లాక్‌డౌన్‌లు ఎత్తేస్తే.. టూర్లకు రెడీ 

25 Jun, 2021 00:06 IST|Sakshi

ఎక్కువ మంది చెబుతోంది ఇదే 

యాత్రలకు వెళ్లేందుకు అమితాసక్తి 

కనీసం 6–12 రోజుల కోసం ప్రణాళిక

న్యూఢిల్లీ: కరోనా లాక్‌డౌన్‌లు, ఇళ్లకే పరిమితం కావడం.. కార్యాలయ పనిని కూడా ఇంటి నుంచే చేయడం.. ఈ విధమైన జీనవశైలితో చాలా మందికి బోర్‌కొట్టినట్టుంది. లాక్‌డౌన్‌లు ఆంక్షలు ఎత్తేస్తే విహార, పర్యాటక యాత్రలకు బయల్దేరేందుకు ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తున్నారు. థామస్‌కుక్‌ ఇండియా, ఎస్‌వోటీసీ నిర్వహించిన సర్వేలో 69 శాతం మంది 2021లోనే ప్రయాణించేందుకు సిద్ధంగా ఉన్నట్టు చెప్పారు. లాక్‌డౌన్‌లను తెరిచిన వెంటనే ప్రయాణించేందుకు తాము సుముఖంగా ఉన్నామని 18 శాతం మంది చెప్పడం గమనార్హం. 3–6 నెలల్లో ప్రయాణం పెట్టుకుంటామని 51 శాతం మంది చెప్పారు.

ఈ మేరకు సర్వే వివరాలతో ‘హాలిడే రెడీనెస్‌ నివేదికను’ థామస్‌కుక్, ఎస్‌వోటీసీ సంయుక్తంగా విడుదల చేశాయి. దేశీయంగా ఉన్న ప్రదేశాలను ఎంపిక చేసుకుంటామని 52 శాతం మంది చెప్పగా.. 48 శాతం మంది ఎంపిక విదేశీ పర్యాటక ప్రాంతాలపై ఉన్నట్టు సర్వే వివరాలు తెలియజేస్తున్నాయి. దేశంలో కశ్మీర్, లేహ్‌–లఢక్, హిమాచల్‌ప్రదేశ్, అండమాన్స్, గోవా, కేరళ ప్రముఖ ప్రదేశాలుగా ఉంటే, దుబాయి–అబుదాబి, మాల్దీవులు, మారిషస్, థాయిలాండ్, యూరోప్‌ విదేశాలకు వెళ్లాలనుకుంటున్నవారి ఎంపికలుగా ఉన్నాయి.  

సర్వేలోని అంశాలు.. 
ఆరోగ్యం, భద్రత తమను ఆందోళనకు గురిచేసే అంశాలని 70 శాతం మంది చెప్పారు. పర్యటన సమయంలో ఆరోగ్యం, వ్యక్తిగత రక్షణ కోసం ఎక్కువ ఖర్చు పెట్టేందుకు 66 శాతం మంది సిద్ధంగా ఉన్నారు. 
62 శాతం మంది కుటుంబ సభ్యులు లేదా స్నేహితులతో కలిసే ప్రయాణం పెట్టుకుందా మని భావిస్తుంటే.. 20 శాతం మంది దంపతులు లేదా ఒంటిరిగానే వెళ్లాలని అనుకుంటున్నారు. 
హోటళ్లలో గదులను శానిటైజ్‌ చేస్తేనే ఎంపిక చేసుకునేందుకు 52 శాతం మంది ప్రాధాన్యం ఇస్తున్నారు.  
3–5 రోజుల పాటు యాత్రలకు ప్రణాళిక రూపొందించుకోవాలని 35 శాతం మంది భావిస్తుంటే.. 52 శాతం మంది 6–12 రోజుల పాటైనా హాయిగా దూర ప్రాంతాలకు వెళ్లి సేదతీరి రావాలనుకుంటున్నారు.  మరో 13 శాతం మంది 12 రోజులకుపైన పర్యటన కోసం కేటాయించాలని అనుకుంటున్నట్టు సర్వే వివరాలు స్పష్టం చేస్తున్నాయి.    

మరిన్ని వార్తలు