బాబోయ్‌.. నల్లధనంపై రూ.14,820 కోట్ల పన్ను డిమాండ్‌!

26 Jul, 2022 00:58 IST|Sakshi

368 కేసుల విషయంలో నల్లధనం చట్ట ప్రయోగం

ఆర్థికశాఖ మంత్రి వెల్లడి  

న్యూఢిల్లీ: నల్లధనం చట్టం కింద వెల్లడించని విదేశీ ఆదాయానికి సంబంధించి 368 కేసుల్లో (అసెస్‌మెంట్‌ పూర్తయిన తర్వాత) రూ.14,820 కోట్ల పన్ను డిమాండ్‌ నోటీసుల జారీ అయినట్లు ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ వెల్లడించారు. నల్లధనంపై పన్ను వసూళ్లకు సంబంధించి  2022 మే 31వ తేదీ వరకూ డేటాపై లోక్‌సభలో ఆమె ఒక లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు. కొన్ని ముఖ్యాంశాలు పరిశీలిస్తే.. హెచ్‌ఎస్‌బీసీలో రిపోర్టు (పేర్కొనని) చేయని విదేశీ బ్యాంకు ఖాతాల్లో డిపాజిట్లకు సంబంధించిన కేసుల్లో రూ.8,468 కోట్లకు పైగా వెల్లడించని ఆదాయం పన్ను పరిధిలోకి వచ్చిందని తెలిపారు.

దీనికి సంబంధించి రూ.1,294 కోట్లకు పైగా జరిమానా విధించడం జరిగిందని వివరించారు.  30 సెప్టెంబర్‌  2015తో ముగిసిన బ్లాక్‌ మనీ (బహిర్గతం కాని విదేశీ ఆదాయం, ఆస్తులు) ఇంపోజిషన్‌ ఆఫ్‌ టాక్స్‌ యాక్ట్, 2015 కింద ఒన్‌ టైమ్‌ సెటిల్‌మెంట్‌గా (మూడు నెలల పరిమితితో) 648 కేసులకు సంబంధించి రూ.4,164 కోట్ల విలువైన వెల్లడించని ఆస్తులను గుర్తించినట్లు పేర్కొన్నారు. ఈ కేసుల్లో రూ.2,476 కోట్లకుపైగా మొత్తాన్ని పన్నులు, పెనాలిటీ రూపంలో వసూలయినట్లు ఆమె తెలిపారు.  

భారతీయులు స్విస్‌ బ్యాంకుల్లో డిపాజిట్‌ చేసిన డబ్బుపై అడిగిన ప్రశ్నలకు సీతారామన్‌ సమాధానం చెబుతూ, ‘‘భారత పౌరులు, కంపెనీలు స్విస్‌ బ్యాంకుల్లో డిపాజిట్‌ చేసిన డబ్బుపై అధికారిక అంచనా లేదు’’ అని ఆర్థికమంత్రి అన్నారు.  భారతదేశ నివాసితులు స్విట్జర్లాండ్‌లో కలిగి ఉన్న డిపాజిట్లను విశ్లేషించడానికి స్విస్‌ నేషనల్‌ బ్యాంక్‌ (ఎస్‌ఎన్‌బీ) వార్షిక బ్యాంకింగ్‌ స్టాటిస్టిక్స్‌  సోర్స్‌ను ఉపయోగించరాదని స్విస్‌ అధికారులు తెలియజేసినట్లు మంత్రి తెలిపారు.

స్విట్జర్లాండ్‌లో ఉన్న భారతీయ నివాసితుల డిపాజిట్లను విశ్లేషించడానికి బ్యాంక్‌ ఫర్‌ ఇంటర్నేషనల్‌కు సెటిల్‌మెంట్‌ (బీఐఎస్‌)కు చెందిన ‘‘లొకేషనల్‌ బ్యాంకింగ్‌ స్టాటిస్టిక్స్‌’’ అని పిలిచే మరొక డేటా సోర్స్‌ను వినియోగించుకోవచ్చని కూడా వారు వెల్లడించినట్లు తెలిపారు. లొకేషనల్‌ బ్యాంకింగ్‌ స్టాటిస్టిక్స్‌ ప్రకారం,  2021లో స్విస్‌ బ్యాంకుల్లో భారతీయుల డిపాజిట్లలో 8.3 శాతం క్షీణత నమోదయినట్లు మీడియా నివేదికలు తెలుపుతున్నట్లు ఆర్థికమంత్రి తెలిపారు.  వెల్లడించని విదేశీ ఆస్తులు, ఆదాయాలపై పన్ను విధించేందుకు ప్రభుత్వం ఇటీవలి కాలంలో చేపట్టిన పలు చర్యలను కూడా ఆమె ఈ సందర్భంగా సభకు
వివరించారు.
 

మరిన్ని వార్తలు