వారందరికీ ఫ్రీగా వ్యాక్సిన్‌ : నీతా అంబానీ

5 Mar, 2021 10:46 IST|Sakshi

రిలయన్స్ ఉద్యోగులకు, వారి కుటుంబ సభ్యులకు టీకా ఫ్రీ : నీతా అంబానీ

కోవిడ్‌-19 వ్యాక్సినేషన్‌కు రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్న రిలయన్స్‌  

సాక్షి, ముంబై: కార్పొరేట్‌ దిగ్గజం రిలయన్స్‌ ఇండస్ట్రీస్ తన ఉద్యోగులకు తీపి కబురు అందించింది.  రిలయన్స్ గ్రూప్‌ ఉద్యోగులందరికీ ఉచితంగా కరోనా వ్యాక్సిన్ అందించనుంది. ఈ మేరకు రిలయన్స్ ఫౌండేషన్ ఛైర్పర్సన్, ముఖేశ్‌ అంబానీ సతీమణి నీతా అంబానీ కీలక ప్రకటన చేశారు. ఉద్యోగులతోపాటు, వారి జీవిత భాగస్వామి, పిల్లలు తల్లిదండ్రులతో సహా వారి కుటుంబ సభ్యులకు కూడా  కరోనా వైరస్‌ టీకా పూర్తి ఖర్చులను తామే భరిస్తామని వెల్లడించారు. (నా అదృష్టం... గర్వంగా ఉంది : నిర్మలా సీతారామన్‌)

ఈ నేపథ్యంలో కోవిడ్-19 టీకా కార్యక్రమానికి నమోదు చేసుకోవాలని ఉద్యోగులను నీతా అంబానీ కోరారు. రిలయన్స్ ఫ్యామిలీలో భాగమైన ఉద్యోగుల భదత్ర, శ్రేయస్సు తమ బాధ్యత అని ఉద్యోగులకు రాసిన ఈమెయిన్‌లో నీతా అంబానీ పేర్కొన్నారు. ఉద్యోగుల ఆరోగ్యం, ఆనందాన్ని కాపాడుకోవడమే ముఖేశ్‌ అంబానీ, తన బాధ్యత అని తెలిపారు. మహమ్మారి అంతం చివరి దశలో ఉన్నాం. కరోనా నిబంధనలు,  జాగ్రత్తలు తీసుకుంటూనే మీ అందరి మద్దతుతో ఈ సామూహిక యుద్ధాన్ని గెలుద్దాం అని నీతా  సందేశమిచ్చారు. దీంతో దేశంలోని తమ ఉద్యోగుల కోవిడ్-19 టీకా ఖర్చులను భరించే ప్రణాళికలను ప్రకటించిన టెక్-జెయింట్స్ ఇన్ఫోసిస్, టీసీఎస్‌, కాప్‌జెమినీ, యాక్సెంచర్ సరసన​ ఆర్‌ఐఎల్ చేరింది. రిలయన్స్ గ్రూప్‌తో పాటు దాని అనుబంధ సంస్థల లక్షలాది శాశ్వత, తాత్కాలిక ఉద్యోగుల కుటుంబాలు లబ్ధి పొందనున్నాయి. 

కాగా మార్చి1నుంచి దేశవ్యాప్తంగా రెండో దశ వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది.  60 ఏళ్లు పైబడిన వారితో పాటు 45 ఏళ్లు నిండి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి కరోనా టీకా అందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ  డ్రైవ్‌లో గురువారం వరకు దాదాపు 11 లక్షల వ్యాక్సిన్ మోతాదులను అందించింది.కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖగణాంకాల ప్రకారం, ఇప్పటికే వ్యాక్సిన్ స్వీకరించిన వారి మొత్తం సంఖ్య 1.77 కోట్లు దాటింది.  మరోవైపు దేశంలో కరోనా ఉధృతి మళ్లీ పెరుగుతోంది. ఒకవైపు, దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం ముమ్మరంగా సాగుతుండగానే కొత్త కేసులు 17వేలకు చేరువ కావడం ఆందోళన కలిగిస్తోంది.

మరిన్ని వార్తలు