2,000 కరెన్సీ నోట్లు : ఆర్‌బీఐ షాకింగ్‌ నివేదిక

28 May, 2022 09:47 IST|Sakshi

మార్చినాటికి చెలామణి నోట్లలో కేవలం 1.6 శాతం వాటా

నోట్ల సంఖ్య 214 కోట్లు

 పరిశీలనలో వర్చువల్‌ కరెన్సీ 

ఆర్‌బీఐ వార్షిక నివేదిక వెల్లడి  

ముంబై: ఆర్థిక వ్యవస్థ నుంచి 2000 వేల రూపాయల నోట్లు క్రమంగా వెనక్కుమళ్లుతున్నాయి. 2022 మార్చి నాటికి చెలామణిలో ఉన్న మొత్తం నోట్లలో వీటి శాతం కేవలం 1.6 శాతానికి పడిపోయింది. నోట్ల సంఖ్య 214 కోట్లుగా ఉంది. ఆర్‌బీఐ 2021–22 వార్షిక నివేదిక ఈ విషయాన్ని వెల్లడించింది. రుణ వృద్ధిలో బ్యాంకింగ్‌ కీలకపాత్ర పోషించాలని నివేదిక సూచిస్తూనే, అదే సమయంలో రుణ పునర్‌వ్యవస్థీకరణకు సంబంధించిన అకౌంట్ల పనితీరును జాగ్రత్తగా ఎప్పటికప్పుడు పరిశీలించాలని, బ్యాలెన్స్‌ షీట్ల పటిష్టతపై దృష్టి సారించాలని ఉద్ఘాటించింది.దేశంలో వర్చువల్‌ కరెన్సీని ప్రవేశపెట్టడం వల్ల కలిగే లాభ,నష్టాలను పరిశీలిస్తున్నామని తెలిపింది. డిజిటల్‌ కరెన్సీని ప్రారంభించేందుకు  గ్రేడెడ్‌ విధానాన్ని (దశలవారీ పరిశీలిలన) అవలంబిస్తామని పేర్కొంది.

నివేదికలోని కొన్ని ముఖ్యాంశాలు పరిశీలిస్తే..
ఈ ఏడాది మార్చి నాటికి మొత్తం చెలామణిలో ఉన్న అన్ని డినామినేషన్ల కరెన్సీ నోట్ల సంఖ్య 13,053 కోట్లు. 2021 ఇదే నెల్లో ఈ నోట్ల సంఖ్య 12,437 కోట్లు.  మార్చి 2020 చివరి నాటికి, చెలామణిలో ఉన్న రూ. 2000 డినామినేషన్‌ నోట్ల సంఖ్య 274 కోట్లు. ఇది మొత్తం చెలామణిలో ఉన్న కరెన్సీ నోట్లలో 2.4 శాతం. మార్చి 2021 నాటికి చెలామణిలో ఉన్న మొత్తం బ్యాంకు నోట్లలో 245 కోట్లకు లేదా 2 శాతానికి ఈ పరిమాణం క్షీణించింది. ఇక గత ఆర్థిక సంవత్సరం చివరి నాటికి 214 కోట్లకు (1.6 శాతానికి) పడిపోయింది. విలువ పరంగా కూడా రూ. 2000 డినామినేషన్‌ నోట్లు చెలామణిలో ఉన్న మొత్తం కరెన్సీ నోట్ల విలువలో 22.6 శాతం నుండి మార్చి 2021 చివరి నాటికి 17.3 శాతానికి, మార్చి 2022 చివరి నాటికి 13.8 శాతానికి తగ్గాయి.

నివేదిక ప్రకారం ఈ ఏడాది మార్చి చివరి నాటికి చెలామణిలో ఉన్న రూ.500 డినామినేషన్‌ నోట్ల సంఖ్య 3,867.90 కోట్ల నుంచి 4,554.68 కోట్లకు పెరిగింది. పరిమాణం పరంగా మొత్తం బ్యాంక్‌ నోట్లలో మార్చి చివరినాటికి రూ. 500 డినామినేషన్‌ అత్యధికంగా 34.9 శాతం వాటాను కలిగి ఉంది. ఆ తర్వాత రూ. 10 డినామినేషన్‌ బ్యాంక్‌ నోట్ల వెయిటేజ్‌ చెలామణిలో ఉన్న నోట్లలో 21.3 శాతంగా ఉంది. రూ.500 డినామినేషన్‌ నోట్లు మార్చి 2021 చివరి నాటికి 31.1 శాతం. మార్చి 2020 నాటికి 25.4 శాతం వాటా కలిగి ఉంది. విలువ పరంగా చూస్తే, ఈ నోట్లు మార్చి 2020 నుండి మార్చి 2022 వరకు 60.8 శాతం నుండి 73.3 శాతానికి పెరిగాయి. 

2021 మార్చి చివరినాటికి రూ.28.27 లక్షల కోట్లుగా ఉన్న అన్ని డినామినేషన్ల మొత్తం కరెన్సీ నోట్ల విలువ ఈ ఏడాది మార్చి చివరి నాటికి రూ.31.05 లక్షల కోట్లకు పెరిగింది. విలువ పరంగా రూ. 500, రూ. 2000 నోట్ల వాటా 31 మార్చి 2022 నాటికి చెలామణిలో ఉన్న బ్యాంక్‌ నోట్ల మొత్తం విలువలో 87.1 శాతం. ఇది మార్చి 2021 నాటికి 85.7 శాతం. చెలామణిలో ఉన్న బ్యాంకు నోట్ల విలువ–పరిమాణం 2020–21లో వరుసగా 16.8 శాతం, 7.2 శాతం పెరిగాయి.  2021–22లో వరుసగా ఈ పెరుగుదల 9.9 శాతం, 5 శాతంగా ఉంది. 

చెలామణిలో ఉన్న కరెన్సీ (సీఐసీ) బ్యాంకు నోట్లు,  నాణేల రూపంలో ఉంది. ప్రస్తుతం రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) రూ. 2, రూ. 5, రూ. 10, రూ. 20, రూ. 50, రూ. 100, రూ. 200, రూ. 500, రూ. 2000 డినామినేషన్లలో బ్యాంకు నోట్లను జారీ చేస్తోంది. 50 పైసలు, రూ. 1, రూ. 2, రూ. 5, రూ. 10, రూ. 20 నాణేలు చెలామణిలో ఉన్నాయి.  

పెరిగిన ఆర్‌బీఐ బ్యాలెన్స్‌ షీట్‌ 
నివేదిక ప్రకారం, రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) బ్యాలెన్స్‌ షీట్‌ 8.46 శాతం పెరిగి రూ.61.9 లక్షల కోట్లకు చేరింది. కరెన్సీ జారీ కార్యకలాపాలు, ద్రవ్య విధానం, నగదు నిల్వల నిర్వహణ, ఇందుకు అనుగుణంగా నిర్వహించే విధులను ఆర్‌బీఐ బ్యాలెన్స్‌ షీట్‌ ప్రతిబింబిస్తుంది. సెంట్రల్‌ బ్యాంక్‌ ఆదాయం 20.14 శాతం పెరిగితే, వ్యయాలు భారీగా 280.13 శాతం పెరిగి 1,29,800.68 కోట్లకు చేరాయి.  2020–21లో మొత్తం మిగులు రూ.99,122 కోట్లయితే, 2021–22లో ఈ పరిమాణం 69.42 శాతం తగ్గి రూ.30,307.45 కోట్లకు చేరింది. ఈ మొత్తాన్ని కేంద్రానికి డివిడెండ్‌గా ఇవ్వాలని గతవారం ఆర్‌బీఐ నిర్ణయించింది. 2022 మార్చి నాటికి మొత్తం అసెట్స్‌లో దేశీయ అసెట్స్‌ వెయిటేజ్‌ 28.22 శాతం అయితే, ఫారిన్‌ కరెన్సీ అసెట్స్, పసిడి (గోల్డ్‌ డిపాజిట్లు, నిల్వలు) వాటా 71.78 శాతంగా ఉంది. 2021 మార్చి నాటికి ఈ వెయిటేజ్‌లు వరుసగా 26.42 శాతం, 73.58 శాతాలుగా ఉన్నాయి. గోల్డ్‌ హోల్డింగ్స్‌ ఇదే కాలంలో 695.31 మెట్రిక్‌ టన్నుల నుంచి 760.42 మెట్రిక్‌ టన్నులకు చేరింది. కాగా ఉద్యోగుల వ్యయాలు 19.19 శాతం తగ్గి రూ.4,788.03 కోట్ల నుంచి రూ.3,869.43 కోట్లకు తగ్గాయి. 2021–22లో వివిధ సూపర్‌యాన్యుయేషన్‌ ఫండ్స్‌కు (ఉద్యోగుల పెన్షన్‌ ప్రణాళికలకు) సంబంధించి చెల్లింపులు తగ్గడం దీనికి కారణం.

సంస్కరణలు, ద్రవ్యోల్బణం కట్టడే కీలకం  
సుస్థిర, సమతౌల్య, సవాళ్లను ఎదుర్కొనగలిగే ఆర్థిక వృద్ధికి వ్యవస్థాగత సంస్కరణలు కీలకమని ఆర్‌బీఐ పేర్కొంది. ముఖ్యంగా మహమ్మారి సవాళ్లు, భౌగోళిక ఉద్రిక్తతల నేపథ్యంలో ఆర్థిక సంస్కరణల వేగవంతం ముఖ్యమని వివరించింది. దీనితోపాటు ద్రవ్యోల్బణం కట్టడి, మూలధన వ్యయాల పెంపు, పటిష్ట ద్రవ్య విధానాలు, సరఫరాల సమస్యలు అధిగమించడం కూడా ఎకానమీ పురోగతిలో కీలకమని వివరించింది. ప్రస్తుతం ఎకానమీ ఎదుర్కొంటున్న ప్రధాన సవాళ్లలో ద్రవ్యోల్బణం ఒకటని వివరించింది. ఎకానమీ రికవరీలో స్పీడ్‌ తగ్గిందని కొన్ని హై–ఫ్రీక్వెన్సీ ఇండికేటర్లు సంకేతాలు ఇచ్చినట్లు తెలిపింది. ద్రవ్యోల్బణం కట్టడికి ప్రభుత్వ సహకారం, సమన్వయంతో ఆర్‌బీఐ తగిన అన్ని చర్యలూ తీసుకుంటుందని స్పష్టం చేసింది. భౌగోళిక ఉద్రిక్తతలు సమసిపోయి, కోవిడ్‌ తదుపరి వేవ్‌లు తగ్గితే తిరిగి ఎకానమీ స్పీడ్‌ అందుకుంటుందన్న భరోసాను వెలిబుచ్చింది. అధిక టోకు ధరల సూచీ ఆధారిత ద్రవ్యోల్బణం వినియోగ ధరల సూచీ ఆధారిత రిటైల్‌ ధరలపై ఒత్తిడి తెస్తుందని ఆర్‌బీఐ పేర్కొంది. 

మరిన్ని వార్తలు