Rakesh Jhunjhunwala: అ‍ల్విదా బిగ్‌బుల్‌ ఒక శకం ముగిసింది: పలువురి భావోద్వేగం

14 Aug, 2022 13:22 IST|Sakshi

సాక్షి, ముంబై: ప్రముఖ పెట్టుబడిదారుడు, బిలియనీర్‌ రాకేష్‌ ఝున్‌ఝున్‌వాలా(62) ఆకస్మిక మరణం దిగ్భ్రాంతి గురిచేసింది.  నేడు(ఆగస్టు 14న) ముంబైలో గుండెపోటుతో కన్నుమూయడంపై దేశ ప్రధానమంత్రి నరేంద్రమోదీ ట్విటర్‌ ద్వారా సంతాపం తెలిపారు. ఇంకా కేంద్ర హోంమంత్రి అమిత్‌షా, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌,మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్‌ షిండే  బిలియనీర్‌ హఠాన్మరణంపై ప్రగాఢ సానుభూతి ప్రకటించారు.

చదవండి :  రాకేష్ ఝున్‌ఝున్‌వాలా నిర్మించిన బాలీవుడ్‌ మూవీలు ఏవో తెలుసా?

ఒక శకం ముగిసిందంటూ పలువురు పారిశశ్రామికవేత్తలు, వ్యాపార దిగ్గజాలు, ఆయన అభిమానులు నివాళులర్పించారు. ముఖ్యంగా కోటక్ మహీంద్రా బ్యాంక్ సీఈఓ ఉదయ్ కోటక్, బిలియనీర్‌ గౌతమ్ అదానీ, హీలియోస్ క్యాపిటల్ వ్యవస్థాపకుడు అండ్‌ ఫండ్ మేనేజర్ సమీర్ అరోరా తదితరులు ట్విటర్‌ ద్వారా సంతాపం వెలిబుచ్చారు. ఝున్‌ఝున్‌వాలా సలహాలు, సూచనలతో మార్కెట్‌లో విజయం సాధించిన పలువురు అభిమానులు ఆయన ఇక లేరన్న వార్తను జీర్ణించుకోలేకపోతున్నారు. ఆయన జ్ఞాపకాలను తలుచుకుని  కంట తడి పెట్టు కుంటున్నారు.

పెట్టుబడిదారులు, శ్రేయోభిలాషులు పెద్ద ఎత్తన గుమిగూడడంతో ఆయన నివాసం వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. మార్కెట్‌లో ఆయన లేని లోటు పూడ్చలేనిదని వ్యాఖ్యానిస్తున్నారు.  కాగా ఫోర్బ్స్ ప్రకారం భారతదేశానికి చెందిన వారెన్ బఫెట్ అని పిలుచుకునే నికర విలువ  5.8 బిలియన్ డాలర్లు (ఆగస్టు 2022 నాటికి)  ఇండియాలో 36వ సంపన్నుడు.  ప్రపంచంలోని 438వ  బిలియనీర్‌గా ఉన్నారు.

మరిన్ని వార్తలు