Akshata Murthy: రిషి సతీమణి అక్షతకు ఇన్ఫీ ద్వారా ఎన్ని కోట్లు వచ్చాయో తెలుసా?

25 Oct, 2022 15:18 IST|Sakshi

న్యూఢిల్లీ: బ్రిటన్ తదుపరి ప్రధాన మంత్రిగా రిషి సునాక్‌ రికార్డ్‌ సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ సందర్బంగా ఆయన సతీమణి అక్షతా మూర్తికి సంబంధించిన వ్యాపారాలు, ఆస్తులకు సంబంధించిన వివరాలు వ్యాపార వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.  భారతదేశంలోని రెండవ అతిపెద్ద  ఐటీ సంస్థ ఇన్ఫోసిస్‌లో వాటాద్వారా భారీ ఆదాయాన్ని ఆర్జించినట్టు తెలుస్తోంది.  ముఖ్యంగా  2022లో  ఇన్పీ  అందించిన డివిడెండ్  ద్వారా రూ. 126.61 కోట్లు (15.3 మిలియన్‌ డాలర్లు) సొంతం చేసుకున్నారు.  అంతేకాదు 730 మిలియన్ల పౌండ్స్‌ సంపదతో రిషి సునాక్‌, అక్షత  జంట యూకే ధనవంతుల జాబితా 2022లో 222వ స్థానంలో ఉన్నారు.

స్టాక్ ఎక్స్ఛేంజీలకు కంపెనీ దాఖలు చేసిన సమాచారం ప్రకారం ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి కుమార్తె అక్షతమూర్తి సెప్టెంబర్ చివరి నాటికి ఇన్ఫోసిస్‌లో 3.89 కోట్ల షేర్లు లేదా 0.93 శాతం వాటాను కలిగి ఉన్నారు. బీఎస్‌ఈ మంగళవారం ట్రేడింగ్ రూ. 1,527.40 వద్ద ఆమె  వాటా విలువ రూ. 5,956 కోట్లుకు చేరింది. 

ఇదీ చదవండి: రిషి సునాక్‌ విజయం: ఇన్ఫీ నారాయణమూర్తి తొలి రియాక్షన్‌ 

ఇన్ఫోసిస్ ఈ ఏడాది మే 31న 2021-22 ఆర్థిక సంవత్సరానికి ఒక్కో షేరుకు  16 రూపాయల తుది డివిడెండ్ చెల్లించింది. అలాగే ప్రస్తుత సంవత్సరానికి,  ఇటీవల ఫలితంగా సందర్భంగా  రూ. 16.5 మధ్యంతర డివిడెండ్‌ను ప్రకటించింది. రెండు డివిడెండ్‌లు  కలిపి  మొత్తం రూ. 126.61 కోట్లు అక్షత ఖాతాలో చేరాయి. 

భారతదేశంలో అత్యుత్తమ డివిడెండ్ చెల్లించే కంపెనీలలో ఇన్ఫోసిస్ ఒకటి. 2021లో, ఇది ఒక్కో షేరుకు మొత్తం రూ. 30 డివిడెండ్‌ని చెల్లించింది. ఫలితంగా అక్షత 119.5 కోట్లను  దక్కించుకున్నారు. అలాగే ఇన్ఫోసిస్ ఫైలింగ్స్ ప్రకారం, కంపెనీలో ప్రమోటర్లు 13.11 శాతం వాటా కలిగి ఉన్నారు. ఇందులో మూర్తి కుటుంబానికి 3.6 శాతం (నారాయణ మూర్తికి 0.40 శాతం, ఆయన భార్య సుధకు 0.82 శాతం, కుమారుడు రోహన్‌కు 1.45 శాతం, కుమార్తె అక్షతకు 0.93 శాతం) వాటా ఉంది.

కాగా ఉత్తర కర్ణాటకలోని తన తల్లి సుధా మూర్తి స్వస్థలమైన హుబ్బల్లిలో1980లో పుట్టారు అక్షత. కాలిఫోర్నియాలోని క్లేర్‌మాంట్ మెక్‌కెన్నా కాలేజీకి వెళ్లడానికి ముందు బెంగళూరులో పాఠశాల విద్యను అభ్యసించారు. అక్కడ ఆమె ఆర్థికశాస్త్రం , ఫ్రెంచ్‌లో డ్యూయల్ మేజర్‌తో పట్టభద్రురాలయ్యారు. తరువాత  లాస్ ఏంజిల్స్‌లోని ఫ్యాషన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ అండ్ మర్చండైజింగ్ నుండి ఫ్యాషన్ డిజైనింగ్ డిప్లొమా ,  స్టాన్‌ఫోర్డ్‌లో  ఎంబీఏ పట్టా పొందారు.  అక్షత మూర్తి ఎంబీఏ చదువుతున్న సమయంలో స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీలో సునాక్, అక్షత మూర్తికి పరిచయం పెళ్లికి దారి తీసింది. 2009లో వివాహం చేసుకున్న ఈ దంపతులు కెన్సింగ్టన్‌లోని  నివసిస్తున్నారు. వీరికి కృష్ణ, అనౌష్క అనే ఇద్దరు అమ్మాయిలున్నారు. ప్రస్తుతం  అక్షత వ్యాపారవేత్తగా రాణిస్తున్నారు. 

మరిన్ని వార్తలు