రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌కి షాక్‌ ! గతేడాదితో పోల్చితే ...

2 Oct, 2021 20:16 IST|Sakshi

ప్రీమియం బైక్‌ సెగ్మెంట్‌లో మార్కెట్‌ నంబర్‌ వన్‌గా కొనసాగుతున్న రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌కి షాక్‌ తగిలింది. కరోనా ఫస్ట్‌ వేవ్‌ కంటే కరోనా సెకండ్‌ వేవ్‌ ఎఫెక్ట్‌ రాయల్ ఎన్‌ఫీల్డ్‌పై బాగా పడింది. ఇటీవల ఆ సంస్థ ప్రకటించిన ఫలితాలు ఇదే విషయాన్ని రుజువు చేస్తున్నాయి. 

భారీగా తగ్గిన అమ్మకాలు
యూత్‌లో విపరీతమైన పాపులారిటీ సాధించిన రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ అమ్మకాలు ఒక్కసారిగా పడిపోయాయి. సెప్టెంబరుకి సంబంధించిన అమ్మకాల వివరాలను రాయల్‌ఎన్‌ఫీల్డ్‌ ప్రకటించింది. ఇందులో 2020 సెప్టెంబరుతో పోల్చితే  ఏకంగా 44 శాతం అమ్మకాలు పడిపోయాయి. గతేడాది ఒక్క సెప్టెంబరులో ప్రపంచ వ్యాప్తంగా 60,331 బైకులు అమ్ముడవగా ఈ ఏడు కేవలం 33,529 బైకులే అమ్ముడయ్యాయి. ఇక దేశీయంగా అమ్మకాలను పరిశీలిస్తే గతేడాది 56,200 బైకులు సేల్‌ అవగా ఈ సారి 27,233 సేల​్‌ అయ్యాయి. దేశీయంగా రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ బైకుల అమ్మకాలు 52 శాతం పడిపోయాయి.

మూడో ఏడు ఇలా
రాయల్‌ఎన్‌ఫీల్డ్‌కి ప్రీమియం సెగ్మెంట్‌లో గత రెండేళ్లుగా ఎదురే లేకుండా పోయింది. 2019-20 ఆర్థిక సంవత్సరంలో దేశీయంగా రాయల్‌ఎన్‌ఫీల్డ్‌ 1,96,635 బైకులు అమ్మగలిగింది. ఆ తర్వాత సంవత్సరం కరోనా ఫస్ట్‌ వేవ్‌ ఎఫెక్ట్‌ ఉన్నా 2,10,270 బైకులు అమ్మింది. దాదాపు 7 శాతం వృద్ధిని అమ్మకాల్లో సాధించింది. ఈసారి అదే జోరు కొనసాగితే పదిశాతాన్ని మించి వృద్ధి రేటు ఉండవచ్చని అంచనాలు ఉండగా సెప్టెంబరులో ఒక్కసారిగా అమ్మకాలు 52 శాతం మేర పడిపోయాయి.

అదే కారణమా ?
కోవిడ్‌ ఫస్ట్‌వేవ్‌ తర్వాత కూడా ఆర్‌ఈ బైకుల అమ్మకాలు జోరు తగ్గలేదు. ఈసారి కూడా సెకండ్‌ వేవ్‌ ప్రభావం తమ అమ్మకాలపై పడలేదని ఆ సంస్థ ప్రతినిధులు అంటున్నారు. అయితే సెమికండక్టర్ల కొరత కారణంగా తయారీ తగ్గిందని చెబుతున్నారు. మార్కెట్‌లో రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌కి ఉన్న క్రేజ్‌ అలాగే ఉందని చెబుతున్నారు. అందుకే సెప్టెంబరులో క్లాసిక్‌ 350 ఫేస్‌ లిఫ్ట్‌ మోడల్‌ రిలీజ్‌ చేశామంటున్నారు. 

చదవండి : బాపు చూపిన బాటలో జెఫ్‌బేజోస్‌, బిల్‌గేట్స్‌....

మరిన్ని వార్తలు