అమెరికన్‌ బ్యాటరీల సంస్థలో రిలయన్స్‌ పెట్టుబడులు

11 Aug, 2021 00:56 IST|Sakshi

ఆంబ్రీలో 50 మిలియన్‌ డాలర్లు 

ఇన్వెస్ట్‌ చేయనున్న ఆర్‌ఎన్‌ఈఎస్‌ఎల్‌

న్యూఢిల్లీ: రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ తాజాగా అమెరికాకు చెందిన సంస్థ ఆంబ్రీలో ఇన్వెస్ట్‌ చేయనుంది. కొత్తగా ఏర్పాటు చేసిన పునరుత్పాదక విద్యుదుత్పత్తి సంస్థ రిలయన్స్‌ న్యూ ఎనర్జీ సోలార్‌ (ఆర్‌ఎన్‌ఈఎస్‌ఎల్‌) ద్వారా 50 మిలియన్‌ డాలర్ల పెట్టుబడులు పెట్టనుంది. ఆంబ్రీ సంస్థ పవర్‌ గ్రిడ్‌లకు అవసరమైన బ్యాటరీలను తయారు చేస్తోంది. ప్రస్తుతం ఐటీ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌ వ్యవస్థాపకుడు బిల్‌ గేట్స్‌ సహా పలువురు ఇన్వెస్టర్లు 144 మిలియన్‌ డాలర్లు ఇందులో ఇన్వెస్ట్‌ చేస్తుండగా.. ఆర్‌ఎన్‌ఈఎస్‌ఎల్‌ కూడా కొంత మేర పెట్టుబడులు పెడుతోంది. దీనితో ఆంబ్రీలో ఆర్‌ఎన్‌ఈఎస్‌ఎల్‌కు 4.23 కోట్ల షేర్లు లభిస్తాయి.

ఈ నిధులను తయారీ కేంద్ర నిర్మాణం, టెక్నాలజీ విక్రయం తదితర అవసరాల కోసం ఆంబ్రీ వినియోగించనుంది. 2022లో తమ లిక్విడ్‌ మెటల్‌ గ్రిడ్‌ బ్యాటరీ సాంకేతికతను వాణిజ్యపరంగా అందుబాటులోకి తేవాలని కంపెనీ భావిస్తోంది. లిథియం అయాన్‌ బ్యాటరీలతో పోలిస్తే సగం ధరకే ఈ టెక్నాలజీతో బ్యాటరీలను తయారు చేయొచ్చు. మరోవైపు, భారత్‌లో భారీ స్థాయి బ్యాటరీ తయారీ కేంద్రం ఏర్పాటుపై కూడా ఆర్‌ఎన్‌ఈఎస్‌ఎల్, ఆంబ్రీ చర్చలు జరుపుతున్నాయి. 

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు