మా ఎలక్ట్రిక్‌ బైక్‌లు మామూలుగా ఉండవు: రాయల్ ఎన్‌ఫీల్డ్ సీఈవో

21 May, 2023 17:00 IST|Sakshi

రాయల్ ఎన్‌ఫీల్డ్ (Royal Enfield) ప్రత్యేకమైన, విభిన్నమైన ఎలక్ట్రిక్ బైక్‌లను అభివృద్ధి చేస్తోందని ఆ కంపెనీ సీఈవో గోవిందరాజన్ తెలిపారు. వీటిని అభివృద్ధి చేయడానికి ఇప్పటికే పెట్టుబడి పెట్టడం ప్రారంభించామని, చెన్నై ప్లాంట్ పరిధిలో సప్లయర్‌ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. 

‘ఈవీ ప్రయాణంలో, మేము స్థిరమైన పురోగతిని సాధిస్తున్నాం. రాయల్ ఎన్‌ఫీల్డ్ ఈవీ ప్రయాణం ఇప్పుడు టాప్ గేర్‌లో ఉందని నేను చెప్పగలను. బలమైన రాయల్ ఎన్‌ఫీల్డ్ డీఎన్‌ఏతో ప్రత్యేకంగా విభిన్నమైన ఎలక్ట్రిక్ మోటార్‌సైకిళ్లను రూపొందించడమే మా లక్ష్యం’ అని విశ్లేషకులతో సమావేశంలో గోవిందరాజన్ పేర్కొన్నారు.

ఎలక్ట్రిక్‌ వాహనాలపై బలమైన దీర్ఘకాలిక ఉత్పత్తి, సాంకేతికత రోడ్‌మ్యాప్‌ను రూపొందించామని, సప్లయర్‌ వ్యవస్థను అభివృద్ధి చేయడంపై ప్రస్తుతం దృష్టి పెడుతున్నామని వెల్లడించారు.  దేశీయ మార్కెట్‌లో నెట్‌వర్క్ విస్తరణ గురించి మాట్లాడుతూ కంపెనీ ప్రస్తుతం దేశమంతటా దాదాపు 2,100 రిటైల్ అవుట్‌లెట్‌లను కలిగి ఉందని వివరించారు.

రూ.1000 కోట్ల పెట్టుబడి
ఎలక్ట్రిక్‌ వాహనాల తయారీ, ఇతర అంశాలపై దృష్టి సారించిన రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి రూ.1,000 కోట్ల క్యాపెక్స్‌ను ప్రకటించింది. ఇందులో కొంత భాగం ప్రస్తుత పెట్రోల్‌ బైక్‌ల తయారీ, కొత్త వాటి అభివృద్ధికి వినియోగించనున్నట్లు పేర్కొంది.

ఇదీ చదవండి: FAME 2 SUBSIDY: ఎలక్ట్రిక్‌ బైక్‌లు కొనేవారికి బ్యాడ్‌ న్యూస్‌.. సబ్బిడీకి కోత పెట్టే యోచనలో ప్రభుత్వం!

మరిన్ని వార్తలు