ఆర్‌ఐఎల్‌- రోజారీ బయోటెక్‌ రయ్‌రయ్‌

24 Jul, 2020 11:15 IST|Sakshi

ఆర్‌ఐఎల్‌ సరికొత్త రికార్డ్‌- 3 శాతం అప్‌

రూ. 14 లక్షల కోట్లకు మార్కెట్ క్యాప్‌

రెండో రోజు 7 శాతం జంప్‌చేసిన రోజారీ

లిస్టింగ్‌ రోజు 75 శాతం దూకుడు

ఇటీవల ప్రతిరోజూ సరికొత్త గరిష్టాలను తాకుతున్న డైవర్సిఫైడ్‌ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్‌ కౌంటర్‌(ఆర్‌ఐఎల్‌)కు మరోసారి డిమాండ్‌ నెలకొంది. దీంతో  పారిశ్రామిక దిగ్గజం ముకేశ్‌ అంబానీ గ్రూప్‌లోని ప్రధాన కంపెనీ ఆర్‌ఐఎల్‌ షేరు మరోసారి చరిత్రాత్మక గరిష్టాన్ని అందుకుంది. ఈ బాటలో గురువారం భారీ లాభాలతో లిస్టయిన స్పెషాలిటీ కెమికల్స్‌ కంపెనీ రోజారీ బయోటెక్‌ వరుసగా రెండో రోజూ ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటోంది. వెరసి ఈ రెండు కౌంటర్లూ నష్టాల మార్కెట్లోనూ లాభాలతో కళకలాడుతున్నాయి. వివరాలు చూద్దాం..

ఆర్‌ఐఎల్‌ రికార్డ్‌
డిజిటల్‌ అనుబంధ విభాగం జియో ప్లాట్‌ఫామ్స్‌లో ఇన్వెస్ట్‌ చేసేందుకు విదేశీ దిగ్గజాలు క్యూకట్టడం, రైట్స్‌ ఇష్యూ పూర్తి నేపథ్యంలో ఆర్‌ఐఎల్‌ కౌంటర్‌లో ర్యాలీ కొనసాగుతోంది. కంపెనీ ఇప్పటికే రుణరహితంకావడంతోపాటు రిలయన్స్‌ రిటైల్‌, జియోమార్ట్‌ వంటి విభాగాలపైనా వ్యూహాత్మక ఇన్వెస్టర్లు ఆసక్తి చూపుతున్న వార్తలు ఇన్వెస్టర్లకు జోష్‌నిస్తున్నాయి. దీంతో నేటి ట్రేడింగ్‌లో ఎన్‌ఎస్‌ఈలో తొలుత ఆర్‌ఐఎల్‌ షేరు రూ. 2150కు చేరింది. ఇది ఆల్‌టైమ్‌ హై.. కాగా.. ప్రస్తుతం 3 శాతం లాభంతో రూ. 2120 వద్ద ట్రేడవుతోంది. ఒక దశలో కంపెనీ మార్కెట్‌ క్యాప్‌(విలువ) రూ. 14 లక్షల కోట్లను తాకడం గమనార్హం! గత నెల రోజుల్లో ఆర్‌ఐఎల్‌ షేరు 22 శాతం లాభపడిన సంగతి తెలిసిందే.

రోజారీ బయోటెక్‌
గత ఐదేళ్ల కాలంలో లిస్టయిన తొలి రోజే 75 శాతం జంప్‌చేయడం ద్వారా రికార్డ్‌ సృష్టించిన రోజారీ బయోటెక్ వరుసగా రెండో రోజు లాభాలతో దూసుకెళ్లింది. ఎన్‌ఎస్‌ఈలో తొలుత 7 శాతం ఎగసి రూ. 794కు చేరింది. ఇది సరికొత్త గరిష్టంకాగా తదుపరి వెనకడుగు వేసింది. ప్రస్తుతం స్వల్ప లాభంతో రూ. 743 వద్ద ట్రేడవుతోంది. ఈ నెల రెండో వారంలో ఐపీవో పూర్తిచేసుకున్న రోజారీ బయోటెక్‌ గురువారం భారీ లాభాలతో లిస్టయ్యింది.  ఇష్యూ ధర రూ. 425కాగా.. చివరికి 75 శాతం లాభంతో రూ. 742 వద్ద ముగిసింది. గత ఐదేళ్ల కాలంలో 11 కంపెనీలు మాత్రమే లిస్టింగ్‌లో 50 శాతానికిపైగా లాభపడినట్లు విశ్లేషకులు ఈ సందర్భంగా తెలియజేశారు. తొలి రోజు బీఎస్‌ఈలో ఇంట్రాడేలో రూ. 804 వద్ద గరిష్టాన్ని తాకగా.. ఈ కౌంటర్లో 30 లక్షలకుపైగా షేర్లు చేతులు మారినట్లు తెలుస్తోంది. 

>
మరిన్ని వార్తలు