Cristiano Ronaldo: ఫుట్‌బాల్‌లో క్రేజీ రికార్డులు.. ఇప్పుడేమో సంచలన ఒప్పందం

13 Oct, 2021 12:12 IST|Sakshi

క్రిస్టియానో రొనాల్డో.. ఫుట్‌బాల్‌ చరిత్రలో ఈ పేరు ఒక సంచలనం. కనివిని ఎరుగని రీతిలో పదిసార్లు ఇంటర్నేషనల్‌  హ్యాట్రిక్‌ గోల్స్‌ సాధించి సంచలనానికి తెర తీశాడు ఈ ఫుట్‌బాల్‌ మొనగాడు. యూరోపియన్‌ క్వాలిఫైయర్స్‌(UEFA Champions League) టోర్నీలో భాగంగా.. మంగళవారం పోర్చుగల్‌ తరపున రొనాల్డో హ్యాట్రిక్‌ గోల్స్‌ సాధించడంతో లగ్జెంబర్గ్‌ 5-0 తేడాతో చిత్తుగా ఓడింది. ఇదిలా ఉంటే తాజాగా ఓ భారీ బిజినెస్‌ డీల్‌తోనూ వార్తల్లోకెక్కాడు మరి. 

సింగపూర్‌ వ్యాపారదిగ్గజం, వాలెన్షియా(స్పెయిన్‌) ఫుట్‌బాల్‌ క్లబ్‌ ఓనర్‌ పీటర్‌ లీమ్‌కి రొనాల్డోకి చాలాకాలంగా దోస్తీ ఉంది. గతంలో లిమ్‌కు చెందిన మింట్‌ మీడియా ద్వారా రొనాల్డో చిత్రాల వ్యాపారం కూడా జోరుగా సాగించింది. ఈ తరుణంలో జూజూజీపీ అనే అనే ప్లాట్‌ఫామ్‌ కోసం వీళ్లిద్దరూ మళ్లీ చేతులు కలిపారు. ఫుట్‌బాల్‌, టెక్నాలజీ, కమ్యూనికేషన్‌.. ఈ మూడింటి ఆధారంగా ఈ ప్లాట్‌ఫామ్‌ పని చేస్తుండడం విశేషం. ఇందుకోసం భారీగా రెమ్యునరేషన్‌ (తన ఏడాది సంపాదనలో 30 శాతం విలువ చేసే రెమ్యునరేషన్‌!) తీసుకున్నట్లు తెలుస్తోంది. ‘ఇకపై ఫుట్‌బాల్‌ని జనాలు చూసే విధానం మారుతుంది’ అంటూ ఓ స్టేట్‌మెంట్‌ను జాయింట్‌గా రిలీజ్‌ చేశారు రొనాల్డో-లీమ్‌. 

పోర్చ్‌గల్‌ కెప్టెన్‌ అయిన 36 ఏళ్ల క్రిస్టియానో రొనాల్డో..  ఈమధ్య కాలంలో వరుస రికార్డులు సృష్టిస్తున్నాడు. కెరీర్‌ మొత్తంగా యాభై ఎనిమిదిసార్లు హ్యాట్రిక్‌ గోల్స్‌, పదిసార్లు ఇంటర్నేషనల్‌ హ్యాట్రిక్‌ గోల్స్‌ ఫీట్‌ సాధించాడు.  అంతేకాదు ఫిఫా లెక్కల ప్రకారం.. 182 మ్యాచ్‌ల్లో 115 గోల్స్‌ సాధించి అత్యధిక గోల్స్‌ వీరుడిగా కొనసాగుతున్నాడు. మరోవైపు సంపాదనలోనూ సమవుజ్జీగా భావించే అర్జెంటీనా ఆటగాడు లియోనెల్‌ మెస్సీని దాటేసి.. 2021-22 సీజన్‌కు గాను ప్రపంచంలో అత్యధిక పారితోషికం అందుకుంటున్న ఫుట్‌బాలర్‌గా ఫోర్బ్స్‌ జాబితాలో నిలిచాడు.  ఏడాదికి రొనాల్డో 922 కోట్ల రూపాయలు అర్జిస్తున్నట్లు ఫోర్బ్స్‌ గణాంకాలు చెప్తున్నాయి.

చదవండి: ఐస్‌బాత్‌లో రొనాల్డొ చిందులు.. ధర తెలిస్తే అవాక్కవ్వాల్సిందే!

మరిన్ని వార్తలు