Reliance AGM 2021:ఫ్యూచర్‌ గ్రీన్‌ ఎనర్జీదే... భవిష్యత్‌ భారత్‌దే

24 Jun, 2021 17:09 IST|Sakshi

గ్రీన్‌ ఎనర్జీ రంగంలో రిలయన్స్‌ భారీ పెట్టుబడులు

లక్ష్యంగా 450 గిగావాట్ల గ్రీన్‌ ఎనర్జీ ఉత్పత్తి 

రూ. 60 వేల కోట్లతో ఇంటిగ్రేటెడ్‌ గ్రీన్‌ ఎనర్జీ గిగా కాంప్లెక్స్‌ నిర్మాణం

ఫ్యూచర్‌ టెక్నాలజీపై ఏకంగా రూ. 15,000 పెట్టుబడి

సోలార్‌ప్యానెల్‌ నుంచి బ్యాటరీల వరకు అన్నింటా రిలయన్స్‌

‘జియో’ తరహాలో గ్రీన్‌ ఎనర్జీలో మార్పులు తెస్తామన్న ముఖేష్‌ అంబానీ

44వ వార్షిక సర్వసభ్య సమావేశంలో రిలయన్స్‌ భవిష్యత్‌ దిశానిర్థేశం

ముంబై: గ్రీన్‌ ఎనర్జీ రంగంలో విప్లవాత్మక మార్పులకు  రిలయన్స్‌ శ్రీకారం చుట్టింది. ఒక్క రిలయన్స్‌ సంస్థ నుంచే ఏకంగా 450 గిగా వాట్ల విద్యుత్‌ ఉత్పత్తి చేస్తామంటూ  సంచలన రిలయన్స్‌ చైర్మన్‌ ముఖేష్‌ అంబానీ కీలక ప్రకటన చేశారు. మొబైల్‌ నెట్‌వర్క్‌లో  జియో ఎలాంటి సంచలనాలు సృష్టించిందో, ఏ స్థాయిలో మార్పులు తీసుకువచ్చిందో.. రాబోయే రోజుల్లో అదే తరహా పరిస్థితులు గ్రీన్‌ ఎనర్జీ రంగంలో తీసుకువస్తామంటూ ఆయన ప్రకటించారు.  జూన్‌ 24న వర్చువల్‌గా జరిగిన  రిలయన్స్‌ 44వ వార్షిక సర్వ సభ్య సమావేశంలో  గ్రీన్‌ ఎనర్జీపై ముఖేష్‌ అంబానీ కీలక ప్రకటన చేశారు.

రూ. 75,000 కోట్ల పెట్టుబడి
గ్రీన్‌ ఎనర్జీ రంగంలో ఏకంగా రూ. 75,000 కోట్ల పెట్టుబడులు పెట్టబోతున్నట్టు ముఖేష్‌ అంబానీ ప్రకటించారు. 2035 నాటికి కర్బణ ఉద్ఘారాలను జీరో స్థాయికి తీసుకు రావడం లక్ష్యంగా తమ ప్రణాళిక ఉందని వెల్లడించారు. దీని కోసం గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో ధీరుభాయ్‌ అంబానీ ఇంటిగ్రేటెడ్‌ గ్రీన్‌ ఎనర్జీ గిగా కాంప్లెక్స్‌ తెస్తున్నట్టు వివరించారు. ఇందులో సోలార్‌ ప్యానెల్స్‌, అడ్వాన్స్‌డ్‌ స్టోరేజీ బ్యాటరీల తయారీ, గ్రీన్‌ హైడ్రోజన్‌ ఉత్పత్తి, హ్రైడోజన్‌ వినియోగాలకు సంబంధించి నాలుగు గిగా ఫ్యాక్టరీలు నిర్మిస్తామన్నారు. వీటి కోసం ఏకంగా రూ. 60,000 కోట్లు వెచ్చించబోతున్నట్టు ఆయన తెలిపారు. దీంతో పాటు ఫ్యూచర్‌ టెక్నాలజీ రంగంలో నూతన ఆవిష్కరణల కోసం మరో రూ. 15,000 కోట్లు కేటాయిస్తున్నట్టు వెల్లడించారు. మూడేళ్ల వ్యవధిలోనే ఈ పెట్టుబడులు అమల్లోకి వస్తాయన్నారు. 

ఎండ్‌ టూ ఎండ్‌
గ్రీన్‌ ఎనర్జీ, హైడ్రోజన్‌ ఎనర్జీలకు సంబంధించి ఎండ్‌ టూ ఎండ్‌ సర్వీసులను రిలయన్స్‌ అందివ్వబోతుందని ముఖేష్‌ ప్రకటించారు. అతి తక్కువ ధరకే సోలార్‌ మాడ్యుల్స్‌ తయారు చేయడంతో పాటు విద్యుత్‌ను నిల్వ చేసుకునేందుకు వీలుగా అత్యాధునిక బ్యాటరీలు కూడా తయారు చేస్తామన్నారు.  తమ గ్రీన్‌ ఉత్పత్తులు ఇండస్ట్రీయల్‌ స్కేల్‌లో ఉండటంతో పాటు గృహఅవసరాలు, రైతులు, చిన్న, మధ్య తరహా పరిశ్రమల అవసరాలు తీర్చే విధంగా ఉంటాయని ఆయన వెల్లడించారు. 

450 గిగావాట్లు
రిలయన్స్‌ ద్వారా  స్వంతంగా 450 గిగా వాట్ల గ్రీన్‌ విద్యుత్‌ని ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని ముఖేష్‌ తెలిపారు. ఇందులో  100 గిగా వాట్ల విద్యుత్‌ ఉత్పత్తి సామర్థ్యాన్ని 2030 నాటికి చేరుకుంటామంటూ అంబాని నమ్మకంగా తెలిపారు. ప్రస్తుతం ఇండియా పెట్రోలును దిగుమతి చేసుకుంటుందని, రాబోయే రోజుల్లో ఇండియా నుంచి గ్రీన్‌ ఎనర్జీ విదేశాలు ఎగుమతి అవుతుందని ఆయన అన్నారు. 

చదవండి: Reliance AGM 2021: బోర్డులో స్వతంత్ర డైరక్టర్‌గా ఆరాంకో చైర్మన్‌..!

మరిన్ని వార్తలు