సౌదీ అరామ్ కో- ఆర్ఐఎల్ చర్చలు షురూ?

9 Nov, 2020 15:14 IST|Sakshi

చమురు- కెమికల్ బిజినెస్ లో వాటా విక్రయం

20 శాతం వాటాకు 15 బిలియన్ డాలర్ల విలువ?

డీల్ కుదుర్చుకునేందుకు ప్రారంభమైన చర్చలు?

ముంబై: విదేశీ చమురు దిగ్గజం సౌదీ అరామ్ కోతో డైవర్సిఫైడ్ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ మళ్లీ చర్చలు ప్రారంభించినట్లు ఆంగ్ల మీడియా పేర్కొంది. చమురు- కెమికల్స్ బిజినెస్ లో 20 శాతం వాటా విక్రయానికి గతంలోనే సౌదీ అరామ్ కోతో రిలయన్స్ ఇండస్ట్రీస్ డీల్ కుదుర్చుకునే బాటలో సాగింది. అయితే కోవిడ్-19 కారణంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థలు మందగించడం, చమురు ధరలు పతనంకావడం వంటి ప్రతికూలతలతో చర్చలు తాత్కాలికంగా నిలిచిపోయినట్లు పరిశ్రమవర్గాలు పేర్కొంటున్నాయి. గతంలోనే 15 బిలియన్ డాలర్లకు 20 శాతం వాటాను విక్రయించే అవకాశమున్నట్లు వార్తలు వెలువడ్డాయి. తద్వారా చమురు- కెమికల్స్ బిజినెస్ ఎంటర్ ప్రైజ్ విలువను 75 బిలియన్ డాలర్లుగా నిపుణులు అంచనా వేస్తున్నారు.

రిటైల్ బాటలో
ఇటీవల అనుబంధ విభాగాలైన రిలయన్స్ జియోప్లాట్ ఫామ్స్, రిటైల్ రిటైల్ లలో వాటాల విక్రయాన్ని ఆర్ఐఎల్ విజయవంతంగా చేపట్టిన నేపథ్యంలో తాజాగా సౌదీ అరామ్ కోతోనూ చర్చలు తిరిగి ప్రారంభించినట్లు సంబంధితవర్గాలు పేర్కొన్నాయి. అయితే రిలయన్స్ ఇండస్ట్రీస్ కు చెందిన చమురు ఆస్తులను సౌదీ అరామ్ కో ఫిజికల్ గా పరిశీలించేందుకు ఆసక్తి చూపుతున్నట్లు ఆంగ్ల మీడియా పేర్కొంది. కోవిడ్-19 కారణంగా అరామ్ కోతో డీల్ ఆలస్యమవుతున్నట్లు పారిశ్రామిక దిగ్గజం ముకేశ్ అంబానీ.. ఆర్ఐఎల్ వాటాదారుల సమావేశంలో ఇప్పటికే వెల్లడించిన విషయం విదితమే. కాగా.. ధరకు సంబంధించి డీల్ పెండింగ్ లో ఉన్నట్లు మీడియా పేర్కొంది. నిజానికి డీల్ ను తొలుత ప్రకటించినప్పుడు 2020 మార్చిలోగా కుదుర్చుకోవాలని దిగ్గజ కంపెనీలు రెండూ భావించినట్లు పరిశ్రమవర్గాలు ఈ సందర్భంగా తెలియజేశాయి. 

మరిన్ని వార్తలు