20 కేజీల బంగారం విరాళమిచ్చిన అంబానీ

7 Nov, 2020 12:46 IST|Sakshi
ఫైల్‌ ఫోటో

కామాఖ్యా ఆలయానికి  ముకేశ్‌ అంబానీ 20 కేజీల బంగారం విరాళం

గుహవాటి : ఆసియా కుబేరుడు, రిలయన్స్‌ అధినేత ముకేశ్‌ అంబానీ భారీ విరాళమిచ్చారు. దేశంలోని సుప్రసిద్ధ అష్టాదశ శక్తిపీరాల్లో ఒకటైన కామాఖ్యాదేవి ఆలయం కోసం 20 కేజీల బంగారాన్ని కానుకగా ఇచ్చారు. అసోంలో ప్రాముఖ్యత గాంచిన ఈ దేవాలయ మూడు గోపుర కలశాలను బంగారంతో తీర్చిదిద్దనున్నారు. .

నీలాచల్ హిల్స్‌లోని కామాఖ్యా ఆలయానికి దీపావళి బహుమతిగా రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్(ఆర్‌ఐఎల్) ఈ విరాళాన్ని ప్రకటించింది. దీనికి సంబంధించిన పనులు ఇప్పటికే ప్రారంభమైనాయని ఆలయ పూజారి దీప్ శర్మ వెల్లడించారు. సుమారు మూడు నెలల క్రితం అంబానీ ఇందుకోసం కామాఖ్యా ఆలయ నిర్వహణ కమిటీని సంప్రదించారని తెలిపారు. మూడు కలశాల బంగారం తాపడం ఖర్చులు తాము భరిస్తామని ఆలయ అధికారులకు హామీ ఇచ్చారని శర్మ వెల్లడించారు. రిలయన్స్‌ ఇంజనీర్లు, శిల్పకారుల ఆధ్వర్యంలో పనులు జరుగుతున్నాయన్నారు. వాతావరణ పరిస్థితులు అనుకూలిస్తే దీపావళికి ముందే బంగారం తాపడం పనులు పూర్తయ్యే అవకాశం ఉందన్నారు. ఈ ప్రాజెక్టు పూర్తయిన తర్వాత అంబానీ దంపతులు ఈ ఆలయాన్ని సందర్శిస్తారని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. బంగారు తాపడంతో శక్తి పీఠం కొత్త శోభను సంతరించుకుంటుందని ఆయన సంతోషం వ్యక్తం చేశారు. కాగా కరోనా వైరస్ కారణంగా ఈ దేవాలయాన్ని మూసివేయగా ప్రోటోకాల్‌ అనుగుణంగా అక్టోబర్ 12 నుంచి మళ్లీ ఆలయాన్ని తెరిచిన విషయం తెలిసిందే.

మరిన్ని వార్తలు