ఫోన్‌ ఏదైనా ఛార్జర్‌ ఒక్కటే, అధ్యయనంలో కేంద్ర నిపుణుల బృందం!

18 Aug, 2022 11:33 IST|Sakshi

న్యూఢిల్లీ: వివిధ రకాల మొబైల్స్, పోర్టబుల్‌ ఎలక్ట్రానిక్‌ పరికరాలన్నింటికీ ఒకే తరహా చార్జర్లను వినియోగంలోకి తెచ్చే అంశాన్ని అధ్యయనం చేసేందుకు నిపుణుల బృందాలను ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ కార్యదర్శి రోహిత్‌ కుమార్‌ సింగ్‌ తెలిపారు. ఇవి రెండు నెలల వ్యవధిలో సవివర నివేదికను సమర్పించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. 

పరిశ్రమ, యూజర్లు, తయారీదారులు, పర్యావరణం వంటి అంశాలన్నింటినీ పరిగణించి ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని సింగ్‌ వివరించారు. పరిశ్రమ వర్గాలతో బుధవారం భేటీ అయిన తర్వాత ఆయన ఈ విషయాలు తెలిపారు.

 ప్రతి వర్గం ఆలోచనలు భిన్నంగా ఉంటాయి కాబట్టి ఆయా అంశాలను అధ్యయనం చేసేందుకు వేర్వేరుగా నిపుణుల బృందాలను ఏర్పాటు చేయనున్నట్లు సింగ్‌ పేర్కొన్నారు. నెల రోజుల్లోగా బృందాలను నోటిఫై చేస్తామని వివరించారు.  

మరిన్ని వార్తలు