ఆర్‌ఐఎల్‌ జూమ్‌- బజాజ్‌ ఫైనాన్స్‌ బోర్లా

7 Oct, 2020 11:08 IST|Sakshi

రిలయన్స్‌ రిటైల్‌లో విదేశీ పెట్టుబడుల వెల్లువ

4 శాతంపైగా జంప్‌చేసిన రిలయన్స్ ఇండస్ట్రీస్‌

క్యూ2లో నిరాశపరచిన వ్యాపార పరిమాణం

5.4 శాతం పతనమైన బజాజ్‌ ఫైనాన్స్ షేరు

మూడు రోజుల ర్యాలీ తదుపరి అటూఇటుగా ప్రారంభమైనప్పటికీ దేశీ స్టాక్‌ మార్కెట్లు తిరిగి జోరందుకున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్‌ 287 పాయింట్లు ఎగసి 39,861కు చేరగా.. నిఫ్టీ 75 పాయింట్లు పెరిగి 11,737 వద్ద ట్రేడవుతోంది. కాగా.. ఈ ఆర్థిక సంవత్సరం(2020-21) రెండో త్రైమాసికంలో నిరుత్సాహకర పనితీరు ప్రదర్శించనున్న అంచనాలతో ఎన్‌బీఎఫ్‌సీ దిగ్గజం బజాజ్‌ ఫైనాన్స్‌ కౌంటర్లో అమ్మకాలు ఊపందుకున్నాయి. మరోవైపు.. అనుబంధ విభాగం రిలయన్స్‌ రిటైల్‌లో వాటా కొనుగోలుకి విదేశీ సంస్థలు ఆసక్తి చూపుతుండటంతో రిలయన్స్‌ ఇండస్ట్రీస్(ఆర్‌ఐఎల్‌) కౌంటర్‌కు డిమాండ్‌ నెలకొంది. వెరసి బజాజ్‌ ఫైనాన్స్‌ షేరు నష్టాలతో కళతప్పగా.. ఆర్‌ఐఎల్‌ లాభాలతో సందడి చేస్తోంది. వివరాలు చూద్దాం..

బజాజ్‌ ఫైనాన్స్‌
ఈ ఏడాది క్యూ2(జులై- సెప్టెంబర్‌)లో కొత్త రుణాలు 6.5 మిలియన్ల నుంచి 3.6 మిలియన్లకు క్షీణించినట్లు బజాజ్‌ ఫైనాన్స్‌ తాజాగా వెల్లడించింది. అయితే నిర్వహణలోని ఆస్తులు(ఏయూఎం) 13 శాతం పుంజుకుని రూ. 1.37 ట్రిలియన్లను తాకినట్లు తెలియజేసింది. కొత్త కస్టమర్లు, రుణాల విడుదల గతేడాది క్యూ2తో పోలిస్తే 50-60 శాతంగా నమోదైనట్లు వివరించింది. ఈ నేపథ్యంలో బజాజ్‌ ఫైనాన్స్‌ షేరు ఎన్‌ఎస్‌ఈలో తొలుత 5.4 శాతం పతనమై రూ. 3,265కు చేరింది. ప్రస్తుతం 4 శాతం నష్టంతో రూ. 3,341 వద్ద ట్రేడవుతోంది.

రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌
రిలయన్స్‌ రిటైల్‌లో తాజాగా అబు ధబి ఇన్వెస్ట్‌మెంట్‌ అథారిటీ రూ. 5,513 కోట్ల పెట్టుబడులకు సిద్ధపడినట్లు డైవర్సిఫైడ్‌ దిగ్గజం రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ పేర్కొంది. తద్వారా రిలయన్స్‌ రిటైల్‌లో 1.2 శాతం వాటాను అబు దభి ఇన్వెస్ట్‌మెంట్‌ కొనుగోలు చేయనున్నట్లు తెలియజేసింది. పారిశ్రామిక దిగ్గజం ముకేశ్‌ అంబానీ కంపెనీ రిలయన్స్‌ రిటైల్‌లో నాలుగు వారాలుగా  విదేశీ సంస్థలు వాటాలు కొనుగోలు చేస్తున్న సంగతి తెలిసిందే. వెరసి రిలయన్స్‌ రిటైల్‌లో 7 కంపెనీలు ఇన్వెస్ట్‌ చేశాయి. తద్వారా కంపెనీ రూ. 37,710 కోట్లను సమకూర్చుకుంది. ఇన్వెస్ట్‌ చేసిన సంస్థలలో సిల్వర్‌ లేక్‌, కేకేఆర్‌, జనరల్‌ అట్లాంటిక్‌, ముబడాలా, జీఐసీ, టీపీజీ ఉన్నాయి. తాజాగా ఏడీఐఏ చేరింది. ఈ నేపథ్యంలో ఆర్‌ఐఎల్‌ షేరు ఎన్‌ఎస్‌ఈలో 7 శాతం దూసుకెళ్లి రూ. 1904 వద్ద ట్రేడవుతోంది.

మరిన్ని వార్తలు