రూట్‌ మొబైల్‌ ఐపీవోకు యాంకర్‌ నిధులు

9 Sep, 2020 13:48 IST|Sakshi

15 సంస్థల నుంచి రూ. 180 కోట్లు సమీకరణ

నేటి నుంచి పబ్లిక్‌ ఇష్యూ- 11న ముగింపు

ధరల శ్రేణి రూ. 345-350- ఒక లాట్‌ 40 షేర్లు

ఇష్యూ ద్వారా రూ. 600 కోట్ల సమీకరణ లక్ష్యం

వ్యూహాత్మక అవసరాలకు నిధుల వినియోగం

ఐపీవోలో భాగంగా ఓమ్నిచానల్‌ క్లౌడ్‌ కమ్యూనికేషన్‌ సర్వీసుల సంస్థ రూట్‌ మొబైల్‌.. యాంకర్‌ ఇన్వెస్టర్ల నుంచి రూ. 180 కోట్లు సమీకరించింది. షేరుకి రూ. 350 ధరలో 15 సంస్థలకు దాదాపు 51.43 లక్షల షేర్లను జారీ చేసింది. ఐపీవోలో ఇన్వెస్ట్‌ చేసిన సంస్థలలో ఎస్‌బీఐ ఎంఎఫ్‌, ఎస్‌బీఐ లైఫ్‌, గోల్డ్‌మన్‌ శాక్స్‌, ఐసీఐసీఐ ప్రు, ఫ్రాంక్లిన్‌ టెంపుల్‌టన్‌ తదితరాలున్నాయి. 

లాట్‌ 40 షేర్లు 
రూట్‌ మొబైల్‌ పబ్లిక్‌ ఇష్యూ నేడు ప్రారంభమైంది. శుక్రవారం(11న) ముగియనున్న ఇష్యూకి ధరల శ్రేణి రూ. 345-350. రిటైల్‌ ఇన్వెస్టర్లు కనీసం 40 షేర్లకు దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. ఇంతకంటే అధికంగా కావాలనుకుంటే రూ. 2 లక్షలకు మించకుండా బిడ్స్‌ దాఖలు చేయవచ్చు. ఇష్యూలో భాగంగా ప్రమోటర్లు సందీప్‌ కుమార్‌ గుప్తా, రాజ్‌దీప్‌ కుమార్‌ గుప్తా రూ. 360 కోట్ల విలువైన షేర్లను విక్రయించనున్నారు. వీటికి అదనంగా మరో రూ. 240 కోట్ల విలువైన షేర్లను కంపెనీ జారీ చేయనుంది. తద్వారా రూ. 600 కోట్లను సమీకరించాలని రూట్‌ మొబైల్‌ భావిస్తోంది. చెల్లింపులు, కొనుగోళ్లు తదితర వ్యూహాత్మక అవసరాలకు నిధులను వినియోగించనున్నట్లు ప్రాస్పెక్టస్‌లో కంపెనీ పేర్కొంది.

కంపెనీ వివరాలు
రూట్‌ మొబైల్‌ 2004లో ఏర్పాటైంది. 30,150 మందికిపైగా క్లయింట్లకు సేవలందించినట్లు పబ్లిక్‌ ఇష్యూ సందర్భంగా కంపెనీ వెల్లడించింది. ప్రధానంగా ఎంటర్‌ప్రైజెస్‌, మొబైల్‌ ఆపరేటర్, బిజినెస్‌ ప్రాసెస్‌ ఔట్‌సోర్సింగ్ విభాగాలలో క్లయింట్లకు సేవలు అందిస్తున్నట్లు తెలియజేసింది. కంపెనీ సర్వీసులలో అప్లికేషన్‌ టు పీర్‌(A2P), పీటూఏ, 2వే మెసేజింగ్‌, ఓటీటీ బిజినెస్‌ మెసేజింగ్‌, వాయిస్‌, ఓమ్ని చానల్‌ కమ్యూనికేషన్‌ తదిరాలున్నాయి. ఆఫ్రికా, ఆసియా పసిఫిక్‌, మధ్యప్రాచ్యం, ఉత్తర అమెరికాలలో సర్వీసులు అందిస్తున్నట్లు తెలియజేసింది. గత ఆర్థిక సంవత్సరం(2019-20)లో నికర లాభం స్వల్పంగా పెరిగి రూ. 80 కోట్లకు చేరువైనట్లు తెలియజేసింది. విదేశాలలో సేవలందిస్తున్న 27 మందిసహా కంపెనీ సిబ్బంది సంఖ్య 291కు చేరినట్లు వెల్లడించింది. ఇప్పటికే లిస్టయిన అఫ్లే ఇండియాతో రూట్‌ మొబైల్‌ కార్యకలాపాలను పోల్చవచ్చని విశ్లేషకులు ఈ సందర్భంగా తెలియజేశారు.  

మరిన్ని వార్తలు