదితర బిజినెస్‌ల కొనుగోలుకి రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ రూ. 24,713 కోట్లకు ఒప్పందాన్ని కుదుర్చుకున్న సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు