పెట్టుబడుల వెల్లువ : రిలయన్స్ జోరు

14 Sep, 2020 13:01 IST|Sakshi

సాక్షి,ముంబై: ఆసియా అపర కుబేరుడు ముకేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ రోజుకో కొత్త రికార్డుతో దూసుకుపోతోంది. టెలికాం విభాగం రిలయన్స్ జియోలో పెట్టుబడుల సునామీ అనంతరం తాజాగా  రిలయన్స్‌ రిటైల్‌లో వరుస పెట్టుబడులను సొంతం చేసుకుంటోంది. ఈ నేపథ్యంలో రిలయన్స్ షేర్ సోమవారం దాదాపు 2 శాతం లాభపడి ఆల్ టైం గరిష్టాన్ని నమోదు చేసింది. తద్వారా 15 లక్షల కోట్ల మార్కెట్ క్యాపిటలైజేషన్‌ అధిగమించింది. దీంతో అత్యంత విలువైన తొలి భారతీయ కంపెనీగా అవతరించింది. రిలయన్స్ రిటైల్ లో అమెరికా ప్రైవేట్ ఈక్విటీ సంస్థ కార్లయిల్ 2 బిలియన్ డాలర్ల పెట్టుబడులకు అవకాశం ఉందన్న రిపోర్టుల మధ్య ఆర్‌ఐఎల్ షేరు 2360 రూపాయల వద్ద ఆల్ టైం గరిష్ట స్థాయిని తాకింది. దీంతో బీఎస్‌ఇలో సంస్థ మార్కెట్ క్యాప్ రూ.15.80 లక్షల కోట్లకు చేరింది.  ఆర్‌ఐఎల్ షేరు గత ఆరు రోజులలో 12.21 శాతం పుంజుకోవడం విశేషం.

రిలయన్స్ రీటైల్ విభాగంలో పెట్టుబడులువెల్లువ కొనసాగుతున్నసంగతి తెలిసిందే. తాజా కార్లయిల్ ఒప్పందం ఖరారైతే, ఒక భారతీయ కంపెనీలో ఇది అతిపెద్ద పెట్టుబడిగాను, దేశ రిటైల్ రంగంలో కంపెనీ మొదటి పెట్టుబడిగాను రికార్డు దక్కించుకోనుంది.  ఇప్పటికే టెక్ ఇన్వెస్టర్ సిల్వర్ లేక్ పార్ట్‌నర్స్ రూ.7500 కోట్లు ఇన్వెస్ట్ చేసింది. అమెజాన్ ఏకంగా 20 బిలియన్ డాలర్లతో 40శాతం వాటా కొనుగోలుకు చర్చలు జరుగుతున్నాయని సమాచారం. దీంతో పాటు త్వరలో కేకేఆర్, ముబదాలా, అబుదాబీలు కూడా ఇన్వెస్ట్ మెంట్ చేయడానికి రంగం సిద్దం చేసుకుంటున్నాయి. 

మరిన్ని వార్తలు