చమురు, బొగ్గు ధరల భారం

15 Oct, 2021 03:56 IST|Sakshi

భారత్‌పై మోర్గాన్‌ స్టాన్లీ అంచనా

ముంబై: అంతర్జాతీయంగా పెరుగుతున్న చమురు, బొగ్గు ధరలు భారత్‌కు సవాలుగా మారనున్నట్లు ఫారిన్‌ బ్రోకరేజ్‌ సంస్థ మోర్గాన్‌ స్టాన్లీ గురువారంనాటి తన తాజా నివేదికలో విశ్లేషించింది. ఇప్పటికే ద్రవ్యోల్బణం, వృద్ధి సవాళ్లు పొంచిఉన్న భారత్‌కు కీలక కమోడిటీల ధరలు పెరగడం ప్రతికూలాంశమని వివరించింది. నివేదికలోని కొన్ని ముఖ్యాంశాలను పరిశీలిస్తే..

► చమురు ధరలు వార్షికంగా  14 శాతం పెరిగి బేరల్‌కు 84 డాలర్లకు చేరాయి. ఇక బొగ్గు ధర మెట్రిక్‌ టన్నుకు 15 శాతం ఎగసి 200 డాలర్లకు చేరింది. ఇంధన ధరలు పెరగడం వల్ల ద్రవ్యోల్బణం పెరుగుదల భయాలు నెలకొన్నాయి. దీనితో వృద్ధి మందగించే అవకాశం ఉంది. ఆయా పరిస్థితులు ద్రవ్య పరపతి విధానం కఠినతరం కావడానికి దారితీయవచ్చు.  

► 10 శాతం చమురు ధర పెరిగితే ఆ ప్రభావం వినియోగ ధరల సూచీ ఆధారిత రిటైల్‌ ద్రవ్యోల్బణంపై 0.40 శాతం మేర ఉంటుంది. చమురు ప్రధాన దిగుమతి దేశమైన భారత్‌పై ఈ బిల్లు భారంగా మారుతుంది. 10 శాతం చమురు దరల పెరుగుదల ప్రభావం కరెంట్‌ అకౌంట్‌పై (దేశంలోకి వచ్చీ–పోయే విదేశీ మారకద్రవ్య నిధుల మధ్య నికర వ్యత్యాసం)  0.30 శాతం (జీడీపీ విలువతో పోల్చి) ప్రభావం చూపుతుంది.  

►  తాజా పరిస్థితుల నేపథ్యంలో భారత్‌ నుంచి ఎగుమతులు మరింత పెరగాల్సి ఉంటుంది.

78కి రూపాయి: యూబీఎస్‌
స్విట్జర్లాండ్‌ బ్యాంకింగ్‌ సేవల దిగ్గజం యూబీఎస్‌ ఈ విషయంపై తన అభిప్రాయాన్ని వెల్లడిస్తూ, క్రూడ్‌ ఆయిల్‌ ధరల పెరుగుదల వల్ల భారత్‌ కరంట్‌ అకౌంట్‌ లోటు 14 బిలియన్‌ డాలర్లక చేరుతుందని (జీడీపీలో 0.5 శాతం) పేర్కొంది. చమురు ధర 100 డాలర్లు తాకితే, క్యాడ్‌ 3 శాతం వరకూ పెరుగుతుందని యూబీఎస్‌ అంచనా వేసింది. దీనితో రూపాయి డాలర్‌ మారకంలో 78కి చేరే అవకాశం ఉంటుందని అంచనావేసింది. అయితే క్యాడ్‌ సమస్య భారత్‌కు తాత్కాలికంగానే ఉండే అవకాశం ఉందని నివేదిక పేర్కొంది. భారత్‌ ఉన్న భారీ విదేశీ మారకపు నిల్వలు (600 బిలియన్‌ డాలర్లకుపైగా) ఈ నష్టాన్ని కట్టడి చేయడానికి దోహదపడతాయన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది.

అదే విధంగా 2022 మార్చి నాటికి క్రూడ్‌ ధర బేరల్‌కు 68 బిలియన్‌ డాలర్లకు దిగివస్తుందన్న అంచనాలనూ వెలువరించింది.   బొగ్గు కొరత వల్ల విద్యుత్‌ ఉత్పత్తికి, సెమికండక్టర్‌ చిప్స్‌ వల్ల ఆటో రంగానికి స్వల్ప కాలంలో తీవ్ర ప్రతికూల ప్రభావాలు ఎదురుకానున్నాయని విశ్లేíÙంచింది. వ్యవస్థలో అదనపు లిక్విడిటీని వెనక్కు తీసుకోవడంలో భాగంగా రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) రివర్స్‌ రెపో రేటును (ఆర్‌బీఐ వద్ద ఉంచిన తమ అదనపు నిధులకుగాను బ్యాంకులు పొందే వడ్డీరేటు– ప్రస్తుతం 3.35 శాతం) పెంచే అవకాశం ఉందని సంస్థ అంచనావేసింది. ఈ రేటును 0.15 శాతం–0.20 శాతం శ్రేణిలో పెంచే వీలుందని పేర్కొంది. వచ్చే ఏడాది డిసెంబర్, ఫిబ్రవరి ద్వైమాసిక పరపతి విధాన సమీక్షలో ఆర్‌బీఐ ఈ మేరకు నిర్ణయం తీసుకోవచ్చని పేర్కొంది.

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు